Sajjala Ramakrishna Reddy: లోకేశ్ తలకుమాసినోడు..పనికిమాలినోడు..
ABN , Publish Date - Sep 05 , 2025 | 05:46 AM
యూరియా కొరతపై జరుగుతున్న ఫేక్ ప్రచారాలపై రాష్ట్ర ప్రభుత్వం ఉక్కుపాదం మోపడంతో వైసీపీ నేతలు అసహనంతో రగిలిపోతున్నారు. సర్కారు, సీఎం చంద్రబాబుపై అక్కసు వెళ్లగక్కుతున్నారు.
బాబు రాజకీయ అరాచకవాది
సజ్జల భార్గవరెడ్డి అమాయకుడు
సిట్...పత్రికల బ్యూరోగా పనిచేస్తోంది
లిక్కర్ స్కామ్ జరగనే జరగలేదు
కేసులు పెట్టే అధికారులు, నేతలకుమూడేళ్ల తర్వాత మ్యూజిక్ మొదలవుతుంది
వైసీపీ నేత సజ్జల హెచ్చరికలు
అమరావతి, సెప్టెంబరు 4(ఆంధ్రజ్యోతి): యూరియా కొరతపై జరుగుతున్న ఫేక్ ప్రచారాలపై రాష్ట్ర ప్రభుత్వం ఉక్కుపాదం మోపడంతో వైసీపీ నేతలు అసహనంతో రగిలిపోతున్నారు. సర్కారు, సీఎం చంద్రబాబుపై అక్కసు వెళ్లగక్కుతున్నారు. గురువారం మీడియా సమావేశం పెట్టి మరీ వైసీపీ ముఖ్యనేత సజ్జల రామకృష్ణారెడ్డి నోరు పారేసుకున్నారు. ‘తలకుమాసినోడు..పనికిమాలినోడు..’ అంటూ మంత్రి లోకేశ్‌పై తిట్ల దండకం అందుకున్నారు. కేసులు పెడుతున్న అధికారులకు మూడేళ్ల తర్వాత మ్యూజిక్ మొదలవుతుందంటూ ఏకంగా బెదిరింపులకు దిగారు. ఫేక్ ప్రచారం చేస్తున్న వైసీపీ నేతలను బుధవారం మీడియా సమావేశంలో సీఎం చంద్రబాబు హెచ్చరించిన విషయం తెలిసిందే. అలాగే, లిక్కర్ స్కామ్ కేసులో సజ్జల కుమారుడు భార్గవరెడ్డి పేరు తాజాగా తెరపైకి వచ్చింది. ఈ నేపథ్యంలో తాడేపల్లి ప్యాలెస్ ప్రాంగణంలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ‘ఎంపిక’ చేసిన మీడియా సమక్షంలో చంద్రబాబుపై సజ్జల రెచ్చిపోయారు. ‘‘చంద్రబాబు అరాచకవాది. బెదిరింపులకు దిగుతున్నారు. యూరియా కొరతపై మాట్లాడిన రైతులందరినీ వైసీపీ నేతలుగా చిత్రీకరిస్తున్నారు. జైలుకు పంపుతానంటూ పబ్లిక్‌గా బెదిరిస్తున్నారు. చంద్రబాబే కృత్రిమ కొరత సృష్టించారు. బ్లాక్‌మార్కెట్‌కు తరలించి వందల కోట్లు దోచుకుంటున్నారు.’’ అంటూ విమర్శించారు. డీఫాక్టో సీఎంగా వ్యవహరిస్తూ.. కమీషన్లపై లోకేశ్ దృష్టిపెట్టారని విమర్శించారు. లిక్కర్ స్కామ్ జరగనేలేదని సజ్జల క్లీన్‌చిట్ ఇచ్చేశారు. తన కుమారుడు సజ్జల భార్గవరెడ్డి కంపెనీ పెట్టినా .. లావాదేవీలు జరపలేదన్నారు. ఆ కంపెనీకి అసలు బ్యాంకు అకౌంటే లేదన్నారు. లిక్కర్ సిట్ .. ప్రభుత్వ సానుకూల మీడియా సంస్థల బ్యూరోలా పనిచేస్తూ ...రోజూ ప్రఽధాన శీర్షికలకు వార్తలు అందిస్తోందని విమర్శించారు.