Share News

AP High Court: విమానంలో వచ్చైనా లొంగిపోవాల్సిందే!

ABN , Publish Date - Mar 12 , 2025 | 04:55 AM

నకిలీ మెడికల్‌ సర్టిఫికెట్‌తో మధ్యంతర బెయిల్‌ పొందిన రౌడీషీటర్‌ బోరుగడ్డ అనిల్‌కుమార్‌.. చెన్నై నుంచి విమానంలో వచ్చయినా జైలులో వెంటనే లొంగిపోవలసిందేనని హైకోర్టు మంగళవారం తేల్చిచెప్పింది.

AP High Court: విమానంలో వచ్చైనా లొంగిపోవాల్సిందే!

  • బోరుగడ్డ అనిల్‌కు హైకోర్టు ఆదేశం.. బెయిల్‌ను పొడిగించేది లేదని స్పష్టీకరణ

  • పిటిషనర్‌ తల్లి చెన్నై అపోలోలో ఇంకా చికిత్స పొందుతున్నారు

  • బెయిల్‌ పొడిగించాలన్న న్యాయవాది.. తీవ్రంగా స్పందించిన పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌

  • ఆమె గత నెల 23నే డిశ్చార్జ్‌ అయ్యారు.. 1న పిటిషన్‌ వేసేనాటికి ఆస్పత్రిలోనే లేరు

  • తల్లి అనారోగ్యాన్ని చూపి నకిలీ మెడికల్‌ సర్టిఫికెట్‌ సృష్టి: పీపీ

అమరావతి, మార్చి 11(ఆంధ్రజ్యోతి): నకిలీ మెడికల్‌ సర్టిఫికెట్‌తో మధ్యంతర బెయిల్‌ పొందిన రౌడీషీటర్‌ బోరుగడ్డ అనిల్‌కుమార్‌.. చెన్నై నుంచి విమానంలో వచ్చయినా జైలులో వెంటనే లొంగిపోవలసిందేనని హైకోర్టు మంగళవారం తేల్చిచెప్పింది. ఇందుకు మంగళవారం సాయంత్రం 5 గంటల వరకే గడువు విధించింది. తల్లి అనారోగ్యాన్ని కారణంగా చూపి మరోసారి మధ్యంతర బెయిల్‌ను పొడిగించుకునేందుకు అతడు చేసిన ప్రయత్నాన్ని వమ్ముచేసింది. ఇక పొడిగించేది లేదని.. సాయంత్రం 5గంటల్లోపు రాజమహేంద్రవరం సెంట్రల్‌ జైలు సూపరింటెండెంట్‌ ముందు లొంగిపోవాలని ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్‌ వెంకట జ్యోతిర్మయి ప్రతాప ఉత్తర్వులు ఇచ్చారు. బోరుగడ్డ తరఫు న్యాయవాది స్పందిస్తూ... పిటిషనర్‌ ప్రస్తుతం చెన్నైలో ఉన్నారని చెప్పగా.. విమానంలో వచ్చయినా జైలులో సరెండర్‌ కావలసిందేనని న్యాయమూర్తి తేల్చిచెప్పారు. అనంతపురం నాలుగో పట్టణ పోలీసులు నమోదు చేసిన కేసులో రాజమహేంద్రవరం సెంట్రల్‌ జైల్లో రిమాండ్‌ ఖైదీగా ఉన్న బోరుగడ్డ.. తన తల్లి బి.పద్మావతి గుండె సంబంధ వ్యాధితో బాధపడుతూ చెన్నై అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని, తన సహాయం ఆమెకు అవసరమంటూ హైకోర్టుకు మెడికల్‌ సర్టిఫికెట్‌ చూపించి ఈ నెల 11 వరకు మధ్యంతర బెయిల్‌ పొడిగింపజేసుకున్న విషయం తెలిసిందే.


మధ్యంతర బెయిల్‌ను మరికొంతకాలం పొడిగించాలని, వ్యాజ్యంపై అత్యవసరంగా విచారణ జరపాలని అతడి తరఫు న్యాయవాది మంగళవారం హైకోర్టును అభ్యర్థించారు. ఈ వ్యాజ్యాన్ని న్యాయమూర్తి లంచ్‌మోషన్‌గా విచారణకు స్వీకరించారు. సదరు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. పిటిషనర్‌ తల్లి ఇప్పటికీ చెన్నై ఆస్పత్రిలోనే చికిత్స పొందుతున్నారని, మధ్యంతర బెయిల్‌ను మరోసారి పొడిగించాలని కోరారు. దీనిపై పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ (పీపీ) మెండ లక్ష్మీనారాయణ తీవ్రంగా స్పందించారు. కోర్టును తప్పుదోవ పట్టిస్తున్నారని తెలిపారు. తల్లి అనారోగ్యాన్ని కారణంగా చూపి పిటిషనర్‌ మధ్యంతర బెయిల్‌ పొందారని, గుంటూరు లలితా సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రి వైద్యుడు పీవీ రాఘవశర్మ గత నెల 28న ఇచ్చినట్లు తప్పుడు మెడికల్‌ సర్టిఫికెట్‌ సమర్పించి.. కోర్టును మోసగించి.. మధ్యంతర బెయిల్‌ను పొడిగించుకున్నారని వెల్లడించారు. కోర్టు ఆదేశాలతో మెడికల్‌ సర్టిఫికెట్‌ వాస్తవికతపై పోలీసులు దర్యాప్తు చేశారని, అది తామిచ్చింది కాదని ఆస్పత్రి వర్గాలు స్పష్టం చేశాయని.. హైకోర్టుకు బోరుగడ్డ ఫోర్జరీ సర్టిఫికెట్‌ సమర్పించినట్లు గుంటూరు ఎస్పీ నివేదిక ఇచ్చారటూ వివరాలు కోర్టు ముందుంచారు. పైగా చెన్నై అపోలో ఆస్పత్రి రికార్డులను పరిశీలిస్తే పిటిషనర్‌ తల్లి గత నెల 23నే ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌ అయినట్లు తేలిందన్నారు. తప్పుడు మెడికల్‌ సర్టిఫికెట్‌తో బోరుగడ్డ ఈ నెల 1న హైకోర్టును ఆశ్రయించే నాటికి అతడి తల్లి ఆస్పత్రిలో లేరన్నారు. ఫోర్జరీ సర్టిఫికెట్‌, తప్పుడు అఫిడవిట్‌ దాఖలు చేసిన నేపథ్యంలో అతడిని ప్రాసిక్యూట్‌ చేసేందుకు అనుమతి కోరుతూ అనంతపురం పోలీసులు అనుబంధ పిటిషన్‌ వేశారని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. మధ్యంతర బెయిల్‌ పొడిగించాలన్న అభ్యర్థనను వ్యతిరేకించారు. వివరాలను పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి.. మధ్యంతర బెయిల్‌ పొడిగించేందుకు నిరాకరించారు.

Updated Date - Mar 12 , 2025 | 04:55 AM