Minister Nadendla Manohar: రుషికొండ ప్యాలెస్‌తో పర్యావరణం నాశనం
ABN , Publish Date - Aug 31 , 2025 | 05:21 AM
రుషికొండపై పర్యావరణాన్ని నాశనం చేసి, ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి విలాసవంతమైన భవంతిని ఎందుకు కట్టుకున్నారో జగన్ చెప్పాలని జనసేన పీఏసీ చైర్మన్, మంత్రి నాదెండ్ల మనోహర్ డిమాండ్ చేశారు.
453 కోట్ల ప్రజాధనం దుర్వినియోగం
ఆ భవంతి ఎందుకు కట్టుకున్నారో చెప్పాలి: నాదెండ్ల
విశాఖపట్నం, ఆగస్టు 30 (ఆంధ్రజ్యోతి): రుషికొండపై పర్యావరణాన్ని నాశనం చేసి, ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి విలాసవంతమైన భవంతిని ఎందుకు కట్టుకున్నారో జగన్ చెప్పాలని జనసేన పీఏసీ చైర్మన్, మంత్రి నాదెండ్ల మనోహర్ డిమాండ్ చేశారు. రూ.453 కోట్లతో రుషికొండపై ప్యాలస్ కట్టుకోవాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు. విశాఖలోని ఇందిరా ప్రియదర్శిని మునిసిపల్ స్టేడియంలో శనివారం ‘సేనతో సేనాని’ సమావేశంలో తొలుత నాదెండ్ల మనోహర్ మాట్లాడారు. ‘‘రుషికొండ భవంతిని పరిశీలించేందుకు మేం వెళితే దానిపై దుష్ప్రచారం చేస్తున్నారు. పెచ్చులూడి, నీరు చేరిన విషయాన్ని గుర్తించి చూపిస్తే.. కావాలని చేసినట్లుగో ఓ పత్రికలో రాశారు. ఇంతకంటే దుర్మార్గం ఉంటుందా?. మీడియాలో చేస్తున్న ఈ తరహా దుష్ప్రచారాన్ని కార్యకర్తలు తిప్పికొట్టాలి. వైసీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్రానికి ఎంతో నష్టం జరిగింది. ప్రజాస్వామ్యంలో ఎన్నికల్లో పోటీ చేయలేని స్థితిని ఆ పార్టీ నాయకులు తీసుకువచ్చారు. వైసీపీ పాలనను అందరూ గుర్తుపెట్టుకోవాలి. ప్రతి కుటుంబాన్ని ఎలా ఇబ్బంది పెట్టిందో గుర్తుంచుకోవాలి. కూటమి ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమం లక్ష్యంగా అడుగులు ముందుకు వేస్తోంది. పార్టీ, ప్రభుత్వ కార్యక్రమాలు గురించి తెలుసుకుని ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లాలి. జనసేన పార్టీ రిజిస్టర్ పార్టీ స్థాయి నుంచి రికగ్నైజ్డ్ పార్టీ స్థాయికి చేరుకుంది. ప్రతి ఒక్కరికీ పదవులు రావాలని, నాయకత్వం అందించాలన్నదే పవన్‌కల్యాణ్ ఉద్దేశం’’ అని చెప్పారు. జనసేన సభలో మంత్రులు నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేశ్, ఎంపీలు బాలశౌరి, టి.ఉదయ్ శ్రీనివాస్, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నాయకులు పాల్గొన్నారు.