TDP Leaders: లచ్చన్న జీవితం ఆదర్శం
ABN , Publish Date - Aug 17 , 2025 | 05:18 AM
బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం డాక్టర్ సర్దార్ గౌతు లచ్చన్న తన జీవితాంతం పాటుపడ్డారని మంత్రి సంజీవరెడ్డిగారి సవిత అన్నారు.
గీత కార్మికులకు ఆదరణ 3.0 ద్వారా మోపెడ్లు
హార్టీకల్చర్ కేంద్రంలో తాటి ఉత్పత్తుల తయారీ
లచ్చన్న జయంత్యుత్సవంలో మంత్రి ఎస్. సవిత
విజయవాడ(వన్‌టౌన్), ఆగస్టు 16(ఆంధ్రజ్యోతి): బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం డాక్టర్ సర్దార్ గౌతు లచ్చన్న తన జీవితాంతం పాటుపడ్డారని మంత్రి సంజీవరెడ్డిగారి సవిత అన్నారు. స్వాతంత్య్ర సమరయోధుడు గౌతు లచ్చన్న 116వ రాష్ట్ర స్థాయి జయంత్యుత్సవం విజయవాడలోని తుమ్మలపల్లి వారి క్షేత్రయ్య కళాక్షేత్రంలో బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో శనివారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి సవిత, పలువురు మంత్రులు, ప్రజా ప్రతినిధులు గౌతు లచ్చన్న విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి సవిత మాట్లాడుతూ.. త్వరలో ఆదరణ 3.0 పథకాన్ని ప్రారంభించనున్నామని, ఈ పథకం ద్వారా గీత కార్మికులకు మోపెడ్, ద్విచక్ర వాహనాలు అందజేయబోతున్నామని తెలిపారు.గౌతు లచ్చన్న స్ఫూర్తితో బీసీల సంక్షేమానికి అనేక కార్యక్రమాలు చేపట్టామన్నారు. అందుకే బీసీలందరూ ముఖ్యమంత్రి చంద్రబాబుకు అండగా నిలవాలని సూచించారు.గీతకార్మికులకు తాటి చెట్లు ఎక్కడానికి అధునాతన పరికరాలు అందజేయనున్నామన్నారు. రంపచోడవరంలోని హార్టీకల్చర్ పరిశోధనా కేంద్రంలో నూతన తాటి ఉత్పత్తులు తయారుచేసి, గీత కార్మికులకు ఉపాధి, ఆర్థిక వృద్ధి మరింత పెంచేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశించినట్టు సవిత తెలిపారు. గౌతు లచ్చన్నతో తమ కుటుంబానికి ఎంతో అనుబంధం ఉందని వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. 2018లో సీఎం చంద్రబాబు తోటపల్లి ప్రాజెక్ట్‌కు గౌతు లచ్చన్న పేరు పెట్టారని గుర్తు చేశారు.రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ మాట్లాడుతూ.. బీసీల పట్ల రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న చిత్త శుద్ధికి ఈ కార్యక్రమమే నిదర్శనమని పేర్కొన్నారు. ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ.. వైసీపీ పాలనలో గౌతు శిరీషపై ఎన్నో కేసులు పెట్టినా ఆమె భయపడకుండా పోరాటం చేశారని గుర్తుచేశారు.

టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు మాట్లాడుతూ..ప్రజల కోసం, సమాజం కోసం పాటుపడిన వ్యక్తులను ప్రజలు గుర్తుంచుకుంటారన్నారు.విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్(చిన్ని) మాట్లాడుతూ.. ఆచార్య ఎన్‌జీ రంగాను పార్లమెంటు సభ్యునిగా శ్రీకాకుళంలో నిలబెట్టి గెలిపించిన వ్యక్తి లచ్చన్న అని తెలిపారు.గౌతు లచ్చన్న మనవరాలు, శాసనసభ్యురాలు గౌతు శిరీష మాట్లాడుతూ..ప్రజా పోరాటాలు చేసిన నాయకులు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతారన్నారు.చిన్నప్పుడు తాను తాత దగ్గర పెరగడం వల్ల.. ఆయన ఆశయాలు, ఆలోచనలు తనపై ప్రభావం చూపించాయని తెలిపారు. కార్యక్రమంలో ప్రభుత్వ విప్, శాసనసభ్యుడు బొండా ఉమామహేశ్వరరావు, శాసనసభ్యులు కాగిత కృష్ణ ప్రసాద్, వర్ల కుమార్ రాజా, పితాని సత్యనారాయణ, మాజీ మంత్రి కేఈ ప్రభాకర్, రాష్ట్ర గౌడ కార్పొరేషన్ చైర్మన్ వీరంకి గురుమూర్తి తదితరులు పాల్గొన్నారు.
సర్దార్ గౌతు లచ్చన్నకు సీఎం, లోకేశ్ నివాళి
స్వాతంత్య్ర సమరయోధుడు సర్దార్ గౌతు లచ్చన్న జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి సీఎం చంద్రబాబు పూలమాల వేసి నివాళులర్పించారు. హైదరాబాద్‌లోని నివాసంలో సీఎంతోపాటు, మంత్రి లోకేశ్ కూడా లచ్చన్నకు నివాళులర్పించారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో లచ్చన్న జయంతిని ఘనంగా నిర్వహించారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు లచ్చన్నకు నివాళులర్పించారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ చిరంజీవులు, టూరిజం కార్పొరేషన్ చైౖర్మన్ నూకసాని బాలాజీ తదితరులు పాల్గొన్నారు.