Share News

Sagar Reservoir: నిండుకుండలా సాగర్‌

ABN , Publish Date - Jul 27 , 2025 | 05:05 AM

ఆల్మట్టి నుంచి శ్రీశైలం దాకా అన్ని ప్రాజెక్టులను నిండుగా నింపిన కృష్ణమ్మ, నాగార్జునసాగర్‌కూ పూర్తి జలకళ తెచ్చేసింది. ప్రాజెక్టు దాదాపుగా నిండిపోయింది. గరిష్ఠ నీటిమట్టం 590 అడుగులకు ప్రస్తుతం 581.30 అడుగులకు నీరు చేరింది.

Sagar Reservoir: నిండుకుండలా సాగర్‌

  • 29న తెరుచుకోనున్న క్రస్ట్‌ గేట్లు

(ఆంధ్రజ్యోతి న్యూస్‌నెట్‌వర్క్‌)

ఆల్మట్టి నుంచి శ్రీశైలం దాకా అన్ని ప్రాజెక్టులను నిండుగా నింపిన కృష్ణమ్మ, నాగార్జునసాగర్‌కూ పూర్తి జలకళ తెచ్చేసింది. ప్రాజెక్టు దాదాపుగా నిండిపోయింది. గరిష్ఠ నీటిమట్టం 590 అడుగులకు ప్రస్తుతం 581.30 అడుగులకు నీరు చేరింది. 312 టీఎంసీల సామర్థ్యానికి గాను ప్రస్తుతం 286.76 టీఎంసీల నీరు ఉంది. మరో రెండు రోజుల్లో ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరుకుంటుందని.. 29న గేట్లను ఎత్తి దిగువకు నీరు విడుదల చేయనున్నట్లు ప్రాజెక్టు ఇన్‌చార్జి ఎన్‌ఈ మల్లికార్జునరావు శనివారం ‘ఆంధ్రజ్యోతి’కి తెలిపారు. కాగా, రాష్ట్రానికి దూరంగా మధ్యప్రదేశ్‌, ఉత్తర ఛత్తీస్‌గఢ్లలో వాయుగుండం కొనసాగుతుంది. ఇది ఆదివారం కల్లా పశ్చిమంగా పయనించి తీవ్ర అల్పపీడనంగా బలహీనపడనున్నది. వాయుగుండం పూర్తిగా బలహీనపడిన తర్వాతే బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే వాతావరణం నెలకొంటుంది. అప్పటివరకూ రాష్ట్రంలో వర్షాలు తగ్గుతాయని వాతావరణ నిపుణుడొకరు తెలిపారు. కర్ణాటకలోని హోస్పేట్‌ సమీపంలో ఉన్న తుంగభద్ర జలాశయానికి ఎగువ నుంచి 90 వేల క్యూసెక్కుల వరద వస్తోంది. ఇది లక్ష క్యూసెక్కులకు పెరిగే అవకాశం ఉందని బోర్డు అధికారులు అంచనా వేస్తున్నారు. తుంగభద్ర జలాశయానికి ఉన్న 33 క్రస్ట్‌గేట్లలో 26 గేట్లను మూడడుగుల మేరకు ఎత్తి 84 వేల క్యూసెక్కులను దిగువనున్న నదిలోకి వదులుతున్నారు.

గోదావరికి భారీగా వరద..

ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు గోదావరిలోనూ నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది. పోలవరం ప్రాజెక్టు నుంచి 5,09,250 క్యూసెక్కులను దిగువన సముద్రంలోకి వదులుతున్నారు.

Updated Date - Jul 27 , 2025 | 05:05 AM