Share News

రూ.22 లక్షలు బొక్కేశారు

ABN , Publish Date - Aug 24 , 2025 | 12:59 AM

ఉపాధి హామీ సిబ్బంది అక్రమాల లెక్కను అధికారులు శనివారం తేల్చారు. 16 గ్రామాల్లో ఉపాధి హామి పనుల్లో జరిగిన అక్రమాలపై సిబ్బంది నుంచి రూ.22 లక్షలు రికవరికీ డ్వామా పీడీ ఎన్‌.వి.శివప్రసాద్‌ యాదవ్‌ ఆదేశించారు. అక్రమాలకు పాల్పడిన సిబ్బందికి రూ.2.50 లక్షల జరిమానా విధించారు. రూ.22 లక్షల రికవరీ మండలంలో ఉపాధి హామీ పనుల చరిత్రలో సంచలనమని చెప్పవచ్చు. పేదల కడుపు నింపమంటే తమ జేబులు నింపుకుంటున్నారని ఉపాధి సిబ్బంది, అధికారులపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

రూ.22 లక్షలు బొక్కేశారు

-తేలిన ‘ఉపాధి’ అక్రమాల లెక్క

-అందుకు జరిమానా రూ.2.50 లక్షలు

-సామాజిక తనిఖీ ప్రజా వేదికలో అధికారుల వెల్లడి

-పేదల కడుపు నింపమంటే తమ జేబులు నింపుకుంటున్న సిబ్బంది

-అధికారుల తీరుపై వెల్లువెత్తుతున్న విమర్శలు

ఉపాధి హామీ సిబ్బంది అక్రమాల లెక్కను అధికారులు శనివారం తేల్చారు. 16 గ్రామాల్లో ఉపాధి హామి పనుల్లో జరిగిన అక్రమాలపై సిబ్బంది నుంచి రూ.22 లక్షలు రికవరికీ డ్వామా పీడీ ఎన్‌.వి.శివప్రసాద్‌ యాదవ్‌ ఆదేశించారు. అక్రమాలకు పాల్పడిన సిబ్బందికి రూ.2.50 లక్షల జరిమానా విధించారు. రూ.22 లక్షల రికవరీ మండలంలో ఉపాధి హామీ పనుల చరిత్రలో సంచలనమని చెప్పవచ్చు. పేదల కడుపు నింపమంటే తమ జేబులు నింపుకుంటున్నారని ఉపాధి సిబ్బంది, అధికారులపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

తోట్లవల్లూరు, ఆగస్టు 23 (ఆంధ్రజ్యోతి):

తోట్లవల్లూరు మండల పరిషత కార్యాలయం వద్ద శుక్రవారం మండలస్థాయి సామాజిక తనిఖీ ప్రజా వేదిక జరిగిన విషయం తెలిసిందే. శుక్రవారం సాయంత్ర వరకు అక్రమాల లెక్క ఎంతో తేల్చలేకపోయారు. అక్రమాలు భారీగా ఉండటంతో రెండోరోజు శనివారం లెక్క తేల్చారు. ఈ వివరాలను ఏపీఎం సురేష్‌ వెల్లడించారు.

2020 కరోనా సమయం నుంచి ఉపాధి హామీ పనుల్లో సిబ్బంది పెద్దఎత్తున అక్రమాలకు పాల్పడుతున్నట్టు ఆరోపణలు వస్తున్నాయి. అయినా అధికారులు చూసీ చూడనట్టు వదిలేస్తూ వచ్చారు. ఇది సిబ్బంది చేతి వాటానికి మరింత ఊతమిచ్చింది. ఫొటో తీయటం, కొలతల్లో ఇష్టమొచ్చినట్టుగా నమోదు చేయటం, అనుకూలమైన వ్యక్తులు ఒక్కరోజు పనికి వస్తే వారి అకౌంట్లలోకి అధికంగా డబ్బులు పంపించటం, తర్వాత వారు డ్రా చేసి ఉపాధి హామీ సిబ్బందికి కొంత, కూలీలు కొంత తీసుకుంటున్నారు. ఈ తతంగం అన్ని గ్రామాల్లో అధికారులకు తెలిసే జరుగుతోందని విమర్శలున్నాయి. ఉదాహరణకు బొడ్డపాడులో సోషల్‌ ఆడిట్‌ సిబ్బంది ఓ మహిళ ఇంటికి వెళ్లి ఎన్ని రోజులు పని చేశావని అడిగితే తాను ఒక రోజు మాత్రమే పనికి వచ్చానని తెలిపింది. తీరా ఆ మహిళ అకౌంట్‌లోకి రూ.9 వేలకు పైగా వచ్చినట్టు సోషల్‌ ఆడిట్‌ సిబ్బంది గుర్తించి ఇది సిబ్బంది చేసిన అక్రమమని తేల్చారు. అక్రమాలకు ఎక్కువగా పంట కాలువలు, బోదెలను సిబ్బంది ఎంచుకున్నట్టు స్పష్టమవుతోంది. కొలతల్లో నాలుగైదు మీటర్లు తేడా అంటే మానవ పొరపాటుగా అనుకోవచ్చు. కాని ఏకంగా 900 మీటర్లు తవ్వకం జరపకుండా జరిపినట్టు సిబ్బంది లెక్క చూపటం అవినీతి, అక్రమాలకు పరాకాష్టగా నిలుస్తోంది. గరికపర్రులో ఎక్స్‌కవేటర్‌తో మట్టి తవ్వితే అది కూలీలు తవ్వినట్టు చూపటం జరిగింది. కుమ్మమూరు, యాకమూరు గ్రామాల సిబ్బంది ఒకే పంట కాలువకు రెండు పేమెంట్లు చేయటం, ఎం బుక్‌లలో కంటే అధికంగా డబ్బులు చెల్లించటం తదితర అంశాలు అక్రమాలుగా తేలాయి.

రాజకీయ నేతల అండతో..

ఉపాధి హామీలోని సిబ్బంది అక్రమాలు చేయటంలో ఎలాంటి భయం లేకుండా ఉండటానికి కొన్ని సంవత్సరాలుగా ఉపేక్షిస్తూ రావటమేనని తెలుస్తోంది. ఎవరైనా సిబ్బంది తప్పు నిరూపణమైతే రాజకీయ నేతలు ఎంటరై అధికారుల చేతులు కట్టేస్తున్నారు. దీంతో తమకు రాజకీయ అండ ఉందని సిబ్బంది ఈ అక్రమాలకు తెగిస్తున్నారు.

అక్రమార్కుడికి మళ్లీ ఉద్యోగం

మే 5వ తేదీన మండల పరిషత కార్యాలయంలో భద్రిరాజుపాలెం ఎఫ్‌ఏ కిరణ్‌కుమార్‌ కుర్చీ, టేబుల్‌ వేసుకుని ఉపాధి హామీ పత్రాల్లో కూలీల సంతకాలు చేస్తూ మీడియాకు చిక్కాడు. గంటసేపు కూలీల పేర్లు రాసి, కూలీల వేలిముద్రలు తనే వేశాడు. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు కూడా ఉన్నాయి. ఇలా వేయవచ్చని, తప్పేమి లేదని ఆ ఎఫ్‌ఏ చెప్పటం జరిగింది. దీనిపై గతంలో ‘ఆంధ్రజ్యోతి‘ కథనం ప్రచురించగా, మే 7వ తేదీన అంబుడ్స్‌పర్సన్‌ శ్రీనివాసరావు భద్రిరాజుపాలెం వచ్చి విచారణ జరిపారు. ఆ విచారణకు ఎఫ్‌ఏ బంధువులు, అనుకూలమైన కూలీలను మాత్రమే తీసుకొచ్చి విచారణ జరిపారు. తర్వాత సస్పెండ్‌ చేసి మళ్లీ అతనికి ఎఫ్‌ఏ పోస్టు ఇచ్చారు. ఈ ఎఫ్‌ఏ కిరణ్‌కుమార్‌ గతంలో ఒకసారి సస్పెండ్‌ అయి రూ.40 వేలు రికవరీ కట్టిన చరిత్ర ఉంది. రూ.10 వేలకు మించి రికవరీ కట్టిన ఎఫ్‌ఏని రెండవ సారి ఉద్యోగంలోకి తీసుకోకూడదన్న నిబంధనను ఉన్నతాధికారి పక్కనపెట్టి ఎఫ్‌ఏ పోస్టు ఇవ్వటం మిగతా సిబ్బందికి ఎలాంటి సంకేతం ఇస్తున్నారో ఆలోచించుకోవాలి.

Updated Date - Aug 24 , 2025 | 12:59 AM