Share News

ఆర్టీసీ ప్రయాణికుడికి మహిళా కండక్టర్‌ చెంపదెబ్బ

ABN , Publish Date - Jun 27 , 2025 | 12:43 AM

టికెట్‌కు సరిపడ చిల్లర ఇవ్వలేదన్న కారణంతో ప్రయాణికుడిపై ఆర్టీసీ మహిళా కండక్టర్‌ దాడి చేసిన ఘటన గురువారం తోట్లవల్లూరులో జరిగింది.

ఆర్టీసీ ప్రయాణికుడికి మహిళా కండక్టర్‌ చెంపదెబ్బ

-టికెట్‌కు సరిపడా చిల్లర ఇవ్వలేదని గొడవ

- బూతులు తిట్టడంతో కొట్టానంటున్న కండక్టర్‌

- తిట్టలేదంటున్న బాధిత ప్రయాణికుడు

తోట్లవల్లూరు, జూన్‌ 26 (ఆంధ్రజ్యోతి) :

టికెట్‌కు సరిపడ చిల్లర ఇవ్వలేదన్న కారణంతో ప్రయాణికుడిపై ఆర్టీసీ మహిళా కండక్టర్‌ దాడి చేసిన ఘటన గురువారం తోట్లవల్లూరులో జరిగింది. తోట్లవల్లూరు లైన్‌ బజారుకు చెందిన పెద్దిబోయిన మల్లికార్జునరావు ఉయ్యూరు వెళ్లేందుకు తోట్లవల్లూరు సెంటర్‌లో 209 నెంబరు గల ఆర్టీసీ బస్సు ఎక్కాడు. టికెట్‌ కోసం రూ.200 నోట్‌ ఇవ్వటంతో మల్లికార్జునరావుని సరిపడా చిల్లర ఇవ్వమని మహిళా కండక్టర్‌ అడిగారు. నా వద్ద చిల్లర లేదని చెప్పటంతో కండక్టర్‌ తోట్లవల్లూరు శివారు కనకదుర్గమ్మ కాలనీ వద్ద బస్సు ఆపేసి ప్రయాణికుడిని కిందకి దింపేశారు. తనను ఎందుకు దింపుతావని మల్లికార్జునరావు ప్రశ్నించాడు. దీంతో కండక్టర్‌ ఒక్కసారిగా కోపంతో మల్లికార్జునరావు చొక్కా పట్టుకుని చెంపపై కొట్టటంతో డ్రైవర్‌, స్థానికులు ఇద్దరు వచ్చారు. ఏం జరిగిందని వారు అడగ్గా ఇతను తనను బూతులు తిట్టాడని కండక్టర్‌ అనటంతో, తాను తిట్టలేదని ప్రయాణికుడు బదులివ్వటంతో తిట్టలేదంటే మళ్లీ కొడతానని హెచ్చరించటం జరిగింది. వదిలేయమని స్థానికులు కోరటంతో కండక్టర్‌ ప్రయాణికుడి చొక్కా వదిలిపెట్టింది. మార్గమధ్యలోనే మల్లికార్జునరావుని వదిలేశారు. ఈ ఘటనపై పోలీసులకు ఎలాంటి ఫిర్యాదు అందలేదు. ఈ కండక్టర్‌ పేరు అరుణకుమారిగా తెలుస్తోంది. ప్రయాణికుడి చొక్కా పట్టుకుని చెంపపై కొట్టిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఉయ్యూరు డిపోకు చెందిన ఈ కండక్టర్‌ ప్రయాణికుల పట్ల ఎప్పుడు దురుసుగానే ప్రవర్తిస్తుంటారని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు.

Updated Date - Jun 27 , 2025 | 12:43 AM