అవసరంలేని బస్సులు ఆపేయండి: ఎండీ
ABN , Publish Date - Oct 28 , 2025 | 05:39 AM
మొంథా తుఫాన్ తీవ్రత నేపథ్యంలో ప్రయాణీకుల భద్రతను దృష్టిలో పెట్టుకుని బస్సులు నడిపే విషయంలో సముచిత నిర్ణయాలు తీసుకోవాలని ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు....
అమరావతి, గుంటూరు, అక్టోబరు 27(ఆంధ్రజ్యోతి): మొంథా తుఫాన్ తీవ్రత నేపథ్యంలో ప్రయాణీకుల భద్రతను దృష్టిలో పెట్టుకుని బస్సులు నడిపే విషయంలో సముచిత నిర్ణయాలు తీసుకోవాలని ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు.. ఆర్‌ఎంలు, బస్ డిపో మేనేజర్లకు ఆదేశాలిచ్చారు. ఆర్టీసీ అధికారులతో సోమవారం సెల్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రయాణికుల భద్రతతో పాటు ఆర్టీసీకి ఎలాంటి నష్టం వాటిల్లకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధికారులకు కీలక సూచనలు చేశారు. మొంథా ప్రభావిత ప్రాంతాలకు బస్సులు రద్దు చేసి ప్రయాణికులకు ముందస్తు సమాచారం ఇవ్వాలని, బలమైన గాలులతో కూడిన భారీ వర్షాలు కురిసే ప్రాంతాలకు సర్వీసులు ఆపేయాలని చెప్పారు. అన్ని డిపోల ఆర్టీసీ అధికారులు స్థానిక పోలీసు, రైల్వే వారితో సమన్వయం చేసుకోవాలన్నారు.