Share News

Pinnedameni Sai Baba: సాయిబాబా మృతి టీడీపీకి తీరని లోటు

ABN , Publish Date - Dec 30 , 2025 | 04:10 AM

ఎన్టీఆర్‌ అభిమాన సంఘాల సమాఖ్య అధ్యక్షుడు, దివ్యాంగుల కార్పొరేషన్‌ మాజీ చైర్మన్‌ పిన్నమనేని సాయిబాబా ఆకస్మిక మృతి తెలుగుదేశం పార్టీకి తీరని లోటని పలువురు వక్తలు పేర్కొన్నారు

Pinnedameni Sai Baba: సాయిబాబా మృతి టీడీపీకి తీరని లోటు

  • ప్రజలకు, దివ్యాంగులకు ఆయన చేసిన సేవలు చిరస్మరణీయం

  • నివాళులర్పించిన నందమూరి రామకృష్ణ,బక్కని నర్సింహులు, మంద కృష్ణ మాదిగ

  • హైదరాబాద్‌లో ముగిసిన అంత్యక్రియలు

హైదరాబాద్‌, అమరావతి, డిసెంబరు 29(ఆంధ్రజ్యోతి): ఎన్టీఆర్‌ అభిమాన సంఘాల సమాఖ్య అధ్యక్షుడు, దివ్యాంగుల కార్పొరేషన్‌ మాజీ చైర్మన్‌ పిన్నమనేని సాయిబాబా ఆకస్మిక మృతి తెలుగుదేశం పార్టీకి తీరని లోటని పలువురు వక్తలు పేర్కొన్నారు. హైదరాబాద్‌, బేగంపేటలో సాయిబాబా నివాసం నుంచి ఆయన పార్థివ దేహాన్ని ఎన్‌టీఆర్‌ అభిమానులు, టీడీపీ శ్రేణుల దర్శనార్థం టీడీపీ నగర కార్యాలయానికి సోమవారం మధ్యాహ్నం తీసుకువచ్చారు. పలువురు ప్రముఖులు, జనం పెద్ద సంఖ్యలో హాజరై ఆశ్రునయనాలతో నివాళులు అర్పించారు. ఎన్‌టీఆర్‌ కుమారుడు నందమూరి రామకృష్ణ, మాజీ మంత్రి దగ్గబాటి వెంకటేశ్వరావు, తెలంగాణ టీడీపీ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే బక్కని నర్సింహులు, ఎమ్మార్పీఎస్‌ అధినేత మంద కృష్ణ మాదిగ, ఆంధ్రప్రదేశ్‌ దివ్యాంగుల కార్పొరేషన్‌ చైర్మన్‌ కోటేశ్వరరావు, మోత్కుపల్లి నర్సింహులు, ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, మాజీ మంత్రి కృష్ణ యాదవ్‌, వివిధ పార్టీల, సంఘాల నేతలు సాయిబాబా పార్థీవ దేహంపై పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... ‘టీడీపీ అధికారంలో ఉన్నా లేకపోయినా సాయిబాబా నిత్యం ప్రజల హక్కులు, సంక్షేమం, దివ్యాంగుల హక్కుల కోసం ఉద్యమించే వారు. సాయిబాబా కుటుంబానికి అండగా ఉంటాం’ అని పేర్కొన్నారు. అనంతరం టీడీపీ నగర కార్యాలయం నుంచి అంతిమ యాత్ర నిర్వహించారు. సాయిబాబా పాడెను నందమూరి రామకృష్ణ, దగ్గుబాటి వెంకటేశ్వరరావు, టీడీపీ నేత కట్టా రాములు మోశారు. అంబర్‌పేట శ్మశానవాటికలో అంత్యక్రియ లు నిర్వహించారు.

కుటుంబానికి చంద్రబాబు పరామర్శ

సాయిబాబా మృతి పార్టీకి, వ్యక్తిగతంగా తనకు తీరని లోటని సీఎం చంద్రబాబు అన్నారు. సోమవారం సాయిబాబా కుటుంబ సభ్యులకు ఫోన్‌ చేసి పరామర్శించి, ధైర్యం చెప్పారు. పార్టీ ఆవిర్భావం నుంచి ఎన్టీఆర్‌తో, తనతో సాయిబాబాకు ఉన్న సాన్నిహిత్యాన్ని ఈ సందర్భంగా చంద్రబాబు గుర్తు చేసుకున్నారు. ఎన్టీఆర్‌ భవన్‌కు వెళ్లిన సమయంలో ముందుగా వచ్చి స్వాగతం పలుకుతారని, అటువంటి నేతను కోల్పోవడం బాధాకరమని అన్నారు. సాయిబాబా కుటుంబ సభ్యులకు అన్ని వేళలా అండగా ఉంటానని భరోసా ఇచ్చారు.

Updated Date - Dec 30 , 2025 | 04:11 AM