Water Release: మళ్లీ తెరుచుకున్న సాగర్ గేట్లు
ABN , Publish Date - Aug 11 , 2025 | 03:20 AM
విస్తారంగా కురుస్తున్న వానలతో కృష్ణానది పోటెత్తుతోంది. ఎగువన ఆల్మట్టి నుంచి దిగువన నాగార్జునసాగర్ దాకా ప్రాజెక్టులన్నీ నిండు కుండల్లా మారాయి.
అన్ని యూనిట్లలో జల విద్యుదుత్పత్తి
తెలంగాణ వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో వానలు
రెండు జిల్లాల్లో కాలువలకు గండ్లు
(ఆంధ్రజ్యోతి న్యూస్ నెట్‌వర్క్)
విస్తారంగా కురుస్తున్న వానలతో కృష్ణానది పోటెత్తుతోంది. ఎగువన ఆల్మట్టి నుంచి దిగువన నాగార్జునసాగర్ దాకా ప్రాజెక్టులన్నీ నిండు కుండల్లా మారాయి. అన్ని ప్రాజెక్టుల గేట్లు ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు. ఆదివారం జూరాల, శ్రీశైలం, నాగార్జున సాగర్ రిజర్వాయర్లలో 8 చొప్పున గేట్లు ఎత్తి నీటిని వదులుతున్నారు. ప్రస్తుత సీజన్‌లో సాగర్ గేట్లు ఎత్తడం ఇది రెండోసారి. ఆదివారం సాయంత్రం జూరాల ప్రాజెక్టుకు 90 వేల క్యూసెక్కులు, శ్రీశైలానికి 1.97 లక్షల క్యూసెక్కులు, సాగర్‌కు 65,842 క్యూసెక్కుల వరద నమోదైంది. ఎగువ నుంచి విడుదల చేసే నీటికి అనుగుణంగా జలాశయాలకు ఇన్‌ఫ్లో మారుతుంది. విద్యుత్ కేంద్రాల్లో జల విద్యుదుత్ప త్తి కొనసాగుతుండటం గమనార్హం.
దక్షిణ తెలంగాణ జిల్లాల్లో వానలు
ఆదివారం దక్షిణ తెలంగాణలోని పలు ప్రాంతాల్లో ఓ మోస్తరు వానలు కురిశాయి. నారాయణపేట జిల్లా కోస్గిలో 6.5 సెంటీమీటర్ల వర్షం నమోదైంది. మద్దూర్‌లో నివాస ప్రాంతాలు నీటమునిగాయి. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని పలు మండలాల్లో భారీ వర్షం కురిసిం ది. బషీరాబాద్ మండలంలోని నవాంద్గీ పెద్ద చెరువు కట్టకు గండిపడింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో శనివారం అర్ధరాత్రి తర్వాత కురిసిన వర్షాలతో పలు కాలనీలు నీటమునిగాయి. హయత్‌నగర్‌లో విజయవాడ జాతీయ రహదారి సర్వీస్ రోడ్డు కుంగి భారీ గొయ్యి ఏర్పడింది. ఖమ్మం జిల్లా వేంసూరు మండలం కుంచపర్తి వద్ద ఎన్నెస్పీ కాల్వకు గండి పడింది. దీంతో 20 ఎకరాలకుపైగా వరి నీటమునిగింది. నాగర్‌కర్నూల్ జిల్లాలో కేఎల్‌ఐ డీ-82 ప్రధాన కాల్వకు గండి పడింది.