Share News

AP Police Objection: ఏ పని కోసం ఈ పెరోల్‌

ABN , Publish Date - Aug 12 , 2025 | 04:09 AM

తిరుపతి జిల్లా గూడూరుకు చెందిన అవిలే శ్రీకాంత్‌ ఒక రౌడీ షీటర్‌. ఒకటి కాదు... రెండు స్టేషన్లలో రౌడీషీట్లు ఉన్నాయి. 2007లో అతను ఒక బ్రాందీ షాపు మేనేజర్‌ను హత్య చేసినట్లు రుజువు కావడంతో...

AP Police Objection: ఏ పని కోసం ఈ పెరోల్‌

  • అతడిపై రెండు స్టేషన్లలో రౌడీ షీట్లు

  • హత్యకేసులో యావజ్జీవ ఖైదీ

  • జైలు నుంచి పారిపోయిన చరిత్ర

  • రెండు జిల్లాల ఎస్పీలు ‘నో’ అన్నారు

  • జైలు సూపరింటెండెంట్‌ వద్దన్నారు

  • హోం జాయింట్‌ సెక్రటరీ నో అన్నారు

  • కానీ.. 15 రోజుల్లోనే మారిన చిత్రం

  • నెల పెరోల్‌ ఇస్తూ సెక్రటరీ ఉత్తర్వులు

రెండు జిల్లాల పోలీసు అధికారులు ‘వద్దు’ అని మొత్తుకున్నా... ‘అతను బయటికి వస్తే ప్రమాదం’ అని హెచ్చరించినా... ‘నిబంధనలు ఒప్పుకోవు’ అని లిఖితపూర్వకంగా తమ అభిప్రాయం వెల్లడించినా... సెంట్రల్‌ జైలు సూపరింటెండెంట్‌ ససేమిరా అన్నా... చివరికి, హోంశాఖ జాయింట్‌ సెక్రటరీయే ‘రిజెక్టెడ్‌’ అని ఉత్తర్వులు ఇచ్చినా... ఒక ఖైదీ పెరోల్‌ మీద బయటికి వచ్చాడు. తెరవెనుక ఎవరు సహకరించారో గానీ... 30 రోజులు పెరోల్‌ ప్రసాదిస్తూ రాష్ట్ర హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఇది చూసి పోలీసు అధికారులే అవాక్కయ్యారు. ఇవీ ఆ వివరాలు...

(అమరావతి - ఆంధ్రజ్యోతి)

తిరుపతి జిల్లా గూడూరుకు చెందిన అవిలే శ్రీకాంత్‌ ఒక రౌడీ షీటర్‌. ఒకటి కాదు... రెండు స్టేషన్లలో రౌడీషీట్లు ఉన్నాయి. 2007లో అతను ఒక బ్రాందీ షాపు మేనేజర్‌ను హత్య చేసినట్లు రుజువు కావడంతో... న్యాయస్థానం అతనికి యావజ్జీవ శిక్ష విధించింది. శ్రీకాంత్‌ 2010 అక్టోబరు నుంచి నెల్లూరు సెంట్రల్‌ జైలులో శిక్ష అనుభవిస్తున్నాడు. 2014 ఫిబ్రవరి 12న తప్పించుకుని పారిపోయాడు. నాలుగున్నర సంవత్సరాల తర్వాత... 2018 నవంబరు 15న తప్పనిసరి పరిస్థితుల్లో లొంగిపోయాడు. అయితే... తనకు 30 రోజులు పెరోల్‌ కావాలంటూ ఈ ఏడాది మే 28న హోంశాఖ కార్యదర్శికి విన్నవించుకున్నాడు. నిబంధనల ప్రకారం దానిని తిరుపతి జిల్లా ఎస్పీ పరిశీలనకు పంపించారు. ఖైదీలకు పెరోల్‌ ఇవ్వడం సాధారణంగా జరిగేదే. కానీ... దానికీ కొన్ని నిబంధనలు ఉంటాయి. రౌడీ షీటర్లు, జైలు నుంచి తప్పించుకుని పోయిన వాళ్లకు ఈ వెసులుబాటు ఉండదు. అతడు బయటికి రావడంవల్ల బయట ఎవరికైనా ఇబ్బంది తలెత్తుతుందని భావించినా పెరోల్‌ ఇవ్వరు. శ్రీకాంత్‌ పూర్వాపరాలను పరిశీలించిన అనంతరం... ‘‘అతను కరుడుగట్టిన నేరస్థుడు.


ఒకసారి జైలు నుంచి తప్పించుకున్నాడు. అతను బయటికి వస్తే శాంతిభద్రతలకు విఘాతం కలుగుతుంది. పెరోల్‌కు అర్హుడు కాదు’’ అని తిరుపతి ఎస్పీ హోంశాఖతో పాటు నెల్లూరు జైలు సూపరింటెండెంట్‌కు జూన్‌ 9వ తేదీన లేఖ రాశారు. ‘పెరోల్‌ నాట్‌ రెకమెండెడ్‌’ అని స్పష్టం చేశారు. హత్య కేసులో శిక్ష అనుభవిస్తూ, ఒకసారి జైలు నుంచి తప్పించుకున్న అనిల్‌కు పెరోల్‌ ఇచ్చేందుకు నిబంధనలు అంగీకరించవని నెల్లూరు ఎస్పీ, గూడురు పోలీసులు సైతం తేల్చిచెప్పారు. అంతేకాదు... నెల్లూరు, తిరుపతి ప్రాంతాల్లో రౌడీ గ్యాంగ్‌లతో శ్రీకాంత్‌కు ఉన్న సంబంధాలు, అతని ప్రియురాలిగా చెబుతున్న ఒక మహిళ వ్యవహారాలను సైతం అంతర్గత నివేదికలో పొందుపరిచారు. దీంతో... హోంశాఖ జాయింట్‌ సెక్రటరీ జూలై 16న శ్రీకాంత్‌ పెరోల్‌ను తిరస్కరిస్తూ ఆదేశాలిచ్చారు. ‘‘జీవో నంబర్‌ 4లోని రూల్‌ 23 కింద పెరోల్‌కు శ్రీకాంత్‌ అనే ఖైదీ అర్హుడు కాదు. అతని పెరోల్‌ దరఖాస్తును తిరస్కరిస్తున్నాం’’ అని స్పష్టం చేశారు.


అంతలోనే సీన్‌ మారింది...

ఏం జరిగిందో... తెరవెనుక ఎవరు చక్రం తిప్పారో... 15 రోజుల్లోనే సీన్‌ మారిపోయింది. రెండు జిల్లాల ఎస్పీలు, జైలు సూపరింటెండెంట్‌ చేసిన సిఫారసులు, హోంశాఖ జాయింట్‌ సెక్రటరీ ఇచ్చిన జీవో బుట్టదాఖలయ్యాయి. జూలై 30న శ్రీకాంత్‌కు 30 రోజులు పెరోల్‌ ఇస్తూ హోంశాఖ కార్యదర్శి జీవో ఇచ్చేశారు. హత్యకేసులో శిక్ష పడ్డ ఆ ఖైదీ... దర్జాగా బయటికి వచ్చేశాడు. ఈ విషయం తెలియగానే మూడు జిల్లాల పోలీసులు అవాక్కయ్యారు. నిబంధనల ప్రకారం... హోంశాఖ జాయింట్‌ సెక్రటరీ ‘ఓకే’ అని సిఫారసు చేస్తే, ఆ మేరకు కార్యదర్శి పెరోల్‌పై జీవో ఇవ్వాలి. కానీ... ఇక్కడ ఏం జరిగిందో ఏమో తెలియదుగానీ... ‘రిజెక్టెడ్‌’ అని జాయింట్‌ సెక్రటరీ జీవో జారీ చేసిన 15 రోజులకే... ‘పెరోల్‌ అప్రూవ్డ్‌’ అంటూ హోంశాఖ సెక్రటరీ జీవో నంబర్‌ 1267 విడుదల చేశారు. ప్రస్తుత ప్రభుత్వం జీవోఐఆర్‌ వెబ్‌సైట్లో అన్ని జీవోలను అప్‌లోడ్‌ చేస్తోంది. కానీ... ఈ పెరోల్‌ జీవోను మాత్రం అప్‌లోడ్‌ చేయకపోవడం గమనార్హం. ఇలా జీవో విడుదలకావడం, అలా శ్రీకాంత్‌ జైలు నుంచి బయటికి రావడం జరిగిపోయింది. దీని వెనుక ఏం జరిగింది? ఏ ‘పని’ మీద అతను బయటికి వచ్చాడు? ఎవరు రప్పించారు? అనే ప్రశ్నలకు సమాధానాలు తెలియక తిరుపతి, నెల్లూరు జిల్లాల పోలీసులు తలలు పట్టుకుంటున్నారు.

Updated Date - Aug 12 , 2025 | 04:11 AM