Share News

Sathya Sai Centenary Celebrations: సత్యసాయి శతజయంతి వేడుకలు వచ్చే వందేళ్ల సేవలకు పునాది

ABN , Publish Date - Nov 20 , 2025 | 05:07 AM

సత్యసాయి శత జయంతి వేడుకలు వచ్చే వందేళ్లపాటు చేయబోయే సేవలకు పునాది కావాలని సత్యసాయి సెంట్రల్‌ ట్రస్టు మేనేజింగ్‌ ట్రస్టీ ఆర్‌జే రత్నాకర్‌ ఆకాంక్షించారు....

Sathya Sai Centenary Celebrations: సత్యసాయి శతజయంతి వేడుకలు వచ్చే వందేళ్ల సేవలకు పునాది

  • సెంట్రల్‌ ట్రస్ట్‌ మేనేజింగ్‌ ట్రస్టీ రత్నాకర్‌ ఆకాంక్ష

పుట్టపర్తి, నవంబరు 19(ఆంధ్రజ్యోతి): సత్యసాయి శత జయంతి వేడుకలు వచ్చే వందేళ్లపాటు చేయబోయే సేవలకు పునాది కావాలని సత్యసాయి సెంట్రల్‌ ట్రస్టు మేనేజింగ్‌ ట్రస్టీ ఆర్‌జే రత్నాకర్‌ ఆకాంక్షించారు. శత జయంతి వేడుకలలో భాగంగా బుధవారం హిల్‌ వ్యూ స్టేడియంలో ‘శ్రీసత్యసాయి అంతర్జాతీయ మహిళా సదస్సు’ను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రత్నాకర్‌ ప్రసంగించారు. ‘‘సత్యసాయి 1940లో తన 14వ ఏట ‘అందిరినీ ప్రేమించు.. అందరినీ సేవించు’ అనే సేవా మార్గాన్ని పుట్టపర్తిలో ప్రారంభించారు. ఆయనకు జన్మభూమి, కర్మభూమి పుట్టపర్తి. సత్యసాయి భక్తులు, విద్యార్థులు, సేవా దళ్‌ సహకారంతో సత్యసాయి శివైక్యం అయిన తరువాత 15 సంవత్సరాలుగా ఆయన చేపట్టిన సేవలను పారదర్శకంగా కొనసాగిస్తున్నాం. వేడుకలకు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సత్యసాయి కుటుంబం హాజరవుతోంది. అందరికీ ధన్యవాదాలు. సత్యసాయి బాబా తల్లికి చదువు రాకపోయినా, ఆమె కోరిక మేరకే సత్యసాయి చిన్న విద్యాసంస్థను ప్రారంభించారు. యూనివర్సిటీస్థాయికి అభివృద్ధి చేశారు. లక్షల మందికి ఉచిత విద్యను అందిస్తున్నారు. కుగ్రామమైన పుట్టపర్తిలో పేదల కోసం ఉచిత వైద్యం ప్రారంభించాలని నాడు సాయిబాబా తల్లి కోరారు. ఆమె కోరిక మేరకు చిన్న ఆస్పత్రిని ప్రారంభించి.. సూపర్‌ స్పెషాలిటీ స్థాయికి అభివృద్ధి చేశారు. లక్షల మందికి ఉచిత వైద్య సేవలు అందుతున్నాయి. తల్లిప్రేమ, మాతృభూమి ప్రేమ ఉంటే.. ఆ వ్యక్తి సేవలు విశ్వవ్యాప్తం అవుతాయని అనడానికి సత్యసాయి సేవలే నిదర్శనం. రాష్ట్ర ప్రభుత్వం సత్యసాయి శత జయంతి వేడుకలను రాష్ట్ర పండుగగా జరపాలని నిర్ణయించినందుకు సీఎం చంద్రబాబుకు కృతజ్ఞతలు’’ అని అన్నారు.

కొత్త సేవా కార్యక్రమాలకు శ్రీకారం

సత్యసాయి ట్రస్టు ప్రధాని చేతులమీదుగా గోదానం కింద పేద రైతులకు గిర్‌ ఆవులను పంపిణీ చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. పుట్టపర్తికి చెందిన ముగ్గురు రైతులకు మోదీ ప్రశాంతి నిలయంలో గిర్‌ ఆవులను అందించారు. శ్రీసత్యసాయి జిల్లా ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పదేళ్లలోపు 20 వేలమంది బాలికలకు కేంద్ర పథకం సుకన్య సమృద్ధి యోజనను ట్రస్టు అందించే కార్యక్రమాన్నీ ప్రధాని ప్రారంభించారు. ట్రస్టు ఆధ్వర్యంలో బాలికల పేరిట పోస్టాఫీసు ఖాతాలను తెరిచి, సొమ్ము జమ చేస్తారు. ప్రధాని వేదికపై ముగ్గురు బాలికలకు పోస్టల్‌ ఖాతా పాసు పుస్తకాలను అందించారు.

Updated Date - Nov 20 , 2025 | 05:07 AM