Share News

AP Govt: శ్రీశైలం మరమ్మతులకు రూ.203.95 కోట్లు!

ABN , Publish Date - Dec 21 , 2025 | 04:13 AM

శ్రీశైలం డ్యాం మరమ్మతుల కోసం రూ.203.95 కోట్లు మంజూరుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది.

AP Govt: శ్రీశైలం మరమ్మతులకు రూ.203.95 కోట్లు!

  • నిధుల మంజూరుకు ప్రభుత్వం ఆమోదం

  • ప్రొటెక్టివ్‌ స్టీల్‌ సిలిండర్ల ఏర్పాటుకు 180 కోట్లు అవసరమని అంచనా

  • ప్రతిపాదనల తయారీలో ఇంజనీర్లు

  • సీడబ్ల్యూసీ, సీడీవో సీఈ ఆమోదం పొందిన తర్వాత టెండర్లు పిలిచే యోచన

(కర్నూలు-ఆంధ్రజ్యోతి)

శ్రీశైలం డ్యాం మరమ్మతుల కోసం రూ.203.95 కోట్లు మంజూరుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ప్లంజ్‌ పూల్‌ గుంత డ్యాం వైపు విస్తరించకుండా నూతన ప్రొటెక్టివ్‌ స్టీల్‌ సిలిండర్ల ఏర్పాటు కోసం ఇంజనీర్లు ప్రతిపాదనలు తయారు చేస్తున్నారు. 2009 వరదల సమయంలో జలాశయం ముందు భాగంలో ఏర్పడిన భారీ గుంత డ్యాం పునాదుల కంటే ఎక్కువ లోతు ఉందని, అది ఆనకట్ట వైపు విస్తరిస్తోందని నిపుణులు అనుమానాలు వ్యక్తం చేశారు. ఈ ఏడాది ఏప్రిల్‌లో ప్రాజెక్టును పరిశీలించిన నేషనల్‌ డ్యాం సేఫ్టీ అథారిటీ(ఎన్‌డీఎ్‌సఏ) చైర్మన్‌ అనిల్‌ జైన్‌ ప్రొటెక్టివ్‌ స్టీల్‌ సిలిండర్లు దెబ్బతిన్నట్లు గుర్తించారు. డ్యాం భద్రతకు చర్యలు చేపట్టకపోవడంపై రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. ఆ తర్వాత పుణేకు చెందిన సెంట్రల్‌ వాటర్‌ అండ్‌ పవర్‌ రీసెర్చ్‌ స్టేషన్‌ ప్రొటెక్టివ్‌ స్టీల్‌ సిలిండర్లు, తాజా పరిస్థితిపై విశాఖకు చెందిన సీలైన్‌ ఆఫ్‌షోర్‌ డైవింగ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థతో అధ్యయనం చేయించారు. 62 స్టీల్‌ సిలిండర్లు పూర్తిగా శిథిలమయ్యాయని, తక్షణమే కొత్త వాటిని ఏర్పాటు చేయకపోతే ప్లంజ్‌పూల్‌ గుంత డ్యాం వైపు విస్తరించే ప్రమాదం ఉందని ఆ సంస్థ సూచించింది. ఈ విషయాలను ‘శ్రీశైలం ప్రాజెక్టుకు డేంజర్‌ బెల్స్‌!’ శీర్షికన ఆంధ్రజ్యోతి వెలుగులోకి తేవడంతో కూటమి ప్రభుత్వం స్పందించింది.


కొత్త సిలిండర్లకు ప్రతిపాదనలు

శ్రీశైలం డ్యాం రక్షణలో భాగంగా ఆనకట్ట నుంచి 13-15 మీటర్ల పొడవు, 3-4 మీటర్ల మందంతో సీసీ కాంక్రీట్‌తో ఆప్రాన్‌ నిర్మించారు. వరదలకు ఆప్రాన్‌ కూడా కాంక్రీట్‌ పెచ్చులు ఊడిపోతుండటంతో శాశ్వత రక్షణ కోసం ఒక్కోటీ 2 మీటర్ల వ్యాసం, 18-20 మీటర్ల లోతులో 62 సిలిండర్లు ఏర్పాటు చేశారు. గొయ్యి ఆనకట్ట వైపు విస్తరించకుండా ఇవి రక్షణగా నిలిచాయి. వీటిని ఏర్పాటు చేసి 40ఏళ్లు అవుతోంది. 2009లో భారీ వరదక సిలిండర్లు దెబ్బతిన్నాయి. అప్పటినుంచి మరమ్మతులు చేపట్టకపోవడంతో శిథిలావస్థకు చేరుకున్నాయి. సీలైన్‌ సంస్థ సూచనలతో రాష్ట్ర ప్రభుత్వం డ్యాం భద్రతకు ఉపక్రమించింది. ఉమ్మడి కర్నూలు ప్రాజెక్ట్స్‌ సీసీ కబీర్‌ బాషా ఆదేశాల మేరకు ప్రాజెక్టు ఈఈ వేణుగోపాల్‌రెడ్డి ఆధ్యర్వంలో సమగ్ర ఆధ్యయనం చేశారు. 62 కొత్త స్టీల్‌ సిలిండర్ల ఏర్పాటుకు రూ.160-180 కోట్లు అవసరమని ప్రాథమికంగా అంచనా వేశారు. ఈ మేరకు కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ), సెంట్రల్‌ డిజైనింగ్‌ ఆర్గనైజేషన్‌ చీఫ్‌ ఇంజనీరు (సీఈ సీడీవో)కు ప్రతిపాదనలు పంపుతారు. ఆమోదం వచ్చిన తరువాత రాష్ట్ర ప్రభుత్వం నుంచి అనుమతులు తీసుకుని టెం డర్లు పిలుస్తామని ఇంజనీర్లు పేర్కొంటున్నారు.

అప్రోచ్‌ రోడ్డు టెండర్‌కు సీవోటీ ఆమోదం

2009 వరదలకు శ్రీశైలం డ్యాం మరమ్మతులు, నిర్వహణలో కీలకమైన అప్రోచ్‌ రోడ్డు కొట్టుకుపోయింది. డ్యాం రెండువైపులా కొండ రాళ్లు ఊడిపోతున్నాయి. 2014-15 మధ్యలో టీడీపీ ప్రభుత్వం మరమ్మతులు చేపట్టింది. వైసీపీ ప్రభుత్వం ప్రాజెక్టుల నిర్వహణను గాలికొదిలేసింది. డ్యాం ఇరువైపుల కొండ రాళ్లు ఊడిపోకుండా రూ.5.90 కోట్లతో షాట్‌క్రీటింగ్‌ పనులు చేపట్టారు. అప్రొచ్‌ రోడ్డు నిర్మాణం కోసం రూ.25.50 కోట్లతో టెండర్లు పిలిచారు. విజయవాడకు చెందిన బీ అండ్‌ బీ సంస్థ టెండర్‌ దక్కించుకుంది. కమిషనర్‌ ఆఫ్‌ టెండర్స్‌ (సీవోటీ) ఆమోదం తీసుకున్నారు. జూన్‌ ఆఖరులోగా అప్రోచ్‌ రోడ్డు నిర్మాణం పూర్తి చేసేందుకు ఇంజనీర్లు ప్రణాళిక సిద్ధం చేశారు.

Updated Date - Dec 21 , 2025 | 04:14 AM