Share News

దసరా ఏర్పాట్లకు రూ.4 కోట్లు

ABN , Publish Date - Sep 15 , 2025 | 01:19 AM

ఇంద్రకీలాద్రిపై ఈ నెల 22వ తేదీ నుంచి జరగనున్న దసరా ఉత్సవాలకు దుర్గామల్లేశ్వర స్వామి ఆలయ అధికారులు చురుగ్గా ఏర్పాట్లు చేస్తున్నారు. రూ.4 కోట్ల విలువైన పనులను ఇప్పటికే కాంట్రాక్టర్లకు అప్పగించారు. కొండ దిగువున రూ.2.54 కోట్లు, కొండపైన 1.50 కోట్లతో పనులు చేయనున్నారు.

దసరా ఏర్పాట్లకు రూ.4 కోట్లు

- ఇంద్రకీల్రాదిపై ఉత్సవాలకు నిధుల కేటాయింపు

- కొండ దిగువన పనులకు రూ.2.54 కోట్లు

- కొండపైన పనులకు రూ.1.50 కోట్లు

- 22 నుంచి ప్రారంభం కానున్న దేవీనవరాత్రులకు చురుగ్గా ఏర్పాట్లు

ఇంద్రకీలాద్రిపై ఈ నెల 22వ తేదీ నుంచి జరగనున్న దసరా ఉత్సవాలకు దుర్గామల్లేశ్వర స్వామి ఆలయ అధికారులు చురుగ్గా ఏర్పాట్లు చేస్తున్నారు. రూ.4 కోట్ల విలువైన పనులను ఇప్పటికే కాంట్రాక్టర్లకు అప్పగించారు. కొండ దిగువున రూ.2.54 కోట్లు, కొండపైన 1.50 కోట్లతో పనులు చేయనున్నారు.

ఇంద్రకీలాద్రి, సెప్టెంబరు 14 (ఆంధ్రజ్యోతి):

ఇంద్రకీలాద్రిపై ఉన్న దుర్గామల్లేశ్వర దేవస్థానంలో ఈ నెల 22వ తేదీ నుంచి ప్రారంభం కానున్న దసరా మహోత్సవాల ఏర్పాట్లు ఊపందుకున్నాయి. కొండ దిగువున, కొండపైన సుమారు రూ.4 కోట్ల విలువ గల పనులను కాంట్రాక్టర్లకు అధికారులు అప్పగించారు. సాధారణంగా ఆయా పనులకు సంబంధించి ఎస్ట్‌మేటెడ్‌ కాంట్రాక్టు వ్యాల్యూ కన్నా టెండర్‌ ప్రీమియం తగ్గించినప్పటికీ ఇంకా ఎక్కువగానే ధరలు ఉన్నట్లుగా చెప్పుకుంటున్నారు. వాస్తవంగా ఏటా దుర్గగుడిలో దసరా ఉత్సవాలకు సంబంధించి ఎస్ట్‌మేటెడ్‌ వ్యాల్యూ పెరుగుతూనే ఉంది. మెటీరియల్‌ను శాశ్వతంగా ఏర్పాటు చేసుకోకపోవటంతో ఎప్పటికప్పుడు క్యూలు ఏర్పాటు, ఇతరత్రా పనుల కోసం భారీగా నిధులు వ్యయమవుతున్నాయన్న ఆరోపణలు ఉన్నాయి. కొండ దిగువున తాత్కాలిక క్యూల ఏర్పాటుకు ఎస్టిమేటెడ్‌ కాంట్రాక్టు వ్యాల్యూ రూ.32,66,191 నిర్ధారించారు. తొలుత అంచనా రూ.39 లక్షలుగా ఉండటం విశేషం. అయితే 15 శాతం లెస్‌తో విజయవాడకు చెందిన గొరిపర్తి భాస్కర్‌ సాయి ఈ టెండర్‌ను రూ.27,76,262 దక్కించుకున్నారు. వినాయకుడి గుడి దగ్గర నుంచి ఘాట్‌ రోడ్డు టోల్‌గేట్‌ వరకు తాత్కాలిక వాటర్‌ ప్రూఫ్‌ షామియానాలకు రూ.40 లక్షలకు ఎస్టిమేషన్‌ వేయగా, ఎస్టిమేటెడ్‌ కాంట్రాక్టు వ్యాల్యూ రూ.33,66,886 నిర్ధారించారు. విశాఖపట్నానికి చెందిన బాలాజీ సప్లయర్స్‌ 18.90 శాతం లెస్‌తో రూ.27,30,544 దక్కించుకున్నారు. స్నాన ఘాట్ల వద్ద షామియానాలు, షెడ్లు ఏర్పాటు చేయటానికి రూ.50 లక్షలు అంచనా వేశారు. తాడేపల్లిగూడేనికి చెందిన కె.కిషోర్‌ 18 శాతం లెస్‌తో రూ.34,68,347 దక్కించుకున్నారు. దీని ఎస్టిమేటెడ్‌ వ్యాల్యూ తొలుత రూ.42.29 లక్షలుగా ఉంది. తెప్పోత్సవంలో వినియోగించే హంస వాహనానికి విద్యుద్ధీకరణ, మరమ్మతుల కోసం రూ.11.70లక్షలు అంచనా వేశారు. అయితే ఎస్టిమేటెడ్‌ వ్యాల్యూ రూ.9.60 లక్షలుగా నిర్ధారించారు. దీనిపై 23.99 శాతం లెస్‌తో రూ.7.30 లక్షలకు పైగా టెండర్‌ వ్యాల్యూతో గుడివాడకు చెందిన తుమ్మల నరేంద్ర టెండర్‌ దక్కించుకున్నారు. స్నాన ఘాట్ల వద్ద ఫ్లోరింగ్‌ చదును చేయటానికి విజయవాడకు చెందిన వి.ఎస్‌.బి.డి.వి.ప్రసాద్‌ ఎస్టిమేటెడ్‌ కాస్ట్‌ రూ.16.42 లక్షలకుగాను 25.21 శాతం లెస్‌తో రూ.12.28 లక్షలకు టెండర్‌ దక్కించుకున్నారు. దీనికి తొలుత రూ.20లక్షలు అంచనా వేశారు. బాణాసంచా సరఫరా, బాణాసంచా పేల్చటం కోసం రూ.7.25 లక్షలు అంచనా వేయగా, టెండర్‌ ఎస్టిమేటెడ్‌ వ్యాల్యూ రూ.6.11లక్షలుగా తేలింది. నాలుగు శాతం లెస్‌తో రూ.5.86 లక్షలకు టెండర్‌ను కాకినాడకు చెందిన పెద్దిరెడ్డి సత్యనారాయణ మూర్తి దక్కించుకున్నారు. అర్జునవీధిలో తాత్కాలిక విద్యుద్ధీకరణ కోసం రూ.40 లక్షలు అంచనా వేశారు. టెండర్‌ వ్యాల్యూ 32.72 లక్షలు ఉండగా, దీనిలో 25.20 శాతం లెస్‌తో రూ.24.47 లక్షలకు తెనాలికి చెందిన గాయత్రీ ఏజెన్సీస్‌ టెండర్‌ దక్కించుకుంది. అన్ని ఘాట్‌లు, కేశఖండనశాల ప్రాంతంలో తాత్కాలిక విద్యుద్ధీకరణకు రూ.40 లక్షలు అంచనా వేయగా, రూ.32.84 లక్షలపై 25.20 లెస్‌తో రూ.24.56 లక్షలకు అదే కాంట్రాక్టర్‌ దక్కించుకున్నారు. కొండ దిగువున మైక్‌ ప్రసారాల ఏర్పాటుకు రూ.12లక్షలు అంచనా వేయగా, ఎస్టిమేటెడ్‌ కాంట్రాక్టు వ్యాల్యూ రూ.9,39,680 నిర్ధారించారు. ఈ కాంట్రాక్టును 25.20 శాతం లెస్‌తో రూ.7,02,880లకు కాంట్రాక్టు ఇచ్చారు. పోలీసు అధికారులకు లైవ్‌ వీక్షించేందుకు తాత్కాలిక సీసీ టీవీలను అద్దె ప్రాతిపదికన తీసుకునేందుకు రూ.9.50 లక్షలకు అంచనా వేయగా, ఎస్టిమేటడ్‌ కాస్ట్‌ రూ.7.80లక్షలకు రాగా, దీనిపై 1.40 శాతం ఎక్కువ ధరతో రూ.7.91 లక్షలకు మచిలీపట్నానికి చెందిన మేజిక్‌ ఐ సొల్యూషన్స్‌ టెండర్‌ దక్కించుకుంది. సీతమ్మవారి పాదాలు, కేశఖండన శాల వద్ద తాత్కాలిక జల్లు స్నానాలు ఏర్పాటు చేసేందుకు రూ.8.20లక్షలు అంచనా వేయగా, రూ.6.70 లక్షలు ఎస్టిమేటెడ్‌ కాస్ట్‌ వచ్చింది. దీని పై 19.89 లెస్‌తో గుడివాడకు చెందిన తుమ్మల నరేంద్ర రూ.5.37 లక్షలకు టెండర్‌ దక్కించుకున్నారు. ఈ మొత్తం అన్ని పనులకు సంబంధించి రూ.4,86,60,000 అంచనా వేయగా, ఎస్టిమేటెడ్‌ వ్యాల్యూ రూ.3,24,35,694 రాగా, లెస్‌లు, ఎక్సెస్‌లతో మొత్తం రూ.2,54,81,597 ఖర్చుగా వచ్చింది.

కొండపైన పనులు ఇలా..

కొండపైన క్యూల ఏర్పాటుకు రూ.13లక్షలు, షామియానాకు రూ.14లక్షలు, విద్యుత లైట్లకు రూ.80 లక్షలు, 11రోజుల పాటు 40 వీఐపీ వాహనాలకు రూ.17లక్షలు, ప్రధాన ఆలయం, ఉపాలయాలకు, అవసరమైన చోట్ల మరి కొన్ని ప్రదేశాలలో పెయింటింగ్‌కు రూ.10.50 లక్షలు, సుమారు రెండున్నర కిలో మీటర్లు ఐరన్‌ మెష్‌ ఏర్పాటుకు సుమారు రూ.8.50 లక్షలు, వీఐపీ వాహనాలకు, దేవస్థానం బస్సులు, ఇతర వాహనాలకు మొత్తం 50 మంది డ్రైవర్లు, కండక్టర్లు, సూపర్‌వైజర్‌లకు 11 రోజుల పాటు రూ.3.50 లక్షలు ఖర్చు చేయనున్నారు. కాగా, మహా మండపంలో సీసీటీవీ ఆపరేషన్‌, కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌ల కోసం రూ.32.74 లక్షలకు ఎస్టిమేటెడ్‌ కాంట్రాక్టు వ్యాల్యూను నిర్ణయించారు.

వీఎంసీ నిర్వహించే పనులు ఇవే..

దసరా ఉత్సవాలలో వాటర్‌ బాటిల్స్‌, ప్యాకెట్ల సరఫరా, వాటర్‌ ప్యాకెట్లు అందించేందుకు పనివారి నియామకం, దుర్గాఘాట్‌, పున్నమిఘాట్‌, టీటీడీ స్థలం, కెనాల్‌ రోడ్‌లలో తాత్కాలిక మొబైల్‌ టాయిలెట్ల ఏర్పాటు, కేశఖండనశాల, సీతమ్మవారి పాదాలు, ధోబీ ఘాట్ల వద్ద తాత్కాలిక టాయిలెట్ల ఏర్పాటు బాధ్యతలు విజయవాడ మునిసిపల్‌ కార్పొరేషన్‌కు అప్పగించారు. అయితే వీటికి అయ్యే ఖర్చును మరల దేవస్థానం నుంచి చెల్లించవలసి ఉంటుంది. ఇందుకు అయిన బిల్లులను సమర్పించి అమౌంట్‌ను దేవస్థానం నుంచి తీసుకుంటారు. కాగా, గత ఏడాది ఉత్సవాలలో వాటర్‌ బాటిల్స్‌, వాటర్‌ పాకెట్లు, వీటిని భక్తులకు సప్లయ్‌ చేసే సిబ్బందికి గాను మొత్తం దేవస్థానం సుమారు రూ.2కోట్లు కార్పొరేషన్‌కు చెల్లించింది. అదే విధంగా భక్తులు భద్రపరచుకునే పాదరక్షలు, లగేజీ కౌంటర్లను కూడా కార్పొరేషనే ఏర్పాటు చేస్తుంది. వాటికి అయ్యే ఖర్చును దేవస్థానం చెల్లించింది.

Updated Date - Sep 15 , 2025 | 01:19 AM