Swamitva Scheme: గ్రామీణుల చేతికి ఆస్తిహక్కు!
ABN , Publish Date - Nov 10 , 2025 | 04:29 AM
ఆస్తి హక్కుల కోసం దశాబ్దాల తరబడి ఎదురు చూస్తున్న గ్రామీణులకు భారీ మేలు జరగనుంది. గ్రామీణ ప్రాంతాల్లో అస్తవ్యస్తంగా ఉన్న స్థిరాస్తుల వివరాలను గాడిలో పెట్టి వాటిపై సంబంధిత....
ఆబడి, అనాధీన, ఆక్రమణభూములపై సర్వే.. హక్కుల కల్పన
స్థిరాస్తి కార్డుల పంపిణీకి సిద్ధం
‘స్వామిత్వ’తో తొలగనున్న ఇక్కట్లు
5,847 గ్రామాల్లో మ్యాపింగ్ పూర్తి
నేటి నుంచి 2,344 గ్రామాల్లో సభలు
అమరావతి, నవంబరు 9(ఆంధ్రజ్యోతి): ఆస్తి హక్కుల కోసం దశాబ్దాల తరబడి ఎదురు చూస్తున్న గ్రామీణులకు భారీ మేలు జరగనుంది. గ్రామీణ ప్రాంతాల్లో అస్తవ్యస్తంగా ఉన్న స్థిరాస్తుల వివరాలను గాడిలో పెట్టి వాటిపై సంబంధిత వ్యక్తులకు హక్కులు కల్పించే ప్రక్రియను ప్రభుత్వం వేగవంతం చేసింది. గ్రామాల్లో ప్రభుత్వ లెక్కల్లో లేని ఆబడి, అనాధీన, ఆక్రమణలకు సంబంధించిన ఆస్తులను గుర్తించి.. సంబంధిత హక్కుదారులకు పట్టాలు అందించనుంది. ‘స్వామిత్వ’ పథకం ద్వారా దేశ వ్యాప్తంగా ఇలాంటి ఆస్తులకు సంబంధించిన వివరాలు సేకరించడంతోపాటు హక్కుదారులకు స్థిరాస్తి కార్డులు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో 2020లోనే స్వమిత్వ పథకాన్ని ప్రారంభించింది. రాష్ట్రంలో దీనిని 2021 నుంచి అమలులోకి తీసుకువచ్చినా.. గత వైసీపీ ప్రభుత్వం మూడేళ్లలో 1,300 గ్రామాల్లో మాత్రమే ప్రాపర్టీ కార్డులు అందించింది. ప్రస్తుత ప్రభుత్వం 4 నెలల్లోనే 5,847 గ్రామాల్లో సర్వే పూర్తిచేసి ప్రాపర్టీ కార్డులు ఇచ్చేందుకు సిద్ధమైంది. ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఆదేశాలతో అధికారులు ఈ ప్రక్రియను వేగవంతం చేశారు. వచ్చే ఏడాది మార్చిలోపు రాష్ట్రంలోని ప్రతి గ్రామంలోనూ హక్కుదారులకు స్థిరాస్తి కార్డులు అందిస్తారు.
నేటి నుంచి గ్రామసభలు
2,344 గ్రామాల్లో సోమవారం నుంచి గ్రామ సభలు నిర్వహించి ఆస్తుల వివరాలను అధికారులు వెల్లడించనున్నారు. పంచాయతీ కార్యదర్శి, ఇంజనీరింగ్ అసిస్టెంట్, గ్రామ సర్వేయర్, రెవెన్యూ అధికారి, డిజిటల్ అసిస్టెంట్లు పాల్గొంటారు. ఆస్తులకు సంబంధించి గ్రామీణుల వద్ద ఉన్న ఆధారాలను పరిగణనలోకి తీసుకుంటారు. అభ్యంతరాలుంటే నమోదు చేస్తారు. వీటిని వారంలోపు పరిష్కరిస్తారు. పరిష్కారం కానట్లయితే ఫాం-19 ద్వారా అప్పీల్ చేసుకుని రీసర్వే కోసం డిప్యూటీ తహసీల్దార్‌కు పంపిస్తారు. సభకు రాని వారి ఇంటింటికీ వెళ్లి సంతకాలు తీసుకుంటారు. యజమానుల సమాచారం లేనప్పుడు ఇంటి పన్ను వివరాలను యధాతథంగా పరిగణిస్తారు. ఆధార్, మొబైల్ నంబర్, డాక్యుమెంట్లు మొదలైన వివరాలను సేకరించి డిజిటలీకరణ చేస్తారు. సభలో తీర్మానం చేసి గ్రామ సభ రిజిస్టర్‌లో నమోదు చేస్తారు.
వివాదాలకు దూరంగా
5,847 గ్రామాల్లో డ్రోన్లు, యజమానులు, ప్రభుత్వం వద్ద ఉన్న రికార్డుల ఆధారంగా ఆస్తుల వివరాలను సేకరించారు. ఏదైనా కుటుంబానికి డాక్యుమెంట్లు లేకపోయినా.. వారి ఆస్తి గ్రామకంఠంలో 12 ఏళ్ల పాటు వారి ఆధీనంలో ఉన్నట్టు గుర్తిస్తే.. వారికి కూడా యాజమాన్య పత్రాలు అందిస్తారు. వివాదస్పద స్థలాలుంటే సంబంధిత అధికారులతో చర్చించి పరిష్కరిస్తారు. కోర్టుల్లో వివాదాలుంటే వాటి పరిష్కారం తర్వాతే ప్రాపర్టీ కార్డులు అందజేస్తారు. గ్రామ కంఠం సహా జగనన్న ఇళ్ల కాలనీలకు విస్తరించిన గ్రామ కంఠాలను సైతం పరిగణనలోకి తీసుకుంటారు. వివాదాలకు దూరంగా ఈ ప్రక్రియను పూర్తి చేయనున్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజల ఆస్తులతో పాటు పంచాయతీలు, ఉమ్మడి ఆస్తులైన గ్రామీణ రోడ్లు, కుంటలు, కాలువలు, ఖాళీ స్థలాలు, పాఠశాలలు, అంగన్‌వాడీ, ఆరోగ్య ఉప కేంద్రాలను కూడా సర్వే చేసి జీఐఎస్ మ్యాపులను రూపొందిస్తారు. ఈ మ్యాపులు రాష్ట్ర రికార్డులలో పొందుపరుస్తారు. తర్వాత తుది డిజిటల్ మ్యాప్‌లను కేంద్ర పంచాయతీరాజ్‌శాఖకు కూడా అందిస్తారు.
క్రయ విక్రయాలు సులువు!
గ్రామీణ ప్రాంతాల్లో ఆబడి, అనాధీన, ఆక్రమిత భూముల్లో దశాబ్దాల తరబడి ఉంటున్న వారికి చట్టబద్ధంగా ఇప్పటి వరకు హక్కులు కల్పించలేదు. దీంతో వారు ఆయా భూములు, ఇళ్లను బ్యాంకుల్లో తనఖా పెట్టి రుణాలు పొందలేని, క్రయ విక్రయాలు చేసుకోలేని పరిస్థితి ఏర్పడింది. పైగా కొన్ని రకాల భూముల విషయంలో వివాదాలు కూడా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి ఆస్తినీ గుర్తించి, దాని విలువను లెక్కించి.. యజమానికి హక్కులు కల్పించనున్నారు. ఈ ప్రాపర్టీ కార్డుల ఆధారంగా బ్యాంకుల నుంచి రుణాలు పొందడమే కాకుండా.. క్రయ విక్రయాలు కూడా చేసుకునే అవకాశం ఏర్పడనుంది. గ్రామాల్లో ఆయా ప్రభుత్వ శాఖలకు సంబంధించిన ఆస్తులను కూడా గుర్తించి ఆయా శాఖలకు వాటిని మ్యాపింగ్ చేస్తారు. స్వామిత్వ పథకానికి కేంద్ర పంచాయతీరాజ్‌శాఖ నోడల్ మంత్రిత్వశాఖగా వ్యవహరిస్తోంది. సర్వే ఆఫ్ ఇండియా సాంకేతిక సహకారం అందిస్తోంది.