Share News

AP Govt: రైతన్నా.. మీకోసం వారోత్సవాలు ప్రారంభం

ABN , Publish Date - Nov 25 , 2025 | 05:26 AM

వ్యవసాయ రంగాన్ని లాభసాటిగా మార్చేందుకు పంచసూత్ర ప్రణాళికలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన రైతన్నా మీకోసం వారోత్సవాలు ఘనంగా ఆరంభమైనాయి.

AP Govt: రైతన్నా.. మీకోసం వారోత్సవాలు ప్రారంభం

  • లాభసాటి సాగుకు పంచసూత్ర ప్రణాళిక

  • ఘంటశాలలో రైతులతో మంత్రి అచ్చెన్న ముఖాముఖి

  • రాష్ట్ర వ్యాప్తంగా మంత్రులు, ఎమ్మెల్యేలూ..

అమరావతి, నవంబరు 24(ఆంధ్రజ్యోతి): వ్యవసాయ రంగాన్ని లాభసాటిగా మార్చేందుకు పంచసూత్ర ప్రణాళికలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ‘రైతన్నా మీకోసం’ వారోత్సవాలు ఘనంగా ఆరంభమైనాయి. వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు సోమవారం కృష్ణా జిల్లా ఘంటశాలలో ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. రైతులకు భరోసా ఇవ్వగల పంచసూత్రాల ప్రణాళికను సీఎం చంద్రబాబు అమలు చేస్తున్నట్లు అచ్చెన్న తెలిపారు. నీటి భద్రత, డిమాండ్‌ ఆధారిత పంటల సాగు, అగ్రిటెక్‌, ఫుడ్‌ ప్రాసెసింగ్‌, సాగుకు ప్రభుత్వాల మద్దతు గురించి వ్యవసాయశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాజశేఖర్‌, డైరెక్టర్‌ మనజీర్‌ జిలానీ వివరించారు. విశాఖ జిల్లా పాయకరావుపేట నియోజకవర్గం రామభద్రపురంలో హోం మంత్రి అనిత ‘రైతన్నా మీకోసం’ కార్యక్రమంలో భాగంగా ప్రకృతి వ్యవసాయ క్షేత్రాన్ని సందర్శించి, వ్యవసాయంపై రైతులతో ముఖాముఖి మాట్లాడారు. రాష్ట్రవ్యాప్తంగా అనేక గ్రామాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, స్థానిక ప్రజాప్రతినిధులు, వ్యవసాయ అనుబంధశాఖల అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ‘రైతన్నా మీకోసం’ కార్యక్రమంపై సీఎం చంద్రబాబు లేఖ కరపత్రాలను రైతు సేవా కేంద్రాల సిబ్బంది రైతులకు అందించారు. పాడి పశువులు, గొర్రెలు, కోళ్లు, ఇతర జీవాలకు అందిస్తున్న వైద్య సేవలు, పశుపెంపకందారులకు అమలు చేస్తున్న పథకాలను పశుసంవర్ధకశాఖ అధికారులు వివరించారు. ఈ సందర్భంగా పశుపోషకుల నుంచి సలహాలు, సూచనలు తీసుకుంటామని పశుసంవర్ధకశాఖ డైరెక్టర్‌ దామోదర్‌నాయుడు తెలిపారు.


ప్రభుత్వ మార్గదర్శకాలు జారీ

రైతన్నా మీకోసం.. వారోత్సవాల అమలుకు ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది. దీని ప్రకారం.. ప్రాథమిక రంగాన్ని పునర్వవస్థీకరించడానికి, రైతులను వ్యవసాయ సంరక్షకులుగా మార్చడం ద్వారా వారి జీవనోపాధి, ఆర్థిక ప్రమాణాలను పెంచడానికి సీఎం చంద్రబాబు నిర్దేశించిన పంచసూత్రాలపై క్షేత్రస్థాయిలో రైతులకు అవగాహన కల్పించాలి. సోమవారం నుంచి రైతుసేవా కేంద్రం యూనిట్‌గా ప్రతి రైతు ఇంటికీ ఈ పంచ సూత్రాల ఉద్దేశాన్ని తీసుకెళ్లాలి. రైతు సేవా కేంద్రంలోని వివిధ శాఖల సిబ్బందితో ఒక బృందాన్ని ఏర్పాటు చేసి, ప్రతి ఆర్‌ఎ్‌సకే కింద ప్రతి మూడు ఇళ్లను ఒక క్లస్టర్‌గా ఏర్పాటు చేసి, ప్రతి బృందం రోజుకు 30క్లస్టర్లు కవర్‌ చేయాలి. ప్రతి క్లస్టర్‌లో 15-20 నిమిషాలు గడిపి, రైతు సంక్షేమ చర్యలపై సీఎం లేఖను కరపత్రాలుగా పంపిణీ చేసి, రైతులకు ఏపీ ఎయిమ్స్‌ యాప్‌, పంచసూత్రాల గురించి వివరించాలి. వారోత్సవాల్లో ప్రతి బృందం 540 ఇళ్లను కవర్‌ చేయాలి. 2026-27 సంవత్సరానికి లాభసాటి సాగు కోసం కార్యాచరణ ప్రణాళిక రూపొందించడానికి డిసెంబరు 3న ప్రతి రైతుసేవా కేంద్రంలో వర్క్‌షాప్‌ నిర్వహించాలి. రైతుసేవా కేంద్రం స్థాయి ప్రణాళికల ముసాయిదాను కలెక్టర్లు, జిల్లా వ్యవసాయాధికారికి అందించాలి.

Updated Date - Nov 25 , 2025 | 05:27 AM