Nellore Police: కి లేడీ అరుణపై రౌడీషీట్
ABN , Publish Date - Sep 23 , 2025 | 04:35 AM
పలు నేరాలు, కేసుల్లో ఉన్న నెల్లూరు కి‘లేడి’ నడిగుంట అరుణపై రౌడీషీట్ తెరవాలని పోలీసులు నిర్ణయించినట్లు తెలిసింది.
తాజాగా మళ్లీ కస్టడీలోకి తీసుకుని విచారణ
తనకేమీ తెలియదంటూ బుకాయింపు
నేడూ ప్రశ్నించనున్న కోవూరు పోలీసులు
కోవూరు, సెప్టెంబరు 22(ఆంధ్రజ్యోతి): పలు నేరాలు, కేసుల్లో ఉన్న నెల్లూరు కి‘లేడి’ నడిగుంట అరుణపై రౌడీషీట్ తెరవాలని పోలీసులు నిర్ణయించినట్లు తెలిసింది. మరోవైపు కోర్టు అనుమతితో కస్టడీలో విచారించేందుకు పోలీసులు ఆమెను సోమవారం ఒంగోలు జైలు నుంచి నెల్లూరుకు తీసుకొచ్చారు. కోవూరు పోలీసు సర్కిల్ కార్యాలయంలో ఉదయం నుంచి సాయంత్రం వరకు విచారించారు. ఇళ్ల స్థలాలు ఇప్పిస్తానని కోవూరులోని నాగులపుట్ట ప్రాంతానికి చెందిన గిరిజన మహిళల నుంచి అరుణ అక్రమంగా నగదు వసూలు చేశారనే అభియోగంతో ఇటీవల పోలీసులు కేసు నమోదు చేశారు. దీనిపై సీఐ సుధాకరరెడ్డి, నెల్లూరు సీఐ నాగేశ్వరమ్మ ఆధ్వర్యంలో ఐడీ పార్టీ పోలీసులు అరుణను విచారించారు. చాలా ప్రశ్నలకు తనకేమీ తెలియదని అరుణ సమాధానం ఇచ్చిందని.. ఇంకొన్ని ప్రశ్నలకు సమాధానం దాటవేసినట్లు సమాచారం. సాయంత్రం తిరిగి జైలుకు ఆమెను తరలించారు. మంగళవారం మళ్లీ కస్టడీలోకి తీసుకుని విచారించనున్నారు. ఓ అపార్టుమెంటు ఫ్లాటు ఆక్రమణపైనా ఆమెపై కేసు నమోదు కాగా.. అందులో రెండ్రోజుల కిందట బెయిల్ మంజూరైంది. నెల్లూరులో నమోదైన రెండు గంజాయి అక్రమ రవాణా కేసుల్లో, అన్నదమ్ముల ఆస్తి వివాదం కేసులో ఆమె ప్రస్తుతం రిమాండ్‌లో ఉంది.
‘హాసిని’ కేసులో కూడా నిందితురాలే
కొడవలూరు పోలీసుస్టేషన్ పరిధిలోని టపాతోపు వద్ద 9నెలల కిందట జరిగిన హిజ్రా హాసిని హత్య కేసులోనూ అరుణ ప్రమేయం ఉందని పోలీసులు భావిస్తున్నారు. ఆమెతోపాటు మరో నలుగురిని నిందితులుగా చేర్చేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు. ఈ నలుగురిలో ఓ న్యాయవాది కూడా ఉన్నట్లు తెలిసింది.