Centenary Celebrations: సర్వం.. సాయి స్మరణ
ABN , Publish Date - Nov 24 , 2025 | 03:56 AM
సత్యమే యథార్థం. అదే నా తత్వం. నాపేరు కూడా సత్యం. నా ప్రచారమే సత్యం. నేనే సత్యం.. అని ప్రకటించుకున్న పుట్టపర్తి సత్యసాయిబాబా...
సత్యసాయి నామంతో పులకించిన పుట్టపర్తి
కనులపండువగా శత జయంతి వేడుకలు
స్వర్ణ రథంపై బాబా చిత్రపటం ఊరేగింపు
అలరించిన సంగీత, నృత్య, కళా ప్రదర్శనలు
తరలివచ్చిన లక్షలాది దేశ విదేశీ భక్తులు
ప్రభుత్వం, సెంట్రల్ ట్రస్టు ఆధ్వర్యంలో దిగ్విజయంగా జరిగిన వేడుకలు
ఉపరాష్ట్రపతి, చంద్రబాబు, రేవంత్ హాజరు
ఇంద్రసేనారెడ్డి, పలువురు సీజేలు, మంత్రులూ
పుట్టపర్తి, నవంబరు 23 (ఆంధ్రజ్యోతి): ‘సత్యమే యథార్థం. అదే నా తత్వం. నాపేరు కూడా సత్యం. నా ప్రచారమే సత్యం. నేనే సత్యం..’ అని ప్రకటించుకున్న పుట్టపర్తి సత్యసాయిబాబా శత జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. శ్రీసత్యసాయి జిల్లా పుట్టపర్తిలో రాష్ట్ర ప్రభుత్వం, సత్యసాయి సెంట్రల్ ట్రస్టు సంయుక్తంగా నిర్వహించిన ఈ వేడుకలకు దేశ విదేశాల నుంచి లక్షలాది మంది భక్తులు, ప్రముఖులు తరలివచ్చారు. వేడుకలలో చివరి రోజు, సత్యసాయి జయంతి అయిన ఆదివారం పుట్టపర్తిలోని హిల్ వ్యూ స్టేడియం ఉదయం ఏడు గంటలకే భక్తజనంతో నిండిపోయింది. నిర్మల, నిస్వార్థ సేవ, ప్రేమను పంచిన సత్యసాయికి జయము జయము అని భక్తులు స్మరించుకున్నారు. భక్తుల భజనలు, కళాకారుల నృత్యాలు అలరించాయి. విద్యార్థుల వేదపఠనంతో స్టేడియం మారుమోగింది. సత్యసాయి విద్యార్థులు బ్యాండ్‌మేళం, మంగళవాయిద్యాలు, భజనలు, భక్తిపాటలతో ర్యాలీగా సత్యసాయి స్వర్ణ రథంతో స్టేడియానికి చేరుకున్నారు. వాయిద్యకారుడు శివమణి, గాయకుడు మనో తమ ప్రదర్శనలతో అలరించారు. శాంతి వేదిక వద్దకు చేరుకున్న స్వర్ణ రథానికి సత్యసాయి సెంట్రల్ ట్రస్టు మేనేజింగ్ ట్రస్టీ ఆర్‌జే రత్నాకర్ మంగళహారతి ఇచ్చారు. అనంతరం వేదికపై సత్యసాయి శత జయంతి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. జాతీయ గీతం ఆలాపన, విద్యార్థుల వేదపారాయణంతో కార్యక్రమం ప్రారంభమైంది.
ఉప రాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్, తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు, రేవంత్ రెడ్డి, త్రిపుర గవర్నర్ ఇంద్రసేనారెడ్డి, మేఘాలయా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సౌమన్ సేన్, ఉత్తరాఖండ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ గుహనాథన్ నరేందర్, మంత్రులు నారా లోకేశ్, సవిత, సత్యకుమార్ యాద వ్, అనగాని సత్యప్రసాద్, హిందూపురం ఎంపీ బీకే పార్థసారథి, పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సింధూరా రెడ్డి, సత్యసాయి గ్లోబల్ కౌన్సిల్ చైర్మన్ చక్రవర్తి, వైస్ చైర్మన్, అఖిల భారత సత్యసాయి సేవా సంస్థల అధ్యక్షుడు నిమీష్ పాండే తదితరులు వేదికపై ఆశీనులయ్యారు.
వేడుకలు దిగ్విజయం
సత్యసాయి శత జయంతి వేడుకలను ప్రశాంతి నిలయంలోని సభామండపంలో ఘనంగా నిర్వహించారు. సాయి కుల్వంత్ మందిరంలోని సత్యసాయి మహాసమాధిని ప్రత్యేకంగా అలంకరించి, పూజలు చేశారు. విద్యార్థుల వేదపఠనం, భక్తి నివేదనం పేరిట భక్తి గీతాల ఆలాపన చేశారు. భక్తులు పెద్దఎత్తున సత్యసాయి మహాసమాధిని దర్శించుకున్నారు. శతజయంతి ఉత్సవాలకు వచ్చిన లక్షలాది మంది భక్తులతో పుట్టపర్తి వీధులు కిటకిటలాడాయి. సాయి నామస్మరణతో పురవీధులు మార్మోగాయి. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సెంట్రల్ ట్రస్టు సభ్యులు, సేవాదళ్, అధికార, పోలీసు యంత్రాంగం అన్ని చర్యలు తీసుకున్నాయి. బాబా శతజయంతి ఉత్సవాలు దిగ్విజయంగా ముగిశాయి. ఉత్సవాలకు వచ్చిన భక్తులకు పలువురు అన్నదానం చేశారు.
ఉప రాష్ట్రపతికి సన్మానం
శత జయంతి వేడుకలలో రెండు రోజులపాటు పాల్గొన్న ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్‌ను ట్రస్టీ ఆర్‌జే రత్నాకర్ ఘనంగా సత్కరించారు. ప్రశాంతి నిలయంలో బస చేసిన ఆయన.. వేడుకల అనంతరం తిరుగు ప్రయాణమయ్యారు. ఉప రాష్ట్రపతికి సత్యసాయి చిత్రపటాన్ని ఆర్‌జే రత్నాకర్ అందజేసి, ధన్యవాదాలు తెలిపారు.
భక్తులే మూలస్తంభాలు: రత్నాకర్
భగవాన్ సత్యసాయి బాబా ప్రారంభించిన సత్యసాయి మిషన్‌కు భక్తులే మూలస్తంభాలు అని సెంట్రల్ ట్రస్టు మేనేజింగ్ ట్రస్టీ ఆర్‌జే రత్నాకర్ అన్నారు. వేడుకలకు హాజరైన ఉపరాష్ట్రపతి, తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సహా వీవీఐపీలకు ధన్యవాదాలు తెలిపారు. మారుమూల గ్రామం పుట్టపర్తిలో 1940లో సత్యసాయి తన అవతార ప్రకటన చేశారని అన్నారు. ఆనాటి నుంచి ప్రేమ, శాంతి, ఆధ్యాత్మికత, సేవలను రాష్ట్రం, దేశం దాటి విశ్వవ్యాప్తం చేశారని అన్నారు. మాతృమూర్తి ఈశ్వరమ్మకు ఇచ్చిన మాట మేరకు సత్యసాయి ప్రశాంతి నిలయం వేదికగానే తన ప్రేమతత్వాన్ని ప్రపంచానికి చాటారని అన్నారు. నేడు ప్రశాంతి నిలయం విశ్వశాంతి వేదికగా విస్తరించిందన్నారు.
సాయి భోజనం సాధారణం
సత్యసాయి సాధారణ భోజనాన్ని తీసుకునేవారని, రాగిముద్దనే తినేవారని రత్నాకర్ గుర్తు చేసుకున్నారు. ‘నా చదువు పూర్తి అయిన తరువాత ఏమి చేయాలని అడిగాను. నిన్ను నువ్వు గౌరవించుకోలేని పని చేయవద్దు అని సత్యసాయి సూచించారు. ఆ తరువాత ట్రస్టు సభ్యుడిగా నువ్వు ఒక వ్యక్తివి మాత్రమే, నీ విధి నీవు నిర్వర్తించు అని సూచించారు. ట్రస్టు సమష్టి అని, అంతా సాఫీగా సాగుతుందని చెప్పేవారు. సత్యసాయికి కనీసం బ్యాంకు ఖాతా కూడా లేదు. అయితే సాయితత్వం విశ్వవ్యాప్తం అయింది’ అని అన్నారు.