Share News

Cabinet sub committee: ఆతిథ్యం ఇవ్వనున్న రుషికొండ!

ABN , Publish Date - Dec 25 , 2025 | 04:22 AM

ఆతిథ్య రంగ అవసరాలకు విశాఖ రుషికొండ ప్యాలె్‌సను కేటాయించాలని యోచిస్తున్నామని మంత్రులు పయ్యావుల కేశవ్‌, కందుల దుర్గేశ్‌ వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వంపై భారంపడకుండా, ప్రజా ప్రయోజనాలకు అనుగుణంగా...

Cabinet sub committee: ఆతిథ్యం ఇవ్వనున్న రుషికొండ!

  • ప్యాలె్‌సపై రెండు ఫ్లోర్లు వేసి హోటళ్లకు కేటాయింపు

  • కేబినెట్‌ సబ్‌ కమిటీలో ప్రతిపాదన

అమరావతి, డిసెంబరు 24(ఆంధ్రజ్యోతి): ఆతిథ్య రంగ అవసరాలకు విశాఖ రుషికొండ ప్యాలె్‌సను కేటాయించాలని యోచిస్తున్నామని మంత్రులు పయ్యావుల కేశవ్‌, కందుల దుర్గేశ్‌ వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వంపై భారంపడకుండా, ప్రజా ప్రయోజనాలకు అనుగుణంగా, ప్రభుత్వానికి ఆదాయం కూడా సమకూరేలా త్వరలోనే రుషికొండపై నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. వైసీపీ హయంలో రూ.వందల కోట్లు ఖర్చుచేసి నిర్మించిన రుషికొండ ప్యాలెస్‌ వినియోగంపై నిర్ణయంలో జరుగుతున్న జాప్యం పట్ల ఇటీవల కలెక్టర్ల సమావేశంలో సీఎం చంద్రబాబు అసహనం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇప్పటికే దీనిపై ఏర్పాటైన మంత్రుల సబ్‌ కమిటీ బుధవారం అమరావతి సచివాలయంలో మూడోసారి భేటీ అయింది. అధికారులు ప్యాలె్‌సకు సంబంధించిన వివరాలను కమిటీకి వివరించారు. సుదీర్ఘ చర్చల అనంతరం ప్యాలెస్‌ వినియోగంపై పలు ప్రతిపాదనలు ముందుకొచ్చాయి. ప్యాలెస్‌ నిర్వహణకు తాజ్‌ లీలా, అట్మాస్‌ కోర్‌, ఫెమా సంస్థలు ముందుకు వచ్చినట్లు ఈ సమావేశంలో మంత్రి కేశవ్‌ తెలిపారు. అయితే, రుషికొండ భవనాలు హోటళ్ల నిర్వహణకు పూర్తి అనుకూలంగా లేవని ఆ సంస్థలు అభిప్రాయపడ్డాయని పేర్కొన్నారు. ప్యాలె్‌సపై అదనంగా భవంతులు నిర్మిస్తే ఎలా ఉంటుందని సబ్‌ కమిటీ ఆలోచనలు చేసింది. ప్యాలెస్‌ నిర్మాణంలో కొన్ని మార్పులు చేసి, ఆతిథ్య రంగానికి కేటాయిస్తే బాగుంటుందనే ప్రతిపాదనకు మెజారిటీ మంత్రులు మొగ్గు చూపినట్టు తెలిసింది. అయితే, ఈ నెల 28న ఆన్‌లైన్‌లో భేటీ అయి అన్నిరకాల ప్రతిపాదనలపై మరోసారి చర్చించాలని సబ్‌ కమిటీ నిర్ణయించింది. కాగా, బీచ్‌ ఫ్రంట్‌ వినియోగంపై కూడా కమిటీ సుదీర్ఘ చర్చ జరిపింది. అంతర్జాతీయ ప్రమాణాలను పాటిస్తూ మాల్దీవులు, పుదుచ్చేరి తరహా విధానాలను అసుసరిస్తే బాగుంటుందనే అభిప్రాయం వచ్చింది. ఈ వివరాలను సమావేశానంతరం మీడియాకు పయ్యావుల కేశవ్‌, దుర్గేశ్‌ వెల్లడించారు.

ప్రస్తుత నిర్మాణాలు హోటళ్లకు పనికిరావు : కేశవ్‌

‘‘రుషికొండ కింద ఉన్న తొమ్మిది ఎకరాలను హోటళ్ల కోసం అదనంగా కొంతమంది అడిగారు. అందులో ఏడు ఎకరాల్లో అదనపు భవనాలు, సదుపాయాలు కల్పించే వీలుంది. అయితే, అది సీఆర్‌జడ్‌ పరిధిలోకి వస్తోంది. అందువల్ల నిబంధనలు అంగీకరించవు. ఉన్న రెండెకరాలకు అదనంగా భూములేమైనా అందుబాటులో ఉన్నాయేమోనని పరిశీలిస్తున్నాం. ప్రస్తుతం ఉన్న రుషికొండ ప్యాలెస్‌ నిర్మాణం హోటళ్ల నిర్వహణకు పనికిరాదు. ప్యాలె్‌సపై అదనంగా మరో రెండు ఫ్లోర్లు వేస్తే హోటళ్లకు అనువుగా ఉంటుందనే అభిప్రాయం కమిటీ భేటీలో వచ్చింది..’’ అని మంత్రి పయ్యావుల కేశవ్‌ తెలిపారు. రుషికొండ ప్యాలె్‌సలో చివర ఉన్న రెండు మూడు బ్లాకులు ప్రజలకు ఆర్ట్‌ గ్యాలరీ, సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణ కోసం ఉంచుతామని, మిగతావి హోటళ్లకు ఇచ్చే యోచన చేస్తున్నామని వివరించారు. గత ప్రభుత్వ నిర్ణయం వల్ల ప్రజా ధనం వృఽథా అయిందని, రుషికొండ ప్యాలెస్‌ తెల్ల ఏనుగులా మారిందన్నారు. పర్యాటకశాఖ భూములపై సమగ్ర సర్వే నిర్వహించాలని ఆదేశించామని, నివేదిక వచ్చిన తర్వాత తదుపరి భేటీలో నిర్ణయం తీసుకుంటామని కేశవ్‌ తెలిపారు.


ఆదాయం పోయింది.. ఖజానాకూ భారం: దుర్గేశ్‌

రుషికొండ ప్యాలె్‌సపై ప్రభుత్వం తల బద్దలు కొట్టుకోవాల్సిన పరిస్థితిని గత ప్రభుత్వం కల్పించిందని మంత్రి కందుల దుర్గేశ్‌ తెలిపారు. ‘‘పర్యాటకశాఖకు ఏటా రూ.7 కోట్ల ఆదాయం తెచ్చిపెట్టే రిసార్ట్స్‌ స్థానంలో ప్యాలెస్‌ కట్టారు. దీని వల్ల ఆదాయం కోల్పోవడమే కాకుండా ప్రతి నెల రూ.25 లక్షల నిర్వహణ భారం పర్యాటకశాఖపై పడుతోంది. అందుబాటులో ఉన్న భూముల్లోనే ప్రభుత్వానికి ఆదాయం వచ్చేలా, ప్రజల సందర్శనార్థం ఉపయోగపడేలా చర్యలు తీసుకుంటాం. సముద్రం ఆటుపోటుల వల్ల రుషికొండ కింద ఉన్న తొమ్మిది ఎకరాల్లో 2 ఎకరాలు మాత్రమే అందుబాటులో ఉంది. వాస్తవానికి అక్కడ 9 ఎకరాలు ఉందని ముందుకొచ్చిన మదుపుదారులు ముందుకొచ్చారు. వారికి ఇప్పుడు ప్రత్యామ్నాయం చూపించాల్సి ఉంది. సీఆర్‌జెడ్‌ నిబంధనలు పరిశీలించగా, కొండపై 60 వేల చ.అడుగుల్లో నిర్మాణానికి అనుకూలంగా ఉం దని గుర్తించాం. దీనికి సంబంధించి పలు సంస్థలు ముందుకు వచ్చాయి. వయబుల్‌ ప్రాజెక్టుపైనే దృష్టి సారించాం. త్వరలోనే రుషికొండ ప్యాలె్‌స వినియోగ ంపై తుది నిర్ణయం తీసుకుంటా’మని దుర్గేశ్‌ తెలిపారు.

Updated Date - Dec 25 , 2025 | 04:22 AM