Share News

CM Chandrababu Naidu: సాయి మార్గాన నడుద్దాం

ABN , Publish Date - Nov 24 , 2025 | 04:06 AM

భగవాన్‌ సత్యసాయి 1926 నవంబరు 23న ఒక లక్ష్యం కోసం ఈ పుణ్యభూమిలో అవతరించిన మహోన్నత వ్యక్తి అని సీఎం చంద్రబాబు తెలిపారు.

CM Chandrababu Naidu: సాయి మార్గాన నడుద్దాం

  • విశ్వ శాంతిని, సకల జనుల సంక్షేమాన్ని కోరుకున్నారు

  • జ్ఞానబోధతో భక్తులకు సన్మార్గం చూపారు

  • పుట్టపర్తిని ఆధ్యాత్మికతకు, దైవత్వానికి నిలయంగా మార్చారు

  • 75 ఏళ్ల ప్రశాంతి నిలయం ఓ ఎనర్జీ సెంటర్‌

  • సెంట్రల్‌ ట్రస్టు ద్వారా దేశవిదేశాల్లో సేవలు: సీఎం చంద్రబాబు

సత్యసాయిబాబా శతజయంత్యుత్సవాలు ఆదివారం పుట్టపర్తిలో ఘనంగా జరిగాయి. ఆయన చూపిన మార్గంలో పయనిద్దామని ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్‌, పలువురు ప్రముఖులు పిలుపిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం, సత్యసాయి సెంట్రల్‌ ట్రస్టు ఉమ్మడిగా నిర్వహించిన ఈ వేడుకల్లో ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ సీఎంలు చంద్రబాబు, రేవంత్‌రెడ్డి, త్రిపుర గవర్నర్‌ ఇంద్రసేనారెడ్డి, మేఘాలయ, ఉత్తరాఖండ్‌ హైకోర్టుల చీఫ్‌ జస్టిస్‌లు, రాష్ట్ర మంత్రులు లోకేశ్‌, సవిత తదితరులు పాల్గొన్నారు. దేశ విదేశాల నుంచి వచ్చిన భక్తులు సత్యసాయి మహాసమాధిని దర్శించుకున్నారు. మంగళవాయిద్యాలు, భజనలు, సాయినామ జపంతో పుట్టపర్తి మార్మోగింది.

భగవాన్‌ సత్యసాయి 1926 నవంబరు 23న ఒక లక్ష్యం కోసం ఈ పుణ్యభూమిలో అవతరించిన మహోన్నత వ్యక్తి అని సీఎం చంద్రబాబు తెలిపారు. ఈ పవిత్ర నేలపై 86 ఏళ్లపాటు తన జీవన ప్రయాణాన్ని సాగించిన బాబా, తన బోధనలను ప్రపంచానికి అందించారన్నారు. భక్తులకు జ్ఞానాన్ని బోధించి, సన్మార్గం చూపారని కొనియాడారు. సత్యసాయి శతజయంత్యుత్సవాల్లో ఆయన ప్రసంగించారు. మానవ రూపంలో మనం చూసిన దైవమే బాబా అని కొనియాడారు. ‘సమాజ సేవ, సమస్యకు పరిష్కారం, ఆధ్యాత్మిక భావన, ప్రశాంత జీవనం, ముక్తి మార్గంతో కోట్ల మంది జీవితాలను బాబా ప్రభావితం చేశారు. ఎనిమిదేళ్ల వయసు నుంచే దైవచింతన కలిగి భిన్నంగా వ్యవహరించారు. 1940 మే 23న సత్యసాయి వయసు 14 ఏళ్లు. అప్పుడే ఆయన సత్యనారాయణరాజు నుంచి సత్యసాయిగా సాక్షాత్కరించారు. అవతరించడానికి ఈ పుణ్యభూమిని ఎంచుకున్నారు. చిత్రావతి నది ఒడ్డున పుట్టపర్తిని ఆధ్యాత్మికతకు, దైవత్వానికి నిలయంగా మార్చారు. లవ్‌ ఆల్‌-సర్వ్‌ ఆల్‌, హెల్ప్‌ ఎవర్‌-హర్ట్‌ నెవర్‌ అని బోధించారు. సత్యం, ధర్మం, శాంతి, ప్రేమ, అహింస సిద్ధాంతాలతో నూతనాధ్యాయం ప్రారంభించారు.


విశ్వశాంతి, విశ్వ సౌభాగ్యం, సకల జనుల సంక్షేమాన్ని ఆయన కోరుకున్నారు. భగవాన్‌ మనో దర్శనం ద్వారా దేశ, విదేశాల నుంచి సంపన్నులు, ప్రముఖులు వచ్చి ఆయన సేవా మార్గాన్ని అనుసరించారు. ఎవరూ పిలవకున్నా.. వారంతటవారే వచ్చి ఆయన సిద్ధాంతాన్ని పాటించారు. డబ్బు, పదవి, పేరు ఉన్నా.. ఎక్కడా లేని ప్రశాంతత పుట్టపర్తిలో పొందారు. బాబా లేకపోయినా ఆయన నింపిన స్ఫూర్తి ఉంది. శతజయంతితోపాటు ఈ రోజుకు మరో విశిష్ఠత ఉంది. ప్రశాంతి నిలయాన్ని నిర్మించి 75 ఏళ్లయింది. ఇది ఆధ్యాత్మిక సంబరాలకు వేదికైంది. భక్తుల బాధలు, కష్టాలకు పరిష్కారం చూపే నిలయంగా మారింది. ప్రశాంతి నిలయం ఒక ఎనర్జీ సెంటర్‌’ అని అన్నారు.


సత్యసాయి సంస్థలతో సేవలకు రూపం

మానవ సేవే.. మాధవ సేవగా భావించే బాబా.. సత్యసాయి సెంట్రల్‌ ట్రస్టు ద్వారా సేవలను మరింత విస్తరించారని చంద్రబాబు చెప్పారు. విద్య నుంచి వైద్యం వరకు, తాగునీటి నుంచి మానసిక సంతృప్తి వరకూ అందరికీ అన్నీ దక్కేలా చేశారని.. 1960లో ఆయన స్థాపించిన సత్యసాయి సంస్థలతో సేవలకు రూపం వచ్చిందని తెలిపారు. ‘ట్రస్టు ద్వారా దేశ, విదేశాల్లో అనేక సేవలు అందుతున్నాయి. 140 దేశాల్లోని 2 వేల కేంద్రాలకు ఇది విస్తరించిందంటే బాబా సేవలు ఏ పాటివో అర్థం చేసుకోవచ్చు. ఈ రోజుకు కూడా 7.50 లక్షల మంది సేవాదళ్‌ సభ్యులు ఉన్నందుకు గర్వపడుతున్నాను. 102 సత్యసాయి పాఠశాలల్లో 60 వేల మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. రూ.550 కోట్లతో ఏపీ, తెలంగాణ, తమిళనాడుల్లోని 1,600 గ్రామాల్లో 30 లక్షల మందికిపైగా ప్రజలకు తాగునీటిని అందిస్తున్నారు. చెన్నై తాగునీటి పథకం ఆధునికీకరణకు సత్యసాయి రూ.250 కోట్లు ఖర్చు పెట్టారు. ఆయన సేవలను చాటేందుకు రాష్ట్రప్రభుత్వం అధికారికంగా శతజయంత్యుత్సవాలు నిర్వహిస్తోంది. తెలంగాణ ప్రభుత్వం కూడా ఈ ఉత్సవాలను అధికారికంగా నిర్వహిస్తున్నందుకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని అభినందిస్తున్నాను’ అని తెలిపారు. సత్యసాయి సిద్ధాంతాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు బాబా ఇక్కడకు రప్పించారని, వేడుకలకు హాజరైన ప్రతి ఒక్కరినీ అభినందిస్తున్నానన్నారు. మనది వసుధైక కుటుంబం.. ఇది భారతీయులకు మూలం.. సత్యసాయి బోధనల ద్వారా దీనిని నిలబెట్టుకుందామని భక్తులకు పిలుపిచ్చారు.


సత్యసాయి సేవలు అపూర్వం

మానవ విలువల వికాసానికి సత్యసాయి అందించిన సేవలు అపూర్వం. మానవత్వం, దైవత్వం మధ్య ఉన్న దూరాన్ని తగ్గించేందుకు సత్యసాయి ట్రస్టును ఏర్పాటు చేయడం బాబా తీసుకున్న దైవ నిర్ణయం. సమానత్వం, సేవ, ఆధ్యాత్మికత ట్రస్టు మూలధ్యేయాలు. పుట్టపర్తిలో స్థానికుల కోసం చిన్నపాటి జనరల్‌ ఆస్పత్రిగా ప్రారంభమైన వైద్యసేవలు ప్రపంచ స్థాయికి చేరాయి. ఉచిత కార్డియాక్‌, సూపర్‌ స్పెషాలిటీ వైద్య సంస్థలుగా ఎదగడం బాబా దివ్యకార్యానికి నిదర్శనం. సత్యసాయి ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హ్యూమన్‌ లెర్నింగ్‌,, సాయి పాఠశాలల్లో అందిస్తున్న విలువలతో కూడిన ఉచిత విద్య.. విద్యార్థుల తెలివితేటలతోపాటు వ్యక్తిత్వాన్ని నిర్మించడంలో గొప్ప పాత్ర పోషిస్తున్నాయి.

- ఎన్‌.ఇంద్రసేనారెడ్డి, త్రిపుర గవర్నర్‌

Updated Date - Nov 24 , 2025 | 04:09 AM