రోప్‌వే!
ABN , Publish Date - Apr 14 , 2025 | 12:56 AM
భవానీ ఐల్యాండ్‌కు రోప్‌వే ఏర్పాటుపై ఎట్టకేలకు కదలిక వచ్చింది. దశాబ్దన్నర కాలంగా విజయవాడ నగరానికి రోప్‌వే ఊరిస్తూనే ఉంది. ఈ దఫా ఎట్టి పరిస్థితుల్లోనూ సాకారం కావటానికి వీలుగా అడుగులు పడుతున్నాయి.

-బెర్మ్ పార్క్ నుంచి భవానీ ఐల్యాండ్ వరకు..
- ప్రణాళికలు రచిస్తున్న ఏపీటీడీసీ అధికారులు
- దశాబన్నర కాలంగా ఎదురుచూస్తున్న నగర వాసులు
(ఆంధ్రజ్యోతి, విజయవాడ):
భవానీ ఐల్యాండ్‌కు రోప్‌వే ఏర్పాటుపై ఎట్టకేలకు కదలిక వచ్చింది. దశాబ్దన్నర కాలంగా విజయవాడ నగరానికి రోప్‌వే ఊరిస్తూనే ఉంది. ఈ దఫా ఎట్టి పరిస్థితుల్లోనూ సాకారం కావటానికి వీలుగా అడుగులు పడుతున్నాయి. గతంలో ఏర్పడిన అడ్డంకులను దృష్టిలో పెట్టుకుని ఈ సారి రోప్‌వే ప్రాజెక్టు కోసం ఏపీటీడీసీ అధికారులు డిజైన్ చేస్తున్నారు. గతంలో రాజీవ్ గాంధీ పార్కు నుంచి ఇంద్రకీలాద్రికి, అక్కడి నుంచి భవానీ ద్వీపం రోప్‌వే నడపాలన్న ప్రతిపాదన వచ్చింది. ఇంద్రకీలాద్రి దిగువున ఆర్కియాలజీ సంరక్షణలో అక్కన్నమాదన్న గుహలు ఉండటంతో అభ్యంతరాలు వచ్చాయి. ఆ తర్వాత దేవస్థాన వైదిక కమిటీ కూడా ఎత్తు ఉండకూడదన్న ఉద్దేశ్యంతో ప్రతిబంధకాలు ఎదురయ్యాయి. ఈ నేపథ్యంలో ఈ సారి అతి తక్కువ నిడివి కలిగిన రోప్‌వే ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. హరిత బెర్మ్ పార్క్ నుంచి కృష్ణానది మీదుగా సాగుతూ భవానీ ఐల్యాండ్‌కు చేరుకునేలా రోప్‌వే ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. బెర్మ్‌పార్క్ నుంచి భవానీ ద్వీపం వరకు 0.88 కిలోమీటర్ల మేర రోప్‌వేకు ఏపీటీడీసీ అధికారులు ప్రణాళికలు రచించారు. అతి త్వరలో దీనిపై బోర్డు సమావేశంలో నిర్ణయం తీసుకుని పీపీపీ విధానంలో అప్పగించే అవకాశం ఉంది.