SAAP Chairman Ravi Naidu: రోజా.. రోజులు లెక్కపెట్టుకో
ABN , Publish Date - Jul 22 , 2025 | 05:08 AM
వైసీపీ హయాంలో కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని దోచుకున్న మాజీ మంత్రి రోజా ఊచలు లెక్కపెట్టుకునే రోజులు దగ్గరపడ్డాయని శాప్ చైర్మన్ రవినాయుడు అన్నారు.
మరో 10 రోజుల్లో జైలుకెళ్లడం తప్పదు: శాప్ చైర్మన్
తిరుపతి, జూలై 21(ఆంధ్రజ్యోతి): వైసీపీ హయాంలో కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని దోచుకున్న మాజీ మంత్రి రోజా ఊచలు లెక్కపెట్టుకునే రోజులు దగ్గరపడ్డాయని శాప్ చైర్మన్ రవినాయుడు అన్నారు. తిరుపతి ప్రెస్‌క్లబ్‌లో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ మరో పది రోజుల్లో రోజా కూడా జైలుపాలవడం తప్పదన్నారు. ఏయే శాఖల్లో అవినీతికి పాల్పడిందో అన్నీ తేలుస్తామన్నారు. చట్టపరంగానే చర్యలుంటాయని వివరించారు. వైసీపీ దొంగల పార్టీ అని ముద్రపడేందుకు తిరుపతి ఉప ఎన్నికే కారణమని.. దీనిపై ఎన్నికల కమిషన్‌కు లేఖ కూడా రాశామన్నారు. ‘రోజా తన శాఖల ద్వారా చేసిన అభివృద్ధి శూన్యం. సభ్యసమాజం తలదించుకునేలా నోరు పారేసుకోవడమే ఆమె పని. జగన్ ఓడిపోవడానికి ఒక రకంగా ఆమె కూడా కారణమే. సీఎం చంద్రబాబును దుర్భాషలాడిన నీచ సంస్కృతి ఆమెది. లోకేశ్, పవన్‌కల్యాణ్, నాగబాబు, చిరంజీవి, బాలయ్యలను ఇష్టానుసారంగా మాట్లాడి వారి తల్లులను అవమానిస్తూ నోరుపారేసుకుంది. నగరి ఎమ్మెల్యే గాలి భానుప్రకాశ్‌ను ‘కొడకా..’ అంటూ నువ్వు చేసిన వ్యాఖ్యలు సరైనవేనా రోజా? నువ్వైతే ఇష్టానుసారం మాట్లాడేయవచ్చా’ అని నిలదీశారు. మహిళలను కించపరిచే ఆమె.. మహిళల ఆత్మగౌరవం గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందని రవినాయుడు చెప్పారు.