14,733 కోట్లతో సాగరమాల: బీసీ జనార్దన్‌రెడ్డి
ABN , Publish Date - Aug 06 , 2025 | 05:23 AM
రాష్ట్రంలో సాగరమాల పథకం అమలు కోసం రూ.14,733 కోట్లతో ప్రతిపాదలు సిద్ధం చేశామని మంత్రి బీసీ జనార్దనరెడ్డి వెల్లడించారు. సచివాలయంలో మంగళవారం ఆయన 16 శాఖలతో సమీక్ష నిర్వహించారు.
అమరావతి, ఆగస్టు 5(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో సాగరమాల పథకం అమలు కోసం రూ.14,733 కోట్లతో ప్రతిపాదలు సిద్ధం చేశామని మంత్రి బీసీ జనార్దనరెడ్డి వెల్లడించారు. సచివాలయంలో మంగళవారం ఆయన 16 శాఖలతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ సహకారంలో సాగరమాల పథకం కింద రాష్ట్రానికి పలు అభివృద్ధి పనులకు ఆమోదం లభించిందని.. వీటిని సద్వినియోగం చేసుకోవాలని అధికారులకు చెప్పారు. ప్రాజెక్టులను సత్వరమే పూర్తి చేసేందుకు నివేదికలు సిద్ధం చేయాలన్నారు. ఏపీ మారిటైమ్ బోర్డు ద్వారా రూ.1,584 కోట్లతో చేపట్టిన ఆరు పనులను, విశాఖ పోర్టు ద్వారా రూ.1,254 కోట్లతో చేపట్టిన పనులను, ఏపీ టూరిజం ద్వారా రూ.245 కోట్ల చేపట్టిన నాలుగు పనులను మంత్రి సమీక్షించారు. రాష్ట్రంలో పీపీపీ విధానంలో చేపట్టనున్న పోర్టుల నిర్మాణ వేగాన్ని పెంచాలని చెప్పారు.
రామాయపట్నం ఫేజ్-1 గడువు పెంపు
రామాయపట్నం గ్రీన్‌ఫీల్డ్ పోర్టు నిర్మాణ గడువు పెంచుతూ మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయం తీసుకుంది. సచివాలయంలో జరిగిన ఈ సమావేశంలో మంత్రులు పయ్యావుల కేశవ్, బీసీ జనార్దనరెడ్డి, కందుల దుర్గేశ్ పాల్గొన్నారు. పోర్టు డ్రాఫ్ట్ 16 నుంచి 18.5 మీటర్లకు పెంచే ప్రతిపాదనలకు సమావేశం ఆమోదం తెలిపింది.