Share News

యర్రవరం రహదారికి మోక్షం

ABN , Publish Date - Jun 21 , 2025 | 11:15 PM

మండలంలోని పర్యాటక ప్రాంతమైన యర్రవరం జలపాతం రహదారికి మోక్షం లభించింది. అటవీశాఖ అభ్యంతరాల వల్ల ఐదు నెలలుగా నిలిచిపోయిన పనులు పునఃప్రారంభంకానున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం గిరిజన ప్రాంతాల్లో రహదారుల నిర్మాణాలకు నిబంధనలను సడలించి అటవీశాఖ అనుమతులు జారీ చేసేందుకు చర్యలు చేపట్టింది.

యర్రవరం రహదారికి మోక్షం
ఎర్తు వర్కు పూర్తయిన యర్రవరం రహదారి

తొలగిన అటవీశాఖ అడ్డంకులు

టూరిజం ప్రాజెక్టులో భాగంగా రూ.2 కోట్ల ఎన్‌ఆర్‌ఈజీఎస్‌ నిధులతో పనులు

వారం రోజుల్లో పనులు పునఃప్రారంభం

చింతపల్లి, జూన్‌ 21 (ఆంధ్రజ్యోతి): మండలంలోని పర్యాటక ప్రాంతమైన యర్రవరం జలపాతం రహదారికి మోక్షం లభించింది. అటవీశాఖ అభ్యంతరాల వల్ల ఐదు నెలలుగా నిలిచిపోయిన పనులు పునఃప్రారంభంకానున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం గిరిజన ప్రాంతాల్లో రహదారుల నిర్మాణాలకు నిబంధనలను సడలించి అటవీశాఖ అనుమతులు జారీ చేసేందుకు చర్యలు చేపట్టింది. దీంతో యర్రవరం రహదారి నిర్మాణానికి అటవీశాఖ అనుమతులు మంజూరు చేసింది. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే పర్యాటక ప్రాంతాల అభివృద్ధికి పెద్దపీట వేస్తూ రహదారులు, మౌలిక సదుపాయాల కల్పనకు అధిక మొత్తంలో నిధులు మంజూరు చేసింది. టూరిజం ప్రాజెక్టులో భాగంగా ప్రభుత్వం యర్రవరం జలపాతం వరకు రహదారి నిర్మాణానికి రూ.2 కోట్ల ఎన్‌ఆర్‌ఈజీఎస్‌ నిధులు విడుదల చేసింది. దీంతో గత ఏడాది ఆగస్టులో రహదారి నిర్మాణ పనులను పంచాయతీరాజ్‌శాఖ ఇంజనీరింగ్‌ అధికారులు ప్రారంభించారు. రహదారి నిర్మాణానికి ఎర్తు వర్కు పూర్తి చేసి కాలువల వద్ద కల్వర్టులను నిర్మించారు. అయితే అటవీశాఖ అభ్యంతరాల వల్ల ఐదు నెలలుగా నిర్మాణ పనులు నిలిచిపోయాయి.

పర్యాటకులు, గిరిజనులకు తీరనున్న అవస్థలు

చింతపల్లి మండలం గొందిపాకలు పంచాయతీ పరిధిలో యర్రవరం జలపాతం ఉంది. ఈ జలపాతానికి తురబాడుగెడ్డ నుంచి సమగిరి మీదుగా వెళ్లాలి. ఈ మార్గానికి ఆనుకుని సుమారు 12 గ్రామాలు ఉన్నాయి. తురబాడుగెడ్డ నుంచి సమగిరి వరకు తారురోడ్డు ఉంది. సమగిరి నుంచి యర్రవరం జలపాతం వరకు వెళ్లేందుకు కేవలం మట్టిరోడ్డు మాత్రమే ఉంది. దీంతో ఈ మార్గంపై కేవలం ద్విచక్రవాహనాలు మినహా ఆటోలు, కార్లు, జీపులు వెళ్లే పరిస్థితి లేదు. ఈ ప్రాంత ఆదివాసీలు సైతం కాలినడకనే రాకపోకలు సాగిస్తున్నారు. శీతాకాల సీజన్‌లో ఆంధ్ర కశ్మీర్‌ లంబసింగికి వచ్చే పర్యాటకులు అధిక సంఖ్యలో యర్రవరం జలపాతాన్ని సందర్శిస్తుంటారు. పర్యాటకులు సమగిరి వరకు కార్లు, జీపుల్లో వచ్చి అక్కడ నుంచి కాలినడకన జలపాతానికి వెళ్లి ఎంజాయ్‌ చేస్తున్నారు. వర్షాకాలంలో ఈ మార్గం బురదమయమైపోతుంది. కనీసం ద్విచక్రవాహనాలు కూడా వెళ్లే పరిస్థితి ఉండదు. యర్రవరం జలపాతానికి రహదారి లేకపోవడం వల్ల ఆదివాసీలు, పర్యాటకులు ఎదుర్కొంటున్న సమస్యలను గత వైసీపీ పాలకుల దృష్టికి తీసుకు వెళ్లినా ఫలితం లేకపోయింది. కూటమి ప్రభుత్వం వచ్చాక టూరిజం ప్రాజెక్టులో భాగంగా సమగిరి నుంచి యర్రవరం జలపాతం వరకు నాలుగు కిలోమీటర్లు తారు రోడ్డు నిర్మాణానికి నిధులు విడుదల చేసింది. ఈ మార్గంలో నిర్మాణ బాధ్యతలు పొందిన కాంట్రాక్టర్‌ సుమారు ఎనిమిది కల్వర్టులను నిర్మించారు. ఎర్తు వర్కు పూర్తి చేశారు. అయితే రహదారి నిర్మిస్తున్న భూమి కొంత భాగం అటవీశాఖ పరిధిలో ఉండడంతో అటవీశాఖ అధికారులు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో పనులను కాంట్రాక్టర్‌ నిలిపివేశారు. పంచాయతీరాజ్‌శాఖ అధికారులు నిబంధనల ప్రకారం అటవీశాఖ అనుమతుల కోసం దరఖాస్తు చేశారు. కేవలం నాలుగు నెలల్లోనే అటవీశాఖ అనుమతులు మంజూరయ్యాయి. దీంతో ఆదివాసీలు, పర్యాటకుల రవాణా అవస్థలు తీరనున్నాయని స్థానికులు అంటున్నారు.

వారం రోజుల్లో పనులు పునఃప్రారంభం

యర్రవరం రహదారి నిర్మాణానికి అటవీశాఖ అనుమతులు మంజూరు కావడంతో వారం రోజుల్లో పనులు పునఃప్రారంభిస్తామని పీఆర్‌ డీఈఈ నరేన్‌ కుమార్‌, ఏఈఈ బాలకిశోర్‌ తెలిపారు. కల్వర్టుల నిర్మాణం పూర్తి చేశామని, రహదారిపై వెట్‌ మిక్స్‌ వేసి రోలింగ్‌ చేస్తామన్నారు. నెల రోజుల్లో తారు రోడ్డు నిర్మాణం పూర్తి చేస్తామని తెలిపారు.

Updated Date - Jun 21 , 2025 | 11:15 PM