Share News

Deputy CM Pawan: శీతాకాలంలోగా వినియోగంలోకి రుషికొండ ప్యాలెస్‌

ABN , Publish Date - Aug 30 , 2025 | 03:54 AM

రుషికొండపై గత సీఎం జగన్‌ అధిక నిధులు వెచ్చించి నిర్మించిన ప్యాలెస్‌ను ఈ శీతాకాలంలోగా అందుబాటులోకి తెస్తామని డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ వెల్లడించారు. పార్టీకి చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలిసి...

Deputy CM Pawan: శీతాకాలంలోగా వినియోగంలోకి రుషికొండ ప్యాలెస్‌

  • ఎలా ఉపయోగిస్తే మంచిదో సలహాలివ్వండి: పవన్‌

  • జనసేన ప్రజా ప్రతినిధులతో కలిసి ప్యాలెస్‌ సందర్శన

  • రుషికొండపై ఉపసంఘం.. వెంటనే సిఫారసులు చేయాలని ప్రభుత్వ ఆదేశాలు

ఇంటర్నెట్ డెస్క్: రుషికొండపై గత సీఎం జగన్‌ అధిక నిధులు వెచ్చించి నిర్మించిన ప్యాలెస్‌ను ఈ శీతాకాలంలోగా అందుబాటులోకి తెస్తామని డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ వెల్లడించారు. పార్టీకి చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలిసి శుక్రవారం ఉదయం రుషికొండ ప్యాలె్‌సను ఆయన పరిశీలించారు. మొత్తం నాలుగు బ్లాకులూ తిలకించారు. కొన్నిచోట్ల భవనం పైకప్పు పెచ్చులూడి పడిపోవడం గమనించి ఆవేదన చెందారు. మరికొన్ని ప్రాంతాల్లో వర్షానికి నీరు కారడం గమనించారు. ఈ సందర్భంగా సహచరులతో మాట్లాడుతూ, వైసీపీ ప్రభుత్వ హయాంలో ఈ భవనాన్ని చూడడానికి తాను వస్తే గేటు వరకు కూడా రానీయలేదని, రోడ్డు పైనుంచే పోలీసులు అడ్డుకొని పంపించేశారని గుర్తు చేసుకున్నారు. భవనం పరిశీలన పూర్తయిన తరువాత అక్కడే పార్టీ నాయకులు నాదెండ్ల మనోహర్‌, కందుల దుర్గేశ్‌, కొణతాల రామకృష్ణ, పంచకర్ల రమేశ్‌బాబు తదితరులతో సమావేశమయ్యారు. భవనం ఏడాదిన్నరగా ఖాళీగా ఉందని, దీనిని ఎలా ఉపయోగిస్తే బాగుంటుందో సూచనలు చేయాలని కోరారు. పర్యాటక శాఖకు చెందిన ఈ భవనాన్ని త్వరగా వినియోగంలోకి తేవాలని సీఎం చంద్రబాబును కోరగా, ఏం చేస్తే బాగుంటుందో సలహా ఇవ్వాలని సూచించారని, అంతా కలసి కొన్ని సూచనలు చేస్తే మంత్రివర్గ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉందన్నారు. అయితే ఎక్కువ మందికి భవనాన్ని సందర్శించే అవకాశం కల్పించడం అనేది ప్రధానం కాదని, రూ.453 కోట్ల పెట్టుబడికి తగిన ఆదాయం వచ్చేలా సూచనలు ఉండాలన్నారు. లాభం రాకపోయినా ఫరవాలేదని కనీసం బ్రేక్‌ ఈవెన్‌ వచ్చినా చాలన్నారు. దీనిపై నేతలంతా తమ అభిప్రాయాలు తెలిపారు. అనంతరం పవన్‌ స్పందిస్తూ.. మైస్‌ (మీటింగ్స్‌, ఎగ్జిబిషన్స్‌, తదితరాలు), డెస్టినేషన్‌ వెడ్డింగ్స్‌కు ఉపయోగించుకుంటే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. ఆ తరువాత ఆయన బయటకు వచ్చి విలేకరులతో మాట్లాడారు.


ప్యాలెస్‌ నిర్మాణానికి జగన్మోహన్‌రెడ్డి ప్రజాధనం దుర్వినియోగం చేశారని ఆరోపించారు. ఏడాదికి రూ.7 కోట్ల ఆదాయం తెస్తున్న హరిత రిసార్ట్స్‌ను కూల్చేసి, దానిని మరింత అభివృద్ధి చేస్తామని సుప్రీంకోర్టుకు చెప్పి అనుమతులు తెచ్చారన్నారు. ఏడు బ్లాకుల నిర్మాణానికి రూ.164 కోట్ల అంచనా వ్యయంతో పనులు ప్రారంభించి, అందులో కేవలం నాలుగు బ్లాకులే నిర్మించి, వాటికే రూ.453 కోట్లు ఖర్చు చేశారన్నారు. ఇప్పుడు ఆ భవనంలో అప్పుడప్పుడు నిర్వహణ కోసం విద్యుద్దీపాలు వేస్తేనే ఏడాదికి రూ.1.5 కోట్ల బిల్లు వస్తోందని పేర్కొన్నారు. నిర్వహణ లేక భవనాలు పాడైపోతున్నాయని ఆవేదన వ్యక్తంచేశారు. తక్షణమే భవనానికి సేఫ్టీ ఆడిట్‌ చేసి, నిర్వహణ పనులు కూడా చేపట్టాల్సి ఉందన్నారు. భవనంలో ఇంటీరియర్‌ డెకరేషన్‌ కోసం రూ.39 కోట్లు వెచ్చించారని, ట్రాన్స్‌కో, జీవీఎంసీ, హార్టీకల్చర్‌, పర్యాటక శాఖ నుంచి దారిమళ్లించిన నిధులతో నిర్మాణం చేశారని పవన్‌ కల్యాణ్‌ తెలిపారు.


‘రుషికొండ’పై మంత్రివర్గ ఉపసంఘం

అమరావతి, ఆగస్టు 29 (ఆంధ్రజ్యోతి): మాజీ ముఖ్యమంత్రి జగన్‌ కుటుంబ సమేతంగా నివాసం ఉండేందుకు రూ.450 కోట్ల ప్రజాధనంతో నిర్మించిన విలాసవంతమైన విశాకలోని రుషికొండ ప్యాలెస్‌ భవనాలను ఏం చేయాలన్న దానిపై ప్రభుత్వం కసరత్తు చేస్తూనే ఉంది. ప్రస్తుతం దీనిపై పూర్తిస్థాయిలో కసరత్తు చేసి ప్రభుత్వానికి సిఫారసు చేసేందుకు ఒక మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్‌ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇందులో పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్‌, ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్‌, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోల బాలవీరాంజనేయ స్వామి ఉన్నారు. పర్యాటక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి మెంబర్‌ కన్వీనర్‌గా ఉంటారు. ఏపీటీడీసీ ఎండీ కూడా ఉపసంఘం, స్పెషల్‌ సీఎ్‌సతో సమన్వయం చేసుకోవాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. మంత్రివర్గ ఉపసంఘం వెంటనే తన సిఫారసులను ప్రభుత్వానికి పంపించాలని ఆదేశించింది.

Updated Date - Aug 30 , 2025 | 03:58 AM