Royal Treatment: కోడికి రాజ యోగం
ABN , Publish Date - Dec 22 , 2025 | 05:12 AM
సంక్రాంతి పందేలకు కోళ్లను సిద్ధం చేయాలంటే వేలాది రూపాయలు ఖర్చుచేసి ఏడాది పాటు వాటిని పోషించాలి. వాటిని కంటికి రెప్పలా కాపాడుకుంటూ బలమైన పౌష్టికాహారం అందించాలి.
‘కోట్లాట’కు ముందు మహారాజ పోషణ
బాదం, జీడిపప్పు, కైమా వంటి ఖరీదైన ఆహారం
బలం పుంజుకునేందుకు మద్యం కూడా..
ఒళ్లు నొప్పులు తగ్గేందుకు ఆయిల్ కాపడం
స్విమ్మింగ్, వ్యాయామంతో రాటుదేలుతున్న పందెం కోళ్లు
సంక్రాంతి బరిలోకి దిగేందుకు జాతి పుంజులు సిద్ధం
తెల్లవారుజామునే నిద్రలేవడం..
చన్నీళ్లలో స్విమ్మింగ్ చేసేసి కాసేపు వ్యాయామం చేయడం.. అనంతరం టిఫిన్ సెషన్‌లో జీడిపప్పు, బాదం పప్పులు, ఉడికబెట్టిన గుడ్లు లాగించేయడం.. కాసేపటికి కేర్ టేకర్ వచ్చి ఇచ్చే విటమిన్లు, పౌష్టికాహారం (చోళ్లు, గంట్లు) తిన్నాక తోటలో చెట్ల కింద హాయిగా విశ్రాంతి తీసుకోవడం.. మళ్లీ మధ్యాహ్నం లంచ్..! ఆ తర్వాత మూడు గంటల నుంచి వ్యాయామం. సాయంత్రం మళ్లీ కాసేపు స్విమ్మింగ్.. రాత్రికి డిన్నర్‌లో జీడిపప్పు, బాదంపప్పు, గుడ్లు తినేసి.. నిద్రలోకి జారుకోవడం..! ఈ డైలీ మెనూ చదువుతుంటే.. రాజభోగం గుర్తొస్తుంది కదూ..! కానీ.. అదేం కాదు. సంక్రాంతి పందేలకు సిద్ధమయ్యే కోళ్లకు ఇచ్చే ప్రత్యేక శిక్షణ, వాటికి పెట్టే ఆహార పద్ధతులివి!
(జంగారెడ్డిగూడెం రూరల్ - ఆంధ్రజ్యోతి)
సంక్రాంతి పందేలకు కోళ్లను సిద్ధం చేయాలంటే వేలాది రూపాయలు ఖర్చుచేసి ఏడాది పాటు వాటిని పోషించాలి. వాటిని కంటికి రెప్పలా కాపాడుకుంటూ బలమైన పౌష్టికాహారం అందించాలి. అప్పుడే జాతిరత్నాల్లాంటి పందెం కోళ్లు తయారవుతాయి. వీటి కోసం ప్రత్యేక రూమ్‌లు ఏర్పాటుచేయాలి. ఫ్యాన్లు పెట్టాలి. రోగాలు దరిచేరకుండా మందులు, షాంపూలతో స్నానాలు, ఎప్పటికప్పుడు వైద్య పరీక్షలు వంటి జాగ్రత్తలు తీసుకోవాలి. ఒక విధంగా చెప్పాలంటే ఈ పందెం కోళ్లకు ఏడాదిపాటు రాజయోగమే..! అయితే ఇవన్నీ సంక్రాంతి ముందురోజు వరకే. బరిలోకి దిగే రోజు వచ్చేసరికి ఎంతటి రాజభోగం అనుభవించిన కోడైనా సరే కాలుకు కత్తి కట్టాల్సిందే. బరిలోకి దిగి తాడో పేడో తేల్చుకోవాల్సిందే. ప్రత్యర్థి కోడిని పడగొట్టాల్సిందే. తన యజమానిని గెలుపు సిహాసనంపై కూర్చోబెట్టాల్సిందే..! ఒక్క క్షణం ఏమరుపాటుగా ఉన్నా ప్రత్యర్థి కోడి చేతిలో మరణం తప్పదు..!
కఠిన శిక్షణ.. ఖరీదైన ఆహారం..
పందెం కోసం పెంచే కోడి పుంజులను పెట్టలతో కలవకుండా ప్రత్యేకంగా కట్టి మేపుతారు. ఆహారం ఇచ్చేందుకు సమయ పాలన పాటిస్తారు. స్విమ్మింగ్‌తోపాటు వ్యాయామాలు చేయించి వాటి శరీరాన్ని దృఢంగా తయారు చేస్తారు. కోడి సరిగా కూయకపోయినా, పెట్టిన ఆహారం తినకపోయినా, రెట్ట సరిగా వేయకపోయినా, పడుకున్న కోడి లేవకపోయినా అనారోగ్యానికి గురైందని భావించి వైద్యులను సంప్రదిస్తారు. అది కుదుటపడే వరకు వీరు కునుకుతీయరు..! బరిలో పుంజులు విజయం సాధించాలంటే శరీరం బలంగా ఉండాలి. దీనికోసం జీడి పప్పు, బాదంపప్పు, చోళ్లు, గంట్లు, కోడి గుడ్లు, విజిటెబుల్స్ ముక్కలు.. ఇలా అనేక ఆహార పదార్థాలను అందజేస్తుంటారు. సంక్రాంతికి 60 రోజుల ముందు నుంచి బాదం, జీడిపప్పు, కర్పూరం, అంజీర, పిస్తా, నువ్వులు, తాటిబెల్లం వంటి 45 రకాల పౌష్టికాహార పదార్థాలను ఒక లడ్డుగా చుట్టి రోజూ ఉదయం అందిస్తారు. కోడిని బట్టి రోజూ ఉదయం 20 నుంచి 60 గ్రాముల లడ్డూ తయారు చేసి ఆహారంగా అందిస్తారు. ఒక్కో లడ్డూ తయారీకి రూ.50 నుంచి రూ.75 వరకు ఖర్చవుతుంది. ప్రతి రోజూ వేటమాంసం కైమా ఇస్తారు. కోడిపుంజు శరీర దృఢత్వం పెరగడానికి, ఒళ్లు నొప్పులు తగ్గడానికి డిసెంబరు నుంచి జామాయిల్, మద్యం ఇతర ఔషధాలతో తయారు చేసిన ఆయిల్‌తో కాపడం పెడుతుంటారు. ఇలా పందేలకు సిద్ధం చేసిన కోడి పుంజులు మార్కెట్‌లో రూ.లక్ష నుంచి రూ.రెండు లక్షలకు పైగా పలుకుతాయి. తెలంగాణ, ఒడిశా, ఛత్తీ్‌సగఢ్, ఆంధ్రాలోని ఇతర జిల్లాల నుంచి ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం ప్రాంతానికి వచ్చి కోడి పుంజులను కొనుగోలు చేస్తుంటారు.
పందెం కోళ్లలో రకాలు
కోడిపందేల్లో పాల్గొనే పుంజుల జాతుల రంగులపై ప్రత్యేక దృష్టి సారిస్తుంటారు. గోదావరి జిల్లాల్లో అత్యధికంగా సీతువు, నెమలి డేగ, నెమలి, కోడిపచ్చకాకి, అబర్రస్, పండు డేగ, కోడి కాకి, కోడి రసంగి పుంజులపై అత్యధికంగా పందేలు కాస్తుంటారు. ఇవి అత్యంత బలంగా ప్రత్యర్థిపై దాడిగి దిగుతుంటాయి. ఎదుటి కోడి పుంజు దాడి నుంచి తప్పించుకుని గాల్లోనే క్షణాల్లో ప్రత్యర్థులపై దాడికి దిగుతాయి. గాయమైనా చివరి రక్తపు బొట్టు వరకు పోరాడుతుంటాయి. దీని కారణంగానే ఎదుటి వ్యక్తి ఒక పుంజును బరిలో దింపితే దానికి తగ్గట్టుగానే అదేస్థాయి ఉన్న పుంజును ప్రత్యర్థులు కొట్లాటకు దింపుతారు.
బరి మాది.. పుంజు మీది..
గోదావరి గ్రామాల్లో కొత్త ట్రెండ్
(మొగల్తూరు-ఆంధ్రజ్యోతి): ‘సంక్రాంతికి కోడి పందేల కోసం మేం వేస్తున్న బరికి మీ పుంజుతో వచ్చి.. పందెంలో తప్పనిసరిగా పాల్గొనాలండీ’.. ఇదేదో పిలుపులా ఉందేంటి అనుకుంటున్నారా.? అవును నిజమే. ఇది పశ్చిమ గోదావరి జిల్లాలో బరుల నిర్వాహకులు తెచ్చిన కొత్తట్రెండ్. సంక్రాంతికి కోడి పందెం బరులు వేస్తున్నామని చెప్పడానికి, తమ బరిలో పందెం వేయాలని కోరడానికి పందెం రాయుళ్లతోపాటు, గ్రామాల్లోని పెద్దలు, ప్రభావిత వ్యక్తులకు ప్రత్యేకంగా మాంసాహారంతో విందు ఏర్పాటు చేసి మరీ పిలుస్తున్నారు. పండుగ మూడు రోజులు తమ బరులకు జనం బాగా రావడానికి, ఇతర రాష్ట్రాలు, ప్రాంతాల నుంచి పందేల్లో పాల్గొనడానికి వచ్చేవారిని తమ బరికి ఆకర్షించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు.