CID Former Chief Sanjay: నాకేం తెలియదు.. అంతా కిందివాళ్లే చూసుకున్నారు
ABN , Publish Date - Sep 05 , 2025 | 06:01 AM
ఏం అడిగినా... నాకేం తెలియదు అని సమాధానం సభలు, సమావేశాల పేరిట చేసిన ‘ఖర్చులు, యాప్ తయారీకి కాంట్రాక్టు సంస్థకు చెల్లింపుల వ్యవహారంలో బయటపడిన అవినీతి భాగోతాలపై ప్రశ్నిస్తే..
మూడు రోజులుగా ఇదే మాట
ఏసీబీకి సహకరించని సంజయ్
రూల్స్‌పై ప్రశ్నించిన అధికారులపై చిరాకు మరోమారు సంజయ్ కస్టడీకి పిటిషన్
అమరావతి, సెప్టెంబరు 4(ఆంధ్రజ్యోతి): ఏం అడిగినా... ‘నాకేం తెలియదు’ అని సమాధానం! సభలు, సమావేశాల పేరిట చేసిన ‘ఖర్చులు’, యాప్ తయారీకి కాంట్రాక్టు సంస్థకు చెల్లింపుల వ్యవహారంలో బయటపడిన అవినీతి భాగోతాలపై ప్రశ్నిస్తే.. ‘‘అంతా కిందివాళ్లే చూసుకున్నారు.’ అంటూ దాటవేత! వెరసి.. మూడు రోజుల కస్టడీలో ఏసీబీ విచారణకు సీఐడీ మాజీ చీఫ్ సంజయ్ సహకరించలేదని తెలిసింది. రోజుకు యాభై ప్రశ్నల చొప్పున సుమారు 150ప్రశ్నలు సంధించినా, ఆయన ధోరణిలో మార్పు లేదు. దీంతో విసుగెత్తిపోయిన ‘ఇక్కడ నిబంధనలు ఇలా ఉన్నాయి.. ఈ మార్గదర్శకాలను పాటించలేదు.. దీనిపై మీ సమాధానం ఏంటి’ అని అడిగితే ‘అవన్నీ సెక్షన్‌లో వాళ్లు చూసుకోవాలి.. హెచ్‌వోడీగా నాకు చాలా పనులుంటాయి’ అని విచారణ అధికారులపై చిరాకు పడినట్లు తెలిసింది. మంగళవారం నుంచి గురువారం వరకూ ప్రశ్నించిన ఏసీబీ అధికారులు మరో మారు కోర్టులో కస్టడీ పిటిషన్ వేసింది. వైసీపీ ప్రభుత్వంలో అడ్డగోలుగా వ్యవహరిస్తూ ఇష్టారాజ్యంగా అవినీతి, అక్రమాలకు పాల్పడిన బ్యూరోక్రాట్లలో సంజయ్ ఒకరు. ఓ వైపు దళితులకు ఖర్చు చేయాల్సిన నిధులు.. మరో వైపు అగ్నిమాపక శాఖలో ఒక ప్రైవేటు సంస్థతో కలిసి స్వాహా చేసిన సొమ్ములపై విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ జరిపిన విచారించింది. సంజయ్ అవినీతి భాగోతం బయట పడింది.
రాష్ట్ర వ్యాప్తంగా ఆయన దళితులకు ఎస్‌సీ, ఎస్టీ చట్టాలపై అవగాహన కల్పించేందుకు పలు కల్యాణ మండపాల్లో ఏర్పాటు చేసిన సమావేశాల్లో రూ.1.19కోట్లు ఖర్చు చేసినట్లు, క్రిత్వాప్ టెక్నాలజీస్ అనే సంస్థకు బిల్లులు చెల్లించినట్లు చూపారు. అయితే రాష్ట్రంలో ఎక్కడా కల్యాణ మండపాల్లో సమావేశాలు నిర్వహించలేదని విచారణలో తేలింది. విజిలెన్స్ నివేదిక ఆధారంగా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశించడంతో సంజయ్‌పై ఏసీబీలో కేసు నమోదైంది. మరో వైపు అగ్నిమాపక శాఖలో కూడా సౌత్రిక టెక్నాలజీస్‌కు యాప్ అభివృద్ధి పేరుతో బిల్లులు చెల్లించి 59.93లక్షలు దుర్వినియోగం చేసినట్లు విజిలెన్స్ గుర్తించింది. ‘అగ్ని-ఎన్‌వోసీ’ వెబ్‌సైట్ రూపకల్పన, యాప్ అభివృద్ధి, నిర్వహణ, 150ట్యాబ్‌ల సరఫరా కోసం ముందే ఎంపిక చేసుకున్న మూడు సంస్థలతో బిడ్లు వేయించి ఎల్-1గా సౌత్రికా టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ బిడ్‌ను ఎంపిక చేసి, బిల్లులు చెల్లించడం వెనుక సంజయ్ అవినీతి ఉన్నట్లు విజిలెన్స్ నివేదికలో స్పష్టం చేసింది. ఈ రెండు అవినీతి భాగోతాలపైనా ఏసీబీ అధికారులు కస్టడీకి తీసుకుని ప్రశ్నించారు.
హృద్రోగ చికిత్సకు అనుమతివ్వండి: సంజయ్ అభ్యర్థన
విచారణ పూర్తయిన అనంతరం సంజయ్‌ను విజయవాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడ వైద్య పరీక్షలు చేయించిన తర్వాత పోలీసులు కోర్టులో హాజరుపరిచారు. పోలీసులు కస్టడీలో ఏమైనా ఇబ్బంది పెట్టారా అని న్యాయాధికారి పి.భాస్కరరావు ఆయనను ప్రశ్నించారు. తనను పోలీసులు ఎలాంటి ఇబ్బందులు పెట్టలేదని చెప్పారు. తనకు హృద్రోగం ఉందని గుంటూరులో గానీ, విజయవాడ రమేశ్ ఆసుపత్రిలో గానీ చూపించుకోవడానికి అనుమతి ఇవ్వాలని అభ్యర్థించారు. అనంతరం సంజయ్‌ను జిల్లా జైలుకు తరలించారు. సంజయ్ బెయిల్ పిటిషన్‌పై తదుపరి విచారణను కోర్టు 9వ తేదీకి వాయిదా వేసింది.