Share News

CM Chandrababu Naidu: 2న ఆటో డ్రైవర్ల సేవలో

ABN , Publish Date - Sep 25 , 2025 | 04:37 AM

రాష్ట్రంలోని ఆటో, క్యాబ్‌ డ్రైవర్లకు ఏటా రూ.15 వేలు చొప్పున ఆర్థిక సాయం అందించడానికి రంగం సిద్ధమైంది. ఈ పథకం పేరు ఆటో డ్రైవర్ల సేవలో.. అని ప్రభుత్వం దాదాపు ఖరారు చేసినట్లు తెలిసింది

CM Chandrababu Naidu: 2న ఆటో డ్రైవర్ల సేవలో

  • మొత్తం లబ్ధిదారులు 3.10 లక్షల మంది

  • ఒక్కొక్కరి ఖాతాలో 15 వేలు చొప్పున జమ

  • రాష్ట్ర ప్రభుత్వంపై రూ.466 కోట్ల భారం

అమరావతి, సెప్టెంబరు 24(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని ఆటో, క్యాబ్‌ డ్రైవర్లకు ఏటా రూ.15 వేలు చొప్పున ఆర్థిక సాయం అందించడానికి రంగం సిద్ధమైంది. ఈ పథకం పేరు ‘ఆటో డ్రైవర్ల సేవలో..’ అని ప్రభుత్వం దాదాపు ఖరారు చేసినట్లు తెలిసింది. మొత్తం 3,10,385 మందిని అర్హులుగా అధికారులు గుర్తించినట్లు తెలిసింది. గాంధీ జయంతి సందర్భంగా అక్టోబరు 2న వీరి ఖాతాల్లో సీఎం చంద్రబాబు చేతుల మీదుగా నిధులు జమ చేస్తారు. ఈ పథకం అమలుతో రాష్ట్ర ఖజానాపై రూ.466 కోట్ల భారం పడుతుందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించే స్త్రీ శక్తి పథకాన్ని ఆగస్టు 15నుంచి అమలు చేశారు. దీనివల్ల తమ జీవనోపాధికి ఇబ్బంది కలుగుతోందంటూ ఆటో, క్యాబ్‌ డ్రైవర్లు విన్నవించడంతో వారికి ఆర్థిక సాయం అందిస్తామని సీఎం చంద్రబాబు అనంతపురం సభలో ప్రకటించారు. ఈనేపథ్యంలో సెప్టెంబరు 22 లోపు క్షేత్ర పరిశీలన పూర్తిచేసి 24న తుది జాబితా సిద్ధం చేయాలని ప్రభుత్వం పేర్కొంది. ఈ మేరకు అన్ని జిల్లాల్లో సచివాలయాల ద్వారా అర్హులను ఎంపిక చేశారు. బ్రాహ్మణ, కాపు, కమ్మ, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, క్రైస్తవ, ఈబీసీ, క్షత్రియ కార్పొరేషన్ల నుంచి లబ్ధిదారులకు నిధులు జమ చేస్తారు. ఆటో, క్యాబ్‌ యజమానే డ్రైవర్‌గా ఉండాలని, ఇతర గూడ్స్‌ వాహనాలకు ఈ పథకం వర్తించదని ప్రభుత్వం స్పష్టం చేసింది. కుటుంబంలో ఒక్క వాహనానికి మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది. కుటుంబంలో ప్రభుత్వ ఉద్యోగులున్నా, ఆదాయపు పన్ను చెల్లించేవారున్నా, నెలవారీ విద్యుత్‌ వినియోగం 300యూనిట్లు దాటినా, పట్టణ ప్రాంతాల్లో వెయ్యి చదరపు అడుగులకు మించి స్థిరాస్తి ఉన్నా అర్హులు కారు.

Updated Date - Sep 25 , 2025 | 04:38 AM