Share News

రోజుకు రూ.10 లక్షలు

ABN , Publish Date - Nov 02 , 2025 | 01:25 AM

రోజుకు ఒక్కో ఖాతాలో రూ.10లక్షలు జమ. ఏదో వ్యాపారం చేయడం వల్ల వచ్చిన డబ్బు కాదు ఇది. అలాగని ఒక కంపెనీకి మరో కంపెనీకి మధ్య జరుగుతున్న లావాదేవీ అంతకన్నా కాదు. ముఖం కనిపించకుండా రకరకాల లింక్‌లు, ఫోన్‌ నంబర్ల ద్వారా సులువుగా ఎక్కువ డబ్బులు సంపాదించాలనుకున్న వారికి ఎర వేయడం ద్వారా సైబర్‌ నేరగాళ్లు సంపాదిస్తున్న మొత్తం ఇది. విచిత్రమేమింటే సీబీఐకి చిక్కి కారాగారం పాలైనా వారి ఖాతాల్లో ఇంకా డబ్బులు జమమవుతున్నాయి.

రోజుకు రూ.10 లక్షలు

‘ఈ’ నేరగాళ్ల రోజువారీ ఆదాయం

సీబీఐకి చిక్కిన ఇద్దరు పంజాబ్‌ యువకులు

జైలులో ఉన్నా ఖాతాల్లో డబ్బులు జమ

తక్కువ పెట్టుబడి ఎక్కువ లాభాల నినాదంతో ఎర

రూ.2కోట్ల వరకు మోసం

విజయవాడలో కూడా బాధితులు ఉన్నట్టు సమాచారం

రోజుకు ఒక్కో ఖాతాలో రూ.10లక్షలు జమ. ఏదో వ్యాపారం చేయడం వల్ల వచ్చిన డబ్బు కాదు ఇది. అలాగని ఒక కంపెనీకి మరో కంపెనీకి మధ్య జరుగుతున్న లావాదేవీ అంతకన్నా కాదు. ముఖం కనిపించకుండా రకరకాల లింక్‌లు, ఫోన్‌ నంబర్ల ద్వారా సులువుగా ఎక్కువ డబ్బులు సంపాదించాలనుకున్న వారికి ఎర వేయడం ద్వారా సైబర్‌ నేరగాళ్లు సంపాదిస్తున్న మొత్తం ఇది. విచిత్రమేమింటే సీబీఐకి చిక్కి కారాగారం పాలైనా వారి ఖాతాల్లో ఇంకా డబ్బులు జమమవుతున్నాయి.

(ఆంధ్రజ్యోతి - విజయవాడ):

విశాఖపట్నం సీబీఐ అధికారులు మూడు రోజుల క్రితం పంజాబ్‌లోని లుథియానాకు చెందిన దేవేందర్‌ సింగ్‌, ప్రతాప్‌ సాహి అనే ఇద్దరు విద్యార్థులను అరెస్టు చేసి జైలుకు పంపారు. విశాఖపట్నంలోని ఓ వ్యక్తికి తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు ఇస్తామని లింక్‌లు పంపి ముగ్గులోకి దింపారు. ముందుగా అతడు రూ.10వేలు పెట్టుబడిగా పెట్టాడు. దానికి రూ.20వేలను లాభంగా ఇచ్చారు. తర్వాత రూ.40వేలు పెట్టుబడి పెట్టాడు. దీనికి కొంత లాభాన్ని ఇచ్చారు. ఈవిధంగా రూ.90వేల వరకు అతడికి లాభాలు వచ్చినట్టుగా చూపించారు. చిన్నచిన్న మొత్తాలను డ్రా చేసుకోవడానికి వెసులుబాటు కల్పించిన సైబర్‌ నేరగాళ్లు పెద్ద మొత్తాన్ని వితడ్రా చేసుకునే అవకాశం ఇవ్వలేదు. ఆ మొత్తాన్ని వితడ్రా చేసుకోవాలంటే మరికొంత సొమ్ములు చెల్లించాలని ఒత్తిడి చేయడం మొదలుపెట్టారు. ఈ విషయంలో నిందితులు సీబీఐ పేరును ప్రస్తావించడంతో ఆయన వారిని ఆశ్రయించాడు. దీనిపై సీబీఐ అధికారులు కేసు నమోదు చేశారు. కేసును సాంకేతికంగా దర్యాప్తు చేసిన సీబీఐ అధికారులు కొద్దిరోజుల క్రితం లూథియానాకు చెందిన దేవేందర్‌సింగ్‌, ప్రతాప్‌ సాహిను అరెస్టు చేశారు. వారిని రెండు రోజుల క్రితం విజయవాడ కోర్టులో హాజరుపరచగా రిమాండ్‌ విధించింది.

రూ.2 కోట్ల వరకు వసూళ్లు

దేవేందర్‌సింగ్‌, ప్రతాప్‌ సాహి ఇద్దరూ లూథియానాలో గ్రాడ్యుయేషన్‌ చేస్తున్నారు. వివిధ ప్రాంతాల నుంచి సైబర్‌ ముగ్గులోకి దిగిన వ్యక్తులు జమ చేసే మొత్తాల కోసం ఈ ఇద్దరు బ్యాంక్‌ ఖాతాలను ఇచ్చారు. వారిలో ఒక్కొక్కరి ఖాతాలో రూ.10లక్షల వరకు రోజుకు జమవుతున్నాయని సీబీఐ అధికారులు గుర్తించారు. ఈ ఇద్దరు యువకులు కొన్నాళ్లుగా రూ.2కోట్ల వరకు డబ్బులను తమ ఖాతాల్లో జమ చేయించుకున్నట్టు గుర్తించారు. వైజాగ్‌కు సంబంధించిన వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదుతో వారిని సీబీఐ అధికారులు అరెస్టు చేసినప్పటికీ ఇంకా అనేక కేసుల్లో నిందితులుగా ఉన్నట్టు తేలింది. సైబర్‌ నేరగాళ్లు ఇచ్చిన టాస్క్‌ను ఈ ఇద్దరు పంజాబీలు చాలా సమర్థవంతంగా పూర్తి చేసి కోట్లాది రూపాయలను వసూలు చేశారు. ప్రస్తుతం దేవేందర్‌సింగ్‌, ప్రతాప్‌ సాహి జైల్లో ఉన్నప్పటికీ వారి ఖాతాల్లో ఇంకా డబ్బులు జమవుతూనే ఉన్నాయని అధికారులు గుర్తించారు. వాస్తవానికి ఈ ఇద్దరి అరెస్టుతో వైజాగ్‌ కేసులో దర్యాప్తును ముగించాలని సీబీఐ అధికారులు భావించారు. ఖాతాల్లో రోజుకు ఎంతోకొంత మొత్తంలో డబ్బులు జమవుతుండడంతో ఆ నిర్ణయాన్ని మార్చుకున్నారు. దర్యాప్తును కొనసాగించాలని నిర్ణయించారు. త్వరలో పిటిషన్‌ దాఖలు చేసి కస్టడీకి తీసుకుని విచారించాలని సీబీఐ అధికారులు భావిస్తున్నారు. విజయవాడలో కూడా బాధితులు ఉన్నట్టు పోలీస్‌ వర్గాల సమాచారం.

Updated Date - Nov 02 , 2025 | 01:25 AM