రూ.13,500 కోట్లు
ABN , Publish Date - Jun 07 , 2025 | 01:17 AM
కృష్ణాజిల్లా కేంద్ర సహకార బ్యాంకు (కేడీసీసీబీ) ప్రస్తుతం రూ.11,500 కోట్ల లావాదేవీలతో కొనసాగుతోందని, ఈ ఆర్థిక సంవత్సరం ముగిసేలోగా రూ.13,500 కోట్లకు చేర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నామని కేడీసీసీబీ చైర్మన్ నెట్టెం రఘురామ్ అన్నారు.
- కేడీసీసీబీ ఈ ఆర్థిక సంవత్సరం లావాదేవీల లక్ష్యం
- ప్రస్తుత లావాదేవీలు రూ.11,500 కోట్లు
- డ్వాక్రా సంఘాలను 7,500 నుంచి 10 వేలకు పెంచుతాం
- బంగారు రుణాలు లక్ష్యం రూ.1500 కోట్లు
- కేడీసీసీబీ చైర్మన్ నెట్టెం రఘురామ్
మచిలీపట్నం, జూన్ 6 (ఆంధ్రజ్యోతి):
కృష్ణాజిల్లా కేంద్ర సహకార బ్యాంకు (కేడీసీసీబీ) ప్రస్తుతం రూ.11,500 కోట్ల లావాదేవీలతో కొనసాగుతోందని, ఈ ఆర్థిక సంవత్సరం ముగిసేలోగా రూ.13,500 కోట్లకు చేర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నామని కేడీసీసీబీ చైర్మన్ నెట్టెం రఘురామ్ అన్నారు. శుక్రవారం తొలిసారిగా మచిలీపట్నంలోని కేడీసీసీబీ ప్రధాన కార్యాలయానికి ఆయన వచ్చారు. వివిధ విభాగాలను సీఈవో శ్యామ్‌మనోహర్‌తో కలిసి పరిశీలించారు. ఆయా విభాగాల అధికారులతో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. కేడీసీసీబీ పరిధిలో 7,500 డ్వాక్రా సంఘాలు ఉన్నాయని, వాటి సంఖ్యను రూ.10వేలకు పెంచుతామన్నారు. ఆర్థిక లావాదేవీలు సక్రమంగా నిర్వహించే ఒక్కో డ్వాక్రా సంఘానికి సీఎం చంద్రబాబు సూచనలతో రూ.20లక్షల వరకు రుణం అందిస్తామని తెలిపారు.
పంట రుణాల లక్ష్యం రూ.2వేల కోట్లు
ఈ ఏడాది రూ.1500 కోట్లు రైతులకు పంట రుణాలు అందించాలని లక్ష్యంగా నిర్ణయించామని, ఈ మొత్తాన్ని రూ.2వేల కోట్లకు పెంచుతున్నట్టు చెప్పారు. అలాగే ఈ ఏడాది గృహ రుణాలు, విద్యా రుణాలు రూ.75 కోట్లు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకోగా, ఈ మొత్తాన్ని రూ.100 కోట్లకు పెంచాలని ప్రణాళికలో మార్పులు చేశామన్నారు. కేడీసీసీబీ ప్రస్తుతం రూ.75 కోట్ల లాభాల్లో ఉందని, ఈ లాభాలు రూ.100 కోట్లకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. బంగారం తాకట్టు పెట్టుకుని ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.900 కోట్లు రుణాలుగా ఇవ్వాలనే ప్రతిపాదన ఉండగా, ఈ మొత్తాన్ని రూ.1500 కోట్లకు పెంచుతున్నామన్నారు. బ్యాంకులో డిపాజిట్లు రూ.3,200 కోట్లు ఉన్నాయని, వాటిని రూ.3,500 కోట్లకు పెంచేలా ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. జిల్లాలోని అన్ని పీఏసీఎస్‌లు కంప్యూటరీకరణ చేసిన నేపథ్యంలో రైతులకు పీఏసీఎస్‌ల ద్వారా ఫోన్‌పే సౌకర్యం త్వరలో కల్పించనున్నట్లు చెప్పారు. ఉద్యోగులకు ఇప్పటి వరకు రూ.5లక్షల మేర బీమా సౌకర్యం ఉండగా, ఈ మొత్తాన్ని రూ.10 లక్షలకు పెంచుతామన్నారు. ఈ నెలాఖరు నాటికి కేడీసీసీబీ సర్వసభ్య సమావేశాన్ని నిర్వహిస్తామని తెలిపారు. కేడీసీసీబీ పాలకవర్గ సభ్యుల నియామకంపై ముఖ్యమంత్రి చంద్రబాబుతో చర్చిస్తాన ని చెప్పారు. కేడీసీసీబీని అన్ని విధాల అభివృద్ధి పథంలో నడిపేందుకు తన వంతు కృషి చేస్తానని వివరించారు.