NTR Health University: వైద్య కళాశాలలకు 50 లక్షల రిసెర్చ్ ఫండ్
ABN , Publish Date - Dec 15 , 2025 | 05:33 AM
వ్యాధుల కారకాలు, వాటి నిర్మూలనపై పరిశోధనలు చేసేందుకు రాష్ట్రంలోని ప్రభుత్వ వైద్యవిద్య కళాశాలలకు రూ.50లక్షల చొప్పున..
క్రీడల ప్రోత్సాహానికి రూ.25 లక్షలు ఇచ్చే యోచన
ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ వీసీ ప్రొఫెసర్ చంద్రశేఖర్ వెల్లడి
అనంతపురం వైద్యం, డిసెంబరు 14(ఆంధ్రజ్యోతి): వ్యాధుల కారకాలు, వాటి నిర్మూలనపై పరిశోధనలు చేసేందుకు రాష్ట్రంలోని ప్రభుత్వ వైద్యవిద్య కళాశాలలకు రూ.50లక్షల చొప్పున రిసెర్చ్ ఫండ్ ఇవ్వనున్నట్లు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్ పి.చంద్రశేఖర్ పేర్కొన్నారు. ఆదివారం అనంతపురం నగరంలోని కస్తూరి ఫిజియోథెరపీ ప్రైవేట్ కళాశాలలో నిర్వహించిన గ్రాడ్యుయేషన్ వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన ‘ఆంధ్రజ్యోతి’తో మాట్లాడారు. గ్రాడ్యుయేట్ విద్యార్థులకు చెల్లించే రిసెర్చ్ ఫెలోషిప్ మొత్తాన్ని రెట్టింపుచేసి, వారిని ప్రోత్సహిస్తున్నామన్నారు. వైద్య కళాశాలలకు రూ.50 లక్షల చొప్పున రిసెర్చ్ ఫండ్‌తోపాటు క్రీడలను ప్రోత్సహించేందుకు రూ.25 లక్షల చొప్పున ఇవ్వడానికి కార్యచరణ రూపొందిస్తున్నట్లు తెలిపారు. డెంటల్, ఆయుష్ విద్యపై ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి సత్యకుమార్ యాదవ్ ప్రత్యేక దృష్టి పెట్టారన్నారు. ఇందులో భాగంగానే ఆయుష్ విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.