Share News

RTI Commissioners Appointment: ఆర్టీఐ కమిషనర్లపై కసరత్తు కొలిక్కి

ABN , Publish Date - Dec 27 , 2025 | 03:58 AM

సమాచార హక్కు (ఆర్‌టీఐ) కమిషనర్ల నియామకంపై కసరత్తు కొలిక్కి వచ్చినట్లు సమాచారం.

RTI Commissioners Appointment: ఆర్టీఐ కమిషనర్లపై కసరత్తు కొలిక్కి

  • చీఫ్‌ కమిషనర్‌గా వజ్జా శ్రీనివాసరావు పేరు పరిశీలన

  • మరో ఐదుగురిని కమిషనర్లుగా నియమించే అవకాశం

  • ముగ్గురు లాయర్లకు చాన్సు

అమరావతి, డిసెంబరు 26 (ఆంధ్రజ్యోతి): సమాచార హక్కు (ఆర్‌టీఐ) కమిషనర్ల నియామకంపై కసరత్తు కొలిక్కి వచ్చినట్లు సమాచారం. ఈ నియామకాలపై సీఎం చంద్రబాబు టీడీపీ నాయకులతో ఇప్పటికే ఒక దఫా చర్చలు జరిపినట్లు సమాచారం. ప్రధాన కమిషనర్‌(చీఫ్‌ ఇన్ఫరేషన్‌ కమిషనర్‌)గా ప్రముఖ న్యాయవాది వజ్జా శ్రీనివాసరావు పేరును పరిశీలిస్తున్నట్లు తెలిసింది. ప్రస్తుతం ఆర్టీఐలో ముగ్గురు కమిషనర్లు ఉండగా మరో ఐదుగురిని నియమించాలని నిర్ణయించారు. ఆ ఐదుగురిలో ముగ్గురి పేర్లు దాదాఫు ఖరారైనట్లు సమాచారం. వీరంతా న్యాయవాదులే. కడపకు చెందిన రవి యాదవ్‌, అనంతపురానికి చెందిన ఆదెన్న, విశాఖకు చెందిన పీఎస్‌ నాయుడి పేర్లను పరిగణనలోకి తీసుకున్నట్లు తెలిసింది. వీరితోపాటు మరో ఇద్దరిని కమిషనర్లుగా నియమించనున్నారు. ఆర్టీఐ కమిషనర్లను ఖరారు చేసేందుకు సెలెక్షన్‌ కమిటీని ఏర్పాటు చేయాల్సి ఉంది. ఈ కమిటీలో సీఎం, సీనియర్‌ మంత్రి, ప్రతిపక్ష నేత సభ్యులుగా ఉంటారు. ప్రస్తుతం ప్రతిపక్ష నేత ఎవ్వరూ లేకపోవడంతో మరో సీనియర్‌ మంత్రిని కమిటీలోకి తీసుకుని పేర్లను ఖరారు చేసి గవర్నర్‌ ఆమోదానికి పంపనున్నారు. గవర్నర్‌ ఆమోదం పొందిన తర్వాత త్వరలో ఆర్టీఐ ప్రధాన కమిషనర్‌తోపాటు కమిషనర్ల పేర్లను ప్రకటించే అవకాశం ఉంది.

Updated Date - Dec 27 , 2025 | 04:00 AM