Central Govt: ఎర్రచందనం సంరక్షణకు రూ.82 లక్షలు
ABN , Publish Date - Sep 30 , 2025 | 04:56 AM
ఆంధ్రప్రదేశ్‌లో మాత్రమే పెరిగే ఎర్రచందనం మొక్క జాతిని కాపాడే దిశగా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంది.
జాతీయ జీవవైవిధ్య ప్రాధికార సంస్థ మంజూరు
న్యూఢిల్లీ, సెప్టెంబరు 29 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్‌లో మాత్రమే పెరిగే ఎర్రచందనం మొక్క జాతిని కాపాడే దిశగా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంది. జాతీయ జీవవైవిధ్య ప్రాధికార సంస్థ (ఎన్‌బీఏ) ఏపీలో ఎర్రచందనం మొక్కల సంరక్షణ నిమిత్తం రాష్ట్ర జీవవైవిధ్య మండలికి రూ.82 లక్షలు మంజూరు చేసింది. ఈ నిధులతో ఒక లక్ష ఎర్రచందనం మొక్కలు పెంచి, వాటిని రైతులకు సరఫరా చేయనున్నారు. దీంతో అడవుల వెలుపల చెట్లు (ట్రీస్ అవుట్‌సైడ్ ఫారెస్ట్స్) పెంచే కార్యక్రమానికి తోడ్పాటు అందించడమే కాకుండా ఏపీలో మాత్రమే పెరిగే ఈ ఏకైక మొక్క జాతిని కాపాడేందుకు చర్యలు తీసుకున్నట్లయింది. ఎర్రచందనం సంరక్షణ నిమిత్తం ఎన్‌బీఏ ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ అటవీ విభాగానికి రూ.31.55 కోట్లకుపైగా అందజేసింది. ఎర్రచందనం మొక్కలు ముఖ్యంగా ఆగ్నేయ కనుమల ప్రాంతాల్లో పెరుగుతున్నాయి. ప్రత్యేకించి అనంతపురం, చిత్తూరు, కడపతో పాటు కర్నూలు జిల్లాల్లో ఏపుగా పెరిగే ఈ చెట్లు వాణిజ్య పరంగా చాలా ఖరీదైనవి. ఈ కారణంగానే వీటికి భారీ ముప్పు పొంచి ఉంది. దీన్ని పెద్ద ఎత్తున స్మగ్లింగ్ చేస్తున్నారు.