Rural Electrification Corporation: హైబ్రిడ్ ఎనర్జీ ప్రాజెక్టుకు ఆర్‌ఈసీ నుంచి 7,500 కోట్లు
ABN , Publish Date - Nov 04 , 2025 | 04:40 AM
పునురుత్పాదక ఇంధన ఉత్పత్తి హబ్‌గా ఆంధ్రప్రదేశ్ మారడానికి భారీ ముందడుగు పడింది. కర్నూలు జిల్లాలో బ్రూక్‌ఫీల్డ్ అనుబంధ సంస్థ ఏర్పాటు చేసే హైబ్రిడ్ పునరుత్పాదక...
కర్నూలులో 1,040 మెగావాట్ల ప్రాజెక్టుకు మార్గం సుగమం
న్యూఢిల్లీ, నవంబరు 3(ఆంధ్రజ్యోతి): పునురుత్పాదక ఇంధన ఉత్పత్తి హబ్‌గా ఆంధ్రప్రదేశ్ మారడానికి భారీ ముందడుగు పడింది. కర్నూలు జిల్లాలో బ్రూక్‌ఫీల్డ్ అనుబంధ సంస్థ ఏర్పాటు చేసే హైబ్రిడ్ పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టుకు రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్(ఆర్‌ఈసీ) రికార్డు స్థాయిలో రూ. 7,500 కోట్ల ఆర్థిక సాయాన్ని సోమవారం ప్రకటించింది. ఈ ప్రాజెక్టులో భాగంగా ఆ సంస్థ 400 మెగావాట్ల సోలార్ విద్యుత్, 640 మెగావాట్ల పవన విద్యుత్ ప్లాంట్లను ఏర్పాటు చేయనుంది. ఈ 1,040 మెగావాట్ల ప్రాజెక్టుకు రూ. 9,910 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేశారు. ఈ ప్రాజెక్టును బ్రూక్‌ఫీల్డ్, యాక్సెస్ ఎనర్జీ జాయింట్ వెంచర్ ప్లాట్‌ఫాం ఎవ్రెన్ చేపట్టనుంది. బ్రూక్‌ఫీల్డ్ గ్లోబల్ ప్రెసిడెంట్ కానర్ టెస్కీతో లండన్‌లో ఈ ఏడాది ఆగస్టులో మంత్రి లోకేశ్ సమావేశమైన నేపథ్యంలో ఈ ప్రాజెక్టుకు ముందడుగు పడింది. ఆర్‌ఈసీ ప్రకటన పట్ల మంత్రి లోకేశ్ స్పందిస్తూ.. ఇది రాష్ట్ర కొత్త క్లీన్ ఎనర్జీ పాలసీ ఫలితానికి ప్రత్యక్ష ఉదాహరణ అన్నారు.