Yaganti Temple: యాగంటి.. ముక్కంటి!
ABN , Publish Date - Nov 06 , 2025 | 04:40 AM
ప్రకృతి రమణీయత మధ్య.. అద్భుత నిర్మాణశైలిలోని ఆలయం.. పర్వతాల మధ్య ప్రతిధ్వనించే మంత్రధ్వనులు, కలియుగాంతంలో లేచి రంకెలు వేస్తాడని భక్తులు నమ్మే బసవన్న..
ప్రకృతి రమణీయత మధ్య.. అద్భుత నిర్మాణశైలిలోని ఆలయం.. పర్వతాల మధ్య ప్రతిధ్వనించే మంత్రధ్వనులు, కలియుగాంతంలో లేచి రంకెలు వేస్తాడని భక్తులు నమ్మే బసవన్న.. కాకులకు ప్రవేశంలేని ప్రత్యేక ప్రాంతం.. పర్వతసానువుల్లోంచి వచ్చే వింజామరలతో మదిపులకింపజేసే మహత్తర ప్రదేశం.. ఆ ముక్కంటి శివయ్య ఉమామహేశ్వరుడిగా కొలువైన పరమపవిత్ర క్షేత్రం యాగంటి. నంద్యాల జిల్లాలోని ఎర్రమల కొండల్లో.. బనగానపల్లెకు 14 కిలోమీటర్ల దూరంలోని ఈ క్షేత్రం ప్రత్యేకతల గురిం చి ఎంత చెప్పినా తక్కువే. యాగంటి ఆలయం పురాతన శైవక్షేత్రం. ఈ ఆలయాన్ని వైష్ణవ సంప్రదాయంతో నిర్మించడం విశేషం. శిల్పకళ పరంగా పురాతన విశ్వకర్మ స్థపతిల కళా నైపుణ్యం అబ్బురపరుస్తుంది. ఒక్కమాటలో చెప్పాలంటే ప్రకృతి తన అందాల నడుమ భక్తి, చరిత్ర, ఆధ్యాత్మికతను ఒకేచోట మేళవించిన అద్భుత క్షేత్రం యాగంటి!
ఏటా కార్తీకమాసంలో ప్రత్యేక ఉత్సవాలు
ఉమామహేశ్వరుడిగా పూజలందుకుంటున్న శివయ్య
అంతకంతకూ పెరుగుతున్న యాగంటి బసవయ్య
కాకులు కానరాని క్షేత్రంగా ప్రసిద్ధి
పురాతన చరిత్ర ప్రకారం.. యాగంటి ఆలయ ప్రాంతాన్ని పల్లవులు, చోళులు, చాళుక్యులు, విజయనగర రాజులు పరిపాలించారు. యాగంటిలో ప్రధాన గోపురం ఐదు అంతస్తులు ఉంటుంది. 15వ శతాబ్దంలో హరిహర బుక్కరాయలు ఇక్కడి ఆలయాన్ని నిర్మించారు. ఈ గోపురాన్ని దాటగానే రంగమండపం, ముఖ మండపం, అంతరాలయం, గర్భాలయంలో లింగరూపంలో ఉన్న ఉమామహేశ్వరుల రూపాలు దర్శనమిస్తాయి. వాస్తవానికి ఇక్కడ అగస్త్య మహాముని వేంకటేశ్వరస్వామి ఆలయం నిర్మించాలని తలపెట్టాడని చెబుతారు. కానీ ప్రతిష్ఠ చేయాల్సిన చోట వేంకటేశ్వరస్వామి కాలి బొటనవేలు గోరు విరగడంతో ప్రతిష్ఠించలేదు. నిరాశకు లోనైన మునీశ్వరుడు శివుడి కోసం ఘోర తపస్సు చేశారు. శివుడు ప్రత్యక్షమై యాగంటి స్థలంలో కైలాసాన్పి పోలిన శివాలయాన్ని నిర్మించాలని ఆదేశించారు. ఎక్కడా లేని విధంగా ఈ క్షేత్రంలో ఉమామహేశ్వరులు ఏకశిలా రూపంలో భక్తులకు దర్శనమిస్తారు. ఇక్కడ సహజసిద్ధంగా ఏర్పడిన గుహలు సైతం ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. ఈ గుహలోనే వేంకటేశ్వరస్వామి కొలువుదీరారు. చరిత్ర ప్రకారం.. ఇక్కడ ఒక గుహలోనే కూర్చుని కాలజ్ఞాని శ్రీమత్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి కాలజ్ఞానం రాశారని, శిష్యులకు కాలజ్ఞానం బోధించారని తెలుస్తోంది.
అబ్బురపరిచే అగస్త్య పుష్కరిణి
ప్రకృతి ఒడిలో పుట్టిన జలధానపర్వత సానువుల్లో నుంచి ప్రవహిస్తూ ఒక చిన్న నంది విగ్రహం నోటి నుంచి ఆలయ ప్రాంగణంలోని పుష్కరిణికి నీటిధార చేరుతుంది. ఈ నీటికి ఔషధగుణాలున్నాయని ప్రతీతి. ఇందులో స్నానమాచరిస్తే దీర్ఘకాల రోగాలు నయమవుతాయని భక్తుల నమ్మకం. ఏడాది పొడవునా.. మండే ఎండలో అయినా, ముంచెత్తే వర్షంలోనైనా ఈ కోనేరులో నీరు ఒకే మట్టంలో ఉండటం ప్రత్యేకత.
- బనగానపల్లె, ఆంధ్రజ్యోతి

కాకులకు ప్రవేశంలేని క్షేత్రం
ఎర్రమలలో ఓ గుహలో అగస్త్య మహాముని కఠోర తపస్సు చేస్తుండగా, భగ్నం చేసేందుకు కాకాసురుడు అనే రాక్షసుడు వేలాది కాకులను పంపించాడు. తపస్సు చెడగొట్టడానికి కాకాసురుడు ప్రయత్నిస్తున్నాడని తెలుసుకున్న అగస్త్యుడు యాగంటి పరిసర ప్రాంతాల్లో కాకులు సంచరించకూడదని శపించాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ క్షేత్ర పరిధిలో కాకులు కనిపించకపోవడం గొప్ప విశేషం.

అంతకంతకూ పెరుగుతున్న బసవయ్య
వీరబ్రహ్మేంద్రస్వామి తన కాలజ్ఞానంలో యాగంటి బసవయ్య గుర్తించి ప్రస్తావించారు. ‘యాగంటి బసవయ్య అంతకంతకూ పెరిగేను.. కలియుగాన యాగంటి బసవయ్య సజీవంగా వచ్చి రంకెలు వేసేను..’ అంటూ కాలజ్ఞనంలో చెప్పినట్లు ఇక్కడి చరిత్ర ద్వారా తెలుస్తోంది. మొదట్లో ఈ విగ్రహం చిన్నగా ఉండేది. ప్రతి 20 సంవత్సరాలకు ఒక అంగుళం మేర విగ్రహం పెరుగుతోందని భారత పురావస్తు సర్వే సంస్థ కూడా నిర్ధారించింది. గతంలో విగ్రహం చుట్టూ భక్తులు ప్రదక్షిణలు చేసేవారు. నంది పరిమాణం పెరగడంతో ఆలయ సిబ్బంది ఇప్పటికే అక్కడ ఓ స్తంభాన్ని తొలగించారు. ఇప్పుడు నంది విగ్రహం చుట్టూ ప్రదక్షిణలు చేయడానికి అవకాశం లేదు.

ఆ పేరెలా వచ్చిందంటే!
స్థల పురాణం ప్రకారం.. పూర్వం చిట్టెప్ప అనే శివభక్తుడు శివుని కోసం తపస్సు చేయగా, శివుడు అతనికి పులి రూపంలో ప్రత్యక్షమవుతాడు. అప్పుడు చిట్టెప్ప ఆనందంతో ‘పులి రూపంలో ఉన్న శివుని నే కంటి’ (నేను చూశాను) అని అరుస్తూ నృత్యం చేశాడు. ఈ ‘నే కంటి’ అనే పదమే కాలక్రమేణా వాడుకలో యాగంటిగా స్థిరపడిందని చెబుతారు.