Share News

Salt Production: కరిగిపోతున్న ఉప్పు రైతు కష్టం

ABN , Publish Date - Sep 27 , 2025 | 05:13 AM

వాతావరణంలో ఉష్ణోగ్రతపై ఆధారపడి సాగుచేసే ఉప్పు పంటకు ఉమ్మడి నెల్లూరు జిల్లాలో మంచి పేరుంది. గతంలో కేవలం ఐదు వేల ఎకరాల్లోపు ఉండే ఉప్పు ఉత్పత్తి విస్తీర్ణం నేడు గణనీయంగా 15 వేల ఎకరాల వరకు పెరిగింది.

Salt Production: కరిగిపోతున్న ఉప్పు రైతు కష్టం

  • ఉత్పత్తిపై రుతుపవనాలు, తుఫాన్ల ప్రభావం

  • నెల్లూరు జిల్లాలో ఖాళీగా ఉప్పు కయ్యలు

  • గిట్టుబాటు ధర ఉన్నా అనుకూలించని వాతావరణం

  • నిల్వ చేసుకునే సౌకర్యం లేక అవస్థలు

ఉప్పు ఉత్పత్తిదారులకు వాతావరణ మార్పులు శాపంగా మారాయి. నెల్లూరు జిల్లాలో సాధారణంగా ఈ సీజన్‌లో ఉప్పు కువ్వలతో కళకళలాడాల్సిన కయ్యలు(మడులు) ఖాళీగా దర్శనమిస్తున్నాయి. రుతుపవనాల ఆగమనం, తుఫాన్ల కారణంగా అడపాదడపా కురుస్తున్న వర్షాలతో ఈ దుస్థితి ఏర్పడింది. ఏటా జనవరి నుంచి ఉప్పు ఉత్పత్తికి పనులు ప్రారంభమై కయ్యలను మరమ్మతులు చేసుకొని మార్చి నుంచి అక్టోబరు వరకు ఉప్పు ఉత్పత్తి చేపడతారు. ఈదఫా రుతుపవనాలు ముందుగానే రావడంతో గడ్డు పరిస్థితులు ఎదురయ్యాయి!.

(అల్లూరు-ఆంధ్రజ్యోతి)

వాతావరణంలో ఉష్ణోగ్రతపై ఆధారపడి సాగుచేసే ఉప్పు పంటకు ఉమ్మడి నెల్లూరు జిల్లాలో మంచి పేరుంది. గతంలో కేవలం ఐదు వేల ఎకరాల్లోపు ఉండే ఉప్పు ఉత్పత్తి విస్తీర్ణం నేడు గణనీయంగా 15 వేల ఎకరాల వరకు పెరిగింది. ఆక్వా రంగం కుదేలవడంతోపాటు ఉప్పుకు పెరిగిన ఆశాజనక ధరలే ఇందుకు కారణం. రెండేళ్లుగా ఉప్పునకు మద్దతు ధర లభించిందని రైతులు ఆనందంలో మునిగి తేలారు. అయితే, ఇప్పుడు ప్రతికూల వాతావరణం కారణంగా ఉత్పత్తి తగ్గుముఖం పట్టి రైతుల వెన్ను విరిగింది. ఏటా సీజనులో ఉత్పత్తయిన ఉప్పును నిల్వ చేసుకుంటే వర్షాకాలంలో ధరలు పెరిగి లాభాలను తెచ్చిపెట్టే అవకాశం ఉంటుంది. వేసవిలో ఉత్పత్తి బాగున్నా ఆశించినస్థాయిలో ధర లేకున్నా విక్రయిస్తుంటారు. కొంత ఉప్పును నిల్వ చేసుకుని అన్‌సీజనులో పెరిగిన ధరలకు విక్రయించి తద్వారా లాభాలు పొందుతారు. అయితే ఈ ఏడాది వేసవిలోనూ ధరలు ఆశాజనకంగా ఉన్నాయి. కనిష్ఠ ధర క్వింటా రూ.300 ఉండగా గరిష్ఠంగా రూ.400 పలికింది. నాణ్యమైన ఉప్పు రూ.450 చొప్పున ఈ ఏడాది రైతుకు భారీగానే ఆదాయం రావాల్సి ఉంది. కానీ వాతావరణం రైతులపాలిట శాపంగా మారింది. ప్రస్తుతం ధరలు ఉన్నా ఇటీవల కురిసిన వర్షాలకు కయ్య(మడులు)ల్లో ఉప్పు కరిగిపోయింది. వాతావరణంలో చోటు చేసుకున్న చల్లదనానికి ఉత్పత్తి కూడా నిలిచిపోయింది. ఉత్పతి అయిన కాస్త ఉప్పు కూడా నిల్వ చేసుకునే స్థలం లేక అయినకాడికే అమ్ముకోవాల్సి వస్తోందని రైతులు వాపోతున్నారు.


ఉత్పత్తి సాగితే లాభాలే!

సాధారణంగా ఒక ఎకరాలో ఉప్పు ఉత్పత్తికి రూ.25వేల వరకు ఖర్చవుతుంది. కనిష్ఠంగా 500 క్వింటాళ్ల ఉత్పత్తి అవుతుంది. క్వింటా రూ.300 పలికితే సీజను మొత్తంలో ఎకరానికి రూ1.5 లక్షలు వస్తుంది. ఇందులో ఖర్చులు రూ.25 వేలు- రూ.50వేలు పెట్టినా రూ.75వేల నుంచి రూ.లక్ష వరకు మిగులుతుంది. దీనికోసం ఆరు నెలలు ఎదురు చూడగా, ఈ ఏడాది రుతుపవనాల కారణంగా నష్టపోయామని సాగుదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ధరలు బాగానే ఉన్నాయి

ఈ ఏడాది ధరలు ఆశాజనకంగానే ఉన్నాయి. గత ఏడాదికంటే సీజనులో ఈ ధరలు పలకడం గొప్ప విషయమే. కానీ ఉత్పత్తి లేకపోవడంతో ఏమీ చేయలేని పరిస్థితి. ధరలు ఉంటే ఉత్పత్తి లేదు. ఉత్పత్తి ఉంటే ధరలు రావు. ఈ విధంగా మా ఉప్పు రైతులు జీవితాలు నిలకడ లేకుండా పోతున్నాయి.

- పురిణి ఏడుకొండలు, తూర్పు గోగులపల్లి, అలూరు మండలం

తుఫానులే మా పాలిట శాపం

ఏటా రుతుపవనాలు సమయానికి రాకుండా ఆలస్యమవుతున్నాయనే వార్తలు విన్నాం. కానీ ఈ ఏడాది ముందుగానే రావడం తుఫానులు ఏర్పడి మా పాలిట శాపంగా మారింది. వర్షాకాలం సమీపిస్తున్న కారణంగా వాతావరణంలో చోటు చేసుకున్న మార్పులతో ఉత్పత్తి నిలిచి, ఉపాధికి గండిపడింది.

- చెవికల శ్రీనివాసులు, ఇస్కపల్లి, అల్లూరు మండలం

Updated Date - Sep 27 , 2025 | 05:15 AM