Share News

శానిటేషన ఏజెన్సీ గందరగోళం

ABN , Publish Date - Oct 07 , 2025 | 11:49 PM

కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో పారిశుధ్య విభాగంలో విద్యార్హత పేరుతో కొందరు శానిటేషన కార్మికులు, సూపర్‌వైజర్ల తొలగింపు అంశం వివాదంగా మారింది.

శానిటేషన ఏజెన్సీ గందరగోళం
పారిశుధ్య కార్మికులతో మాట్లాడుతున్న ఏజెన్సీ మేనేజర్‌

విద్యార్హత పేరుతో ఉద్యోగుల తొలగింపు

కర్నూలు హాస్పిటల్‌, అక్టోబరు 7 (ఆంధ్రజ్యోతి): కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో పారిశుధ్య విభాగంలో విద్యార్హత పేరుతో కొందరు శానిటేషన కార్మికులు, సూపర్‌వైజర్ల తొలగింపు అంశం వివాదంగా మారింది. కర్నూలు జీజీహెచ, ఐ-హాస్పిటల్‌, కర్నూలు మెడికల్‌ కాలేజీ, నర్సింగ్‌ కాలేజీ, హాస్టల్స్‌లో పారిశుధ్య పనులను ప్రభుత్వం ఇటీవల తిరుపతికి చెందిన పద్మావతి పెర్టిలిటీ సంస్థకు అప్పగించింది. ఈ నెల ఒకటో తేదీ నుంచి ఏజెన్సీ పారిశుధ్య బాధ్యతలను చేపట్టింది. పారిశుధ్య కార్మికులకు విద్యార్హత 8వ తరగతి, 50 సంవత్సరాలు దాటిన వారిని తొలగించాలని, సూపర్‌వైజర్లకు డిగ్రీ విద్యార్హతగా ప్రభుత్వం కొత్తగా జీవోను అమలు చేసింది. కర్నూలు జీజీహెచలో 330 మంది పారిశుధ్య కార్మికులు 44 మంది సూపర్‌వైజర్లు కావాల్సి ఉంది. అయితే విద్యార్హత పేరుతో గత పదేళ్లుగా ఐ-హాస్పిటల్‌లో పని చేస్తున్న ఓ మహిళ సూపర్‌వైజర్‌తో పాటు కర్నూలు జీజీహెచఓ మరో సూపర్‌వైజర్‌ను, కొత్త ఏజెన్సీ తొలగించడం వివాదాస్పదంగా మారింది. వాస్తవానికి కర్నూలు జీజీహెచలో 330 మందికి గానూ 290 మంది కార్మికులు, సూపర్‌వైజర్లు 44 మందికి గానూ 40 మంది పని చేస్తున్నారు. విద్యార్హతల పేరుతో 50 సంవత్సరాల వయస్సు దాటిన వారిని ఉద్యోగాల నుంచి తొలగిస్తుండటంతో పారిశుధ్య కార్మికుల్లో అలజడి నెలకొంది. గత పదేళ్లుగా పని చేస్తున్న తమను విద్యార్హత, వయస్సు కారణాలతో ఎలా తొలగిస్తారని కార్మికులు ప్రశ్నిస్తున్నారు. కొత్తగా విధుల్లో చేరిన కార్మికులకు మాత్రమే ఇలాంటి నిబంధనలు వర్తిస్తాయని ప్రశ్నిస్తున్నారు. ఈ అంశంపై ఏజెన్సీ మేనేజర్‌ సూరిబాబు మాట్లాడుతూ జీవో ప్రకారమే తాము వ్యవహరిస్తున్నామన్నారు. విద్యార్హతలు లేకుంటే ఆ ఉద్యోగి కుటుంబంలో ఎవరికైనా ఉద్యోగం ఇస్తామన్నారు.

Updated Date - Oct 07 , 2025 | 11:49 PM