Share News

పగలు కొత్తిమీర, కరివేపాకు అమ్మకాలు.. రాత్రుళ్లు ఇళ్లలో దొంగతనాలు

ABN , Publish Date - May 25 , 2025 | 01:16 AM

పగలు కొత్తిమీర, కరివేపాకు అమ్ముతూ రాత్రిళ్లు దొంగతనాలు చేస్తున్న ఐదుగురు సభ్యుల ముఠాను పమిడిముక్కల, కూచిపూడి పోలీసులు జాయింట్‌ ఆపరేషన్‌లో పట్టుకున్నారు. రూ.3 లక్షలు విలువైన బంగారం, వెండి వస్తువులను స్వాధీనం చేసుకున్నారు.

పగలు కొత్తిమీర, కరివేపాకు అమ్మకాలు.. రాత్రుళ్లు ఇళ్లలో దొంగతనాలు

- ఐదురుగు సభ్యుల ముఠాను పట్టుకున్న పోలీసులు

- రూ.3 లక్షల విలువైన బంగారం, వెండి ఆభరణాలు స్వాధీనం

- వివరాలు వెల్లడించిన డీఎస్పీ ధీరజ్‌ వినీల్‌

గుడివాడ, మే 24(ఆంధ్రజ్యోతి):

పగలు కొత్తిమీర, కరివేపాకు అమ్ముతూ రాత్రిళ్లు దొంగతనాలు చేస్తున్న ఐదుగురు సభ్యుల ముఠాను పమిడిముక్కల, కూచిపూడి పోలీసులు జాయింట్‌ ఆపరేషన్‌లో పట్టుకున్నారు. రూ.3 లక్షలు విలువైన బంగారం, వెండి వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. స్థానిక డీఎస్పీ కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కేసు వివరాలను డీఎస్పీ ధీరజ్‌ వినీల్‌ వెల్లడించారు. ఆయన మాటల్లో.. పమిడిముక్కల, కూచిపూడి పోలీసులు జాయింట్‌ ఆపరేషన్‌లో భాగంగా పలు కేసుల్లో అనుమానితుల కోసం గాలిస్తున్నారు. ఈ క్రమంలో వీరికి నాగూర్‌ బాషా, చందు, సలాం, షేక్‌బాబావలి, మరో బాలుడు తారసపడ్డారు. వీరి కదలికలు అనుమానాస్పదంగా ఉండటంతో అదుపులోకి తీసుకుని విచారించగా, పలు కేసుల్లో ముద్దాయిలుగా ఉన్నట్టు గుర్తించారు. వీరిలో చందు, బాబావలి ఇళ్ల వద్ద ఆకు కూరలు అమ్ముతూ రెక్కి నిర్వహించి నాగూర్‌ బాషా, షేక్‌ సలాం, మరో బాలుడికి సమాచారం ఇస్తారు. అందరూ కలిసి రాత్రుళ్లు ఆయా ఇళ్లలో చోరీలకు పాల్పడేవారు. వారి వద్ద నుంచి జిల్లా వ్యాప్తంగా పలు కేసుల్లో చోరీకి గురైన రూ. 3 లక్షలు విలువైన 26 గ్రాముల బంగారం, 562 గ్రాముల వెండి వస్తువులు, రూ.3500 నగదు, రెండు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. వీరిని మొవ్వ కోర్టులో హాజరుపర్చనున్నారు. బాల నేరస్తుడిని జువైనల్‌ హోంకు తరలించనున్నారు.

Updated Date - May 25 , 2025 | 01:16 AM