Share News

APSRTC: విశాఖలో హైవేపై ఆర్టీసీ బస్సు దగ్ధం

ABN , Publish Date - Aug 30 , 2025 | 05:04 AM

విశాఖ నగరంలోని జాతీయ రహదారిపై శుక్రవారం ఓ ఆర్టీసీ బస్సు దగ్ధమైంది. కూర్మన్నపాలెం నుంచి విజయనగరం వెళుతున్న మెట్రో ఎక్స్‌ప్రెస్‌ బస్సు శాంతిపురం జంక్షన్‌లో రెడ్‌సిగ్నల్‌ పడడంతో ఆగింది.

APSRTC: విశాఖలో హైవేపై ఆర్టీసీ బస్సు దగ్ధం

షార్ట్‌సర్క్యూట్‌ కారణమన్న రవాణా మంత్రి

విశాఖపట్నం/సీతంపేట, ఆగస్టు 29(ఆంధ్రజ్యోతి): విశాఖ నగరంలోని జాతీయ రహదారిపై శుక్రవారం ఓ ఆర్టీసీ బస్సు దగ్ధమైంది. కూర్మన్నపాలెం నుంచి విజయనగరం వెళుతున్న మెట్రో ఎక్స్‌ప్రెస్‌ బస్సు శాంతిపురం జంక్షన్‌లో రెడ్‌సిగ్నల్‌ పడడంతో ఆగింది. ఆ సమయంలో ఇంజన్‌ నుంచి మంటలు వస్తున్నట్టు గమనించిన ఆటోడ్రైవర్‌ ఒకరు.. బస్సు డ్రైవర్‌ రమేశ్‌ను అప్రమత్తం చే శారు. ఆయన వెంటనే బస్సు ఆపి ప్రయాణికులందరినీ కిందకు దింపేశారు. క్షణాల్లో బస్సు పూర్తిగా దగ్ధమైపోయింది. ఆర్టీసీ బస్సు పైనే హైటెన్షన్‌ విద్యుత్‌ వైర్లు ఉండడం, సమీపంలోనే పెట్రోల్‌బంకు ఉండడంతో ఆమార్గంలో ప్రయాణించేవారంతా తీవ్ర ఆందోళన చెందారు. సమాచారం తెలియగానే నగరంలోనే ఉన్న రవాణాశాఖ మంత్రి రాంప్రసాద్‌రెడ్డి ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించా రు. మంత్రి మాట్లాడుతూ.. బస్సు కండిషన్‌ బాగుందని, అయితే, బస్సు ఇంజన్‌ లో షార్ట్‌సర్క్యూట్‌ కారణంగానే మంటలు చెలరేగి దగ్ధమైందని చెప్పారు. మంటలను ముందుగా గుర్తించి డ్రైవర్‌ను అప్రమత్తం చేసిన ఆటోడ్రైవర్‌ను గుర్తించి రివార్డు అందజేస్తామని మంత్రి తెలిపారు. బస్సు డ్రైవర్‌ ఎం.రమేష్‌, కండక్టర్‌ జీపీ సాయిబాబాకు ప్రశంసాపత్రం అందజేసినట్టు మంత్రి తెలిపారు.


ఆర్టీసీ డ్రైవర్‌, కండక్టర్‌కు సీఎం ప్రశంస

అగ్ని ప్రమాదానికి గురైన ఆర్టీసీ బస్సులోనుంచి ప్రయాణికులు సురక్షితంగా బయటపడేలా అప్రమత్తంగా వ్యవహరించిన కూర్మన్నపాలెం-విజయనగరం మెట్రో ఎక్స్‌ప్రెస్‌ బస్సు డ్రైవర్‌ ఎం.రమేష్‌, కండక్టర్‌ జీపీ సాయిబాబాను సీఎం చంద్రబాబు అభినందించారు. క్లిష్టసమయాల్లో ప్రయాణికుల భద్రతకు ప్రాధా న్యం ఇవ్వాలనే స్పృహ కలిగి ఉండడం అభినందనీయమని కొనియాడారు.

Updated Date - Aug 30 , 2025 | 05:05 AM