Share News

జీడీపీకి రూ.92 కోట్లు ..!

ABN , Publish Date - Dec 03 , 2025 | 11:28 PM

గాజులదిన్నె ప్రాజెక్టు సామర్థాన్ని పెంచడానికి చేపట్టిన పనులు రెండేళ్లకు పైగా ఎక్కడికక్కడ ఆగిపోయాయి.

   జీడీపీకి రూ.92 కోట్లు ..!
గాజులదిన్నె ప్రాజెక్టు గేట్లు

అసంపూర్తి పనులకు అధికారుల ప్రతిపాదన

5.50 టీఎంసీలు నిల్వ చేసేందుకు వీలుగా..

వైసీపీ హయాంలో మట్టి ఆనకట్టఎత్తు పెంచే పనులకు శ్రీకారం

బిల్లులు ఇవ్వలేదని చేతులెత్తేసిన కాంట్రాక్టరు

రెండేళ్లుగా ఎక్కడి పనులు అక్కడే

కర్నూలు, డిసెంబరు 2 (ఆంధ్రజ్యోతి): గాజులదిన్నె ప్రాజెక్టు సామర్థాన్ని పెంచడానికి చేపట్టిన పనులు రెండేళ్లకు పైగా ఎక్కడికక్కడ ఆగిపోయాయి. 4.50 టీఎంసీల నుంచి 5.50 టీఎంసీలు నిల్వ సామర్థ్యం పెంచడానికి వీలుగా మట్టి ఆనకట్ట ఒక మీటరు ఎత్తు పెంచడానికి గత వైసీపీ హయాంలో పనులు మొదలు పెట్టారు. కాంట్రాక్టరుకు రూ.27 కోట్లకు పైగా బిల్లులు బకాయి పెట్టారు. ఆ తర్వాత వచ్చిన కూటమి ప్రభుత్వం కూడా పట్టించుకోలేదు. అయితే.. వరదల వల్ల ఆనకట్టకు ప్రమాదం పొంచి ఉండడంతో కాంట్రాక్టరుపై ఒత్తిడి తెచ్చి రెండు గేట్లు ఏర్పాటు చేయించారు. అయితే ముంపునకు గురయ్యే భూములకు నష్టపరిహారం ఎంత ఇచ్చేదీ ఈ రోజుకూ తేల్చి చెప్పలేదు. రాబోయే జూలై ఆఖరులోగా పనులు పూర్తి చేయాలంటే రూ.92 కోట్లు ఇవ్వాలని ఇంజనీర్లు ప్రతిపాదనలు పంపారు. ఆ వివరాలపై ఆంధ్రజ్యోతి ప్రత్యేక కథనం.

జిల్లాల పునర్విభజన తరువాత కర్నూలు జిల్లాలో మిగిలిన ఏకైక సాగునీటి ప్రాజెక్టు గాజులదిన్నె జలాశయం. దీని సామర్థ్యం కేవలం 4.50 టీఎంసీలు. కుడి, ఎడమ కాలువల ద్వారా గోనెగండ్ల, కోడుమూరు, కృష్ణగిరి, దేవనకొండ మండలాల పరిధిలోని 21 గ్రామాలకు 25,454 ఎకరాలు రబీ ఆయకట్టుకు సాగునీరు అందించాల్సి ఉంది. డోన, కృష్ణగిరి, బండగట్టు తాగునీటి పథకాలు ద్వారా డోన పట్టణం సహా వివిధ గ్రామాలకు తాగునీరు సరఫరా చేస్తున్నారు. ఎమ్మిగనూరు పట్టణానికి కూడా నీటి సరఫరా కోసం పైపులైన పనులు చేపట్టారు. వేసవిలో కర్నూలు నగరం దాహం తీర్చే జీవనాడి. కరువు నేలకు సాగునీరు అందించి రైతుల కన్నీళ్లు తుడవాల్సిన ఈ ప్రాజెక్టు వివిధ పట్టణాలు, గ్రామాలకు తాగునీరు అందించే ఎస్‌ఎస్‌ ట్యాంక్‌గా మార్చారని రైతులు ఆరోపిస్తున్నారు. సాగు, తాగునీటి అవసరాలు దృష్ట్యా గత వైసీపీ ప్రభుత్వం సామర్థ్యం 4.50 టీఎంసీలు నుంచి 5.50 టీఎంసీలకు పెంచుతూ రూ.135 కోట్లతో (భూ సేకరణతో కలిపి) ఆనకట్ట ఎత్తు పెంచి, కొత్త గేట్లు ఏర్పాటు చేసే పనులు చేపట్టింది. కాంట్రాక్టరుకు సకాలంలో బిల్లులు ఇవ్వకపోవడంతో ఎక్కడి పనులు అక్కడే ఆపేశారు. కూటమి ప్రభుత్వం వచ్చాక కూడా నిధులు ఇవ్వకపోవడం వల్ల రెండేళ్లుగా సామర్థ్యం పెంపు పనులు అసంపూర్తిగా ఉన్నాయి.

ఫ గత ప్రభుత్వ నిర్లక్ష్యం.. రైతులకు శాపం:

గాజులదిన్నె ప్రాజెక్టు సామర్థ్యం పెంపు పనుల్లో భాగంగా.. ప్రస్తుతం ఉన్న మట్టి ఆనకట్టకు సమాంతరంగా భూ మట్టం (గ్రౌండ్‌ లెవల్‌)లో 8-18 మీటర్లు, టాప్‌ లెవల్‌ 6 మీటర్ల వెడల్పు, 4.313 కిలో మీటర్లు పొడవు మట్టి ఆనకట్ట, రాక్‌టో, సీపేజ్‌ డ్రైనేజీ నిర్మాణం, పెంచిన ఒక మీటరు ఆనకట్టకు లోపలి వైపు రాతి పరుపు (స్టోన రిబిట్మెంట్‌) వంటి పనులు రూ.35 కోట్లతో చేపట్టారు. అలాగే.. రూ.55 కోట్లతో ఆరు కొత్త గేట్లు అమర్చే పనులు చేపట్టారు. మట్టి పనులు, గేట్లు ఏర్పాటుకు రూ.90 కోట్లు, భూ సేకరణతో కలిపి రూ.135 కోట్లు గతంలో మంజూరు చేశారు. సకాలంలో బిల్లులు చెల్లించకపోవడం వల్ల కాంట్రాక్టర్‌ పనులను మధ్యలోనే ఆపేశారు. ఆరు కొత్త గేట్లు ఏర్పాటు కోసం 2023 సెప్ట్టెంబరులో గేట్ల తయారీ (ఫ్యాబ్రికేషన) పూర్తి చేశారు. డ్యాంలో నీరు దిగువకు వెళ్లకుండా స్టాప్‌లాగ్‌ ఎలిమెంట్స్‌ ఏర్పాటు పాత గేట్ల స్థానంలో కొత్త గేట్టను అమర్చాల్సి (ఎరక్షన) ఉంది. పాత గేట్ల ఇనుప తాళ్లు (రోప్స్‌) తొలగించి కిందకు దింపేశారే తప్ప కొత్త గేట్లు అమర్చలేదు. వరద వస్తే ఆనకట్టకు ముప్పు ఉంటుందని ఆంధ్రజ్యోతి వెలుగులోకి తెచ్చింది. స్పందించిన ఉమ్మడి కర్నూలు జిల్లా ప్రాజెక్ట్స్‌ సీఐ కబీర్‌బాషా ఇంజనీరుపై ఒత్తిడి తెచ్చి ఎట్టకేలకు ఐదు గేట్లు కొత్తవి ఏర్పాటు చేశారు. భూ సేకరణ చేయకపోవడం రైతులకు శాపంగా మారింది. భూ సేకరణ చేయకపోవడంతో ఆనకట్ట ఎత్తు పెంచినా అదనంగా టీఎంసీ నీటిని నిల్వ చేసుకోలేని పరిస్థితి ఉంది.

ఫ ప్రభుత్వానికి ప్రతిపాదన:

కూటమి ప్రభుత్వం వచ్చాక తక్షణమే అసంపూర్తి పనులు పూర్తి చేస్తారని రైతులు ఆశించారు. ఏడాదిన్నర గడిచినా ఆ దిశగా చేపట్టిన చర్యలు శూన్యం. రూ.57 కోట్లు విలువపై పనులు కాంట్రాక్టరు చేశారు. అందులో రూ.27 కోట్ల బిల్లులు పెండింగులో ఉన్నాయని ఇంజనీర్లు తెలిపారు. బకాయి బిల్లులు చెల్లింపులు, 627 ఎకరాల భూ సేకరణ, అసంపూర్తి పనులు పూర్తి చేయాలంటే రూ.92 కోట్లు నిధులు ఇవ్వాలంటూ టీబీపీ ఎల్లెల్సీ ఆదోని డివిజన ఇంజనీర్లు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు. వర్షాలు, వరదలు లేకపోవడంతో పనులు చేసేందుకు అనుకూలమైన సమయం ఇది. ప్రభుత్వం నిధులు ఇస్తే తప్ప కాంట్రాక్టరు పనులు మొదలు పెట్టే అవకాశం లేదు. దీంతో స్థానిక ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వరరెడ్డి ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి నిధులు మంజూరు చేయించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

గాజులదిన్నె ప్రాజెక్టు స్వరూపం:

---------------------------------------------------

ఫ ప్రాజెక్టు : గాజులదిన్నె ప్రాజెక్టు (సంజీవయ్య సాగర్‌)

ఫ సామర్థ్యం : 4.50 టీఎంసీలు

ఫ ఆయకట్టు : 25,454

ఫ ఎఫ్‌ఆర్‌ఎల్‌ లెవల్‌ : 377 మీటర్లు

ఫ ఆనకట్ట ఎత్తు పంపు పనులు పూర్తయితే :

ఫ సామర్థ్యం : 5.50 టీఎంసీలు

ఫ ఎఫ్‌ఆర్‌ఎల్‌ లెవల్‌ : 378 మీటర్లు

ఫ ఆయకట్ట పొడవు : 4.313 కిలో మీటర్లు

ఫ మంజూరైన నిధులు : రూ.135 కోట్లు (భూ సేకరణతో కలిపి)

ఫ ఇప్పటి వరకు చేసిన ఖర్చు : రూ.57 కోట్లు

ఫ బిల్లు బకాయి : రూ.27 కోట్లు

ఫ తాగునీటి ఆధారం : డోన, ఎమ్మిగనూరు, కోడుమూరు, కృష్ణగిరి పట్టణాలు సహా పలు గ్రామాలు

---------------------------------------------------

ఫ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించాం - పాండురంగయ్య, ఈఈ, టీబీపీ ఎల్లెల్సీ డివిజన, ఆదోని:

గాజులదిన్నె ప్రాజెక్టు 4.50 నుంచి 5.50 టీఎంసీల సామర్థ్యానికి పెంచేందుకు వీలుగా మట్టి ఆనకట్ట ఒక మీటరు ఎత్తు పెంచడం, పాత గేట్ల స్థానంలో కొత్త గేట్లు ఏర్పాటు కోసం రూ.135 కోట్లతో పనులు మొదలు పెట్టారు. కాంట్రాక్టరు ఇప్పటి వరకు రూ.57 కోట్లు పనులు చేస్తే రూ.27 కోట్లు బిల్లులు బకాయి ఉన్న మాట నిజమే. భూ సేకరణ, అసంపూర్తి పనుల కోసం రూ.92 కోట్లు నిధులు ఇవ్వాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించాం. నిధులు రాగానే పనులు మొదలు పెడతాం. వేదవతి ప్రాజెక్టు సహా గాజులదిన్నె ప్రాజెక్టు అసంపూర్తి పనులను ప్రాధాన్యతగా తీసుకొని పూర్తి చేయమని సీఎం చంద్రబాబు సంకల్పం.

Updated Date - Dec 03 , 2025 | 11:29 PM