Anantapur: అదుపుతప్పిన ఆర్టీసీ బడి బస్సు
ABN , Publish Date - Nov 06 , 2025 | 04:56 AM
అనంతపురం జిల్లా పుట్లూరు మండలంలో ఆర్టీసీ బడి బస్సు అదుపు తప్పింది. స్టీరింగ్ స్ట్రక్ అయి, బ్రేక్ పనిచేయకపోవడంతో రోడ్డు పక్కకు దూసుకెళ్లి గుంతలోకి ఒరిగిపోయింది.
స్టీరింగ్ తిరగక.. బ్రేక్ పట్టేసి.. ప్రమాదం
అనంతలో ఘటన.. విద్యార్థులు సురక్షితం
పుట్లూరు, నవంబరు 5(ఆంధ్రజ్యోతి): అనంతపురం జిల్లా పుట్లూరు మండలంలో ఆర్టీసీ బడి బస్సు అదుపు తప్పింది. స్టీరింగ్ స్ట్రక్ అయి, బ్రేక్ పనిచేయకపోవడంతో రోడ్డు పక్కకు దూసుకెళ్లి గుంతలోకి ఒరిగిపోయింది. అదృష్టవశాత్తూ విద్యార్థులకు ఎలాంటి హానీ జరగలేదు. పుట్లూరు ఆదర్శ పాఠశాల నుంచి విద్యార్థులను తరలించేందుకు రోజూ తాడిపత్రి డిపో నుంచి ఆర్టీసీ బస్సు వస్తోంది. ఈ బస్సు పుట్లూరు నుంచి మడ్డిపల్లి వరకు వెళుతుంది. ఎప్పటిలాగే బుధవారం సాయంత్రం పాఠశాల విడిచిన వెంటనే విద్యార్థులను తీసుకుని బయలుదేరింది. పుట్లూరు దాటిన అనంతరం చింతకుంట శివారులో ప్రమాదానికి గురైంది. దీంతో బస్సులో ఉన్న సుమారు 72 మంది విద్యార్థులు కేకలు వేస్తూ భయభ్రాంతులకు గురయ్యారు. బస్సు గుంతలోకి దిగి ఆగిపోయిన వెంటనే బిరబిరా మంటూ బయటికి వచ్చేశారు. స్థానికులు బస్సు వద్దకు చేరుకుని సహాయక చర్యల్లో పాల్గొన్నారు. విద్యార్థులను ప్రైవేటు వాహనాల్లో వారి గ్రామాలకు తరలించారు. ప్రమాద స్థలాన్ని సీఐ సత్యబాబు పరిశీలించారు. ఘటనపై ఆర్టీసీ బస్సు డ్రైవర్‌ను విచారిస్తున్నామని తెలిపారు.