Share News

Roads Damage: దారి పొడువునా విధ్వంసం

ABN , Publish Date - Nov 22 , 2025 | 04:37 AM

విశాఖపట్నం నగరంలో రహదారులన్నీ మహా విశాఖ నగర పాలక సంస్థ (జీవీఎంసీ) పరిధిలో ఉన్నాయి. అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీ కోసం రహదారుల మధ్యలో తవ్వేసి నెలల తరబడి పూర్తి చేయకుండా వదిలేస్తున్నారు.

Roads Damage: దారి పొడువునా విధ్వంసం

  • గుంతలతో నరకయాతన

  • పగటి పూటే చుక్కలు.. అక్కడక్కడా ప్రమాదాలు

  • తుఫాన్‌ ప్రభావిత జిల్లాల్లో మరీ దారుణం

  • కొన్ని చోట్ల జాతీయ రహదారులపైనా గోతులు

విశాఖ నగరంలో..

విశాఖపట్నం నగరంలో రహదారులన్నీ మహా విశాఖ నగర పాలక సంస్థ (జీవీఎంసీ) పరిధిలో ఉన్నాయి. అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీ కోసం రహదారుల మధ్యలో తవ్వేసి నెలల తరబడి పూర్తి చేయకుండా వదిలేస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో పదునైన రాళ్లు పరిచేసి మిన్నకుంటున్నారు. పైపులైన్లు, కేబుళ్ల కోసం రహదారుల పక్కన గోతులు తవ్వి వాటిపై మట్టి పోసి వదిలేస్తున్నారు. ఆ తరువాత వాటిపైనే తారురోడ్డు వేస్తున్నారు. వారం రోజులకే అవి కిందికి దిగిపోతున్నాయి. సీతమ్మధార, హెచ్‌బీ కాలనీల్లో రహదారులే వీటికి నిదర్శనం. కాంట్రాక్టర్లు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నా పట్టించుకునే దిక్కు లేదు. నగర శివార్లలో ఆర్‌అండ్‌బీ రహదారులకు నిధుల సమస్య ఉంది. భీమిలి నుంచి కుమ్మరిపాలెం మీదుగా జాతీయ రహదారి(తాళ్లవలస)కి వెళ్లే మార్గంలో పదేళ్ల నుంచి ఎటువంటి పనులు చేపట్టలేదు. ఈ మార్గంలోనే అనేక విద్యా సంస్థలు ఉన్నాయి. మొత్తం 4.5 కి.మీ. ఉన్న ఈ మార్గంలో జీవీఎంసీ తన పరిధిలో కొంత రహదారి వేసి మిగిలినది విడిచిపెట్టింది. ఆనందపురం మండలంలో జాతీయ రహదారి నుంచి రామవరం వెళ్లే రహదారి నరకాన్ని తలపిస్తోంది.


(ఆంధ్రజ్యోతి న్యూస్‌నెట్‌వర్క్‌)

రాష్ట్రంలో చాలా రహదారులు మళ్లీ అధ్వానంగా తయారయ్యాయి. గుంతలు పడటం, కంకర కొట్టుకుపోవడంతో రోడ్లు ధ్వంసమయ్యాయి. కొన్ని చోట్ల అయితే మరీ దారుణంగా ఉన్నాయి. పగటి పూటే వాహనదారులకు చుక్కలు కనిపిస్తున్నాయి. కూటమి ప్రభుత్వం వచ్చాక సంక్రాంతికి ముందు రోడ్లకు తాత్కాలిక మరమ్మతులు చేపట్టింది. కొన్ని చోట్ల రోడ్ల నిర్మాణాలూ చేపట్టింది. దీంతో చాలా వరకు వాహనదారుల కష్టాలు తీరాయి. అయితే భారీ వర్షాలు, ఇటీవల మొంథా తుఫాన్‌ ప్రభావంతో పరిస్థితి మళ్లీ మొదటికొచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో రోడ్లు దెబ్బతిన్నాయి. మొంథా తుఫాన్‌ ప్రభావిత జిల్లాలలో అయితే పరిస్థితి మరింత దారుణంగా ఉంది. గ్రామీణ రహదారులతో పాటు ప్రధాన నగరాలు-పట్టణాలను కలిపే రహదారులు కూడా ధ్వంసమయ్యాయి. కొన్ని చోట్ల జాతీయ రహదారులపై గుంతలు పడ్డాయి. దీంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రమాదాలు కూడా జరుగుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా రోడ్ల పరిస్థితిని ‘ఆంధ్రజ్యోతి’ పరిశీలించింది. జిల్లాల వారీగా ప్రస్తుతం రోడ్ల దుస్థితి ఇదీ...


అనంతలో ప్రయాణం నరకం

అనంతపురం జిల్లాలో జాతీయ రహదారులు, ఆర్‌అండ్‌బీ రహదారులు అధ్వానంగా మారాయి. అనంతపురం-హైదరాబాద్‌ జాతీయ రహదారి-44.. గార్లదిన్నె మండలం కల్లూరు, రామదాసుపేట, గుడ్డాలపల్లి, తలగాసిపల్లి గ్రామాల వద్ద గుంతలు ఏర్పడి ప్రమాదకరంగా మారింది. పామిడి వద్ద పెన్నానది బ్రిడ్జిపై గుంతలు పడ్డాయి.

గుత్తి నుంచి పత్తికొండకు వెళ్లే ప్రధాన రహదారి పూర్తిస్థాయిలో దెబ్బతింది. కంకరతేలి గుంతలు పడటంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ రహదారిపై గోతులను పూడ్చేందుకు నిధులు మంజూరయ్యాయి. రూ.2 కోట్లతో గుంతల్లో డస్ట్‌ నింపి వదిలేశారు. దీంతో ప్రయాణికులు మరింత ఇబ్బంది పడుతున్నారు.

Untitled-7 copy.jpg


నంద్యాల జిల్లాలో...

నంద్యాల జిల్లా వ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో ఆర్‌అండ్‌బీ, పంచాయతీ రాజ్‌శాఖ రోడ్లు అధ్వానంగా ఉన్నాయి. ఇటీవల మొంథా తుఫాన్‌ కారణంగా మరింత దెబ్బతిన్నాయి. జిల్లా వ్యాప్తంగా ఆర్‌అండ్‌బీ రోడ్లు 120 కిలోమీటర్ల మేర దెబ్బతిన్నాయి. బనగానపల్లె, ఆళ్లగడ్డ, నంద్యాల నియోజకవర్గాల్లో రోడ్లు ఎక్కువగా దెబ్బతిన్నాయి. కొలిమిగుండ్ల సమీపంలోని అంకిరెడ్డిపల్లి వద్ద రెండు వంతెనలు దెబ్బతిన్నాయి. పంచాయతీరాజ్‌ శాఖ పరిధిలో 32.85 కిలోమీటర్ల మేర రోడ్లు, 12 వంతెనలు, కల్వర్టులు దెబ్బతిన్నాయి. చాగలమర్రి, ఆత్మకూరు, నందికొట్కూరు, బనగానపల్లె తదితర ప్రాంతాల్లో రోడ్లు ఎక్కువగా దెబ్బతిన్నట్లు అధికారులు గుర్తించారు. వీటికి శాశ్వత, తాత్కాలిక మరమ్మతులు చేపట్టడానికి ప్రతిపాదనలు సిద్ధం చేశారు.

Untitled-7 copy.jpg


అన్నమయ్య జిల్లాలో...

అన్నమయ్య జిల్లాలో మదనపల్లె-బెంగళూరు ప్రధాన మార్గంలో చాలా చోట్ల గుంతలు పడ్డాయి. నక్కలదిన్నె, చిప్పిలి, కూకట్మానుగడ్డ, బార్లపల్లె, చీకలబైలు వరకు.. పది కిలోమీటర్ల దూరంలో కర్ణాటక సరిహద్దు వరకు అంతరాష్ట్ర రోడ్డు గుంతలమయమైంది. వీటిని ఎప్పటికప్పుడు పూడ్చకపోవడంతో.. వర్షాలతో అవి మరింత పెద్దగా తయారయ్యాయి. బెంగళూరు నుంచి నిత్యం వచ్చే వాహనాలు పగటి పూటే తరచూ ప్రమాదాల బారినపడుతున్నాయి. రాత్రి వేళ చెప్పాల్సిన పని లేదు. ద్విచక్ర వాహనదారులు కూడా ఇబ్బందులు పడుతున్నారు.

Untitled-7 copy.jpg


కోస్తాంధ్రలో..

ప్రకాశం జిల్లాలో ధ్వంసమైన రోడ్లు

ప్రకాశం జిల్లాలో రహదారులు దారుణంగా తయారయ్యాయి. ఎటుచూసినా గుంతలతో వాహనదారులను ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. పంచాయతీరాజ్‌, ఆర్‌అండ్‌బీ రోడ్ల పరిస్థితి అధ్వానంగా ఉంది. ఇటీవల జిల్లాను ముంచెత్తిన మొంథా తుఫాన్‌ రోడ్లను ధ్వంసం చేసింది. అధికారుల అంచనా ప్రకారం జిల్లాలో సుమారు రూ.180.66 కోట్ల మేర ఆర్‌అండ్‌బీ రోడ్లు, రూ.70.41 కోట్ల మేర పీఆర్‌ రోడ్లు దెబ్బతిన్నాయి. వెరసి.. దాదాపు రూ.251.76 కోట్ల మేర నష్టం వాటిల్లింది. వైపాలెం నుంచి త్రిపురాంతకం వెళ్లే రోడ్డు, దోర్నాల నుంచి ఆత్మకూరు నల్లమల అటవీ ప్రాంతంలో నుంచి వెళ్లే రోడ్డు, మార్కాపురం నుంచి తర్లుపాడు వెళ్లే రోడ్డు, బేస్తవారపేట నుంచి కోనపల్లి వెళ్లే రోడ్డు, కడప- విజయవాడ రహదారిలో పలు చోట్ల, దర్శి నుంచి అద్దంకి వెళ్లే రోడ్డులో చిలకలేరు ప్రాంతంలో, ఒంగోలు-చీరాల జాతీయ రహదారిపై త్రోవగుంట నుంచి ఉప్పుగుండూరు వరకు, ఒంగోలు- పొదిలి రోడ్డులో గ్రానైట్‌ క్వారీల ప్రాంతంలో దెబ్బతిన్నాయి. జిల్లాలో ఏ ప్రాంతంలో చూసినా రోడ్ల పరిస్థితి అధ్వానంగా ఉంది.

Untitled-8 copy.jpg


బాపట్ల జిల్లాలో...

బాపట్ల జిల్లాలో రహదారుల మరమ్మతు పనులను ఈ ఏడాది సంక్రాంతి నాటికి పూర్తి చేయాలని ప్రస్తుత ప్రభుత్వం ఆదేశించింది. కేటాయించిన వాటిల్లో 70 శాతం పనులు పూర్తి చేసినా బిల్లులు చెల్లించడంలో జాప్యం జరుగుతుండడంతో పనులు సాగడం లేదు. జిల్లా వ్యాప్తంగా 108 పనులకు గాను రూ.31 కోట్లను ప్రభుత్వం గతేడాది చివరిలోనే కేటాయించింది. వీటికి సంబంధించిన పనులకు గాను రూ.27 కోట్ల బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. తాజాగా విరుచుకుపడిన మొంథా తుఫాన్‌తో రహదారులు మరింతగా ఛిద్రమయ్యాయి. గ్రామీణ రహదారులు 147 కిలోమీటర్ల మేర దెబ్బతినగా, రూ.139 కోట్ల వరకు నష్టం వాటిల్లింది. ఆర్‌అండ్‌బీ రహదారులు 152 కిలోమీటర్ల మేర దెబ్బతినగా, రూ.139 కోట్ల నష్టం వాటిల్లింది.


పల్నాడు జిల్లాలో...

పల్నాడు జిల్లాలో కూటమి ప్రభుత్వం ఒకసారి రహదారులపై గోతులను పూడ్చివేసింది. రెండు విడతల్లో రూ.29.55 కోట్ల వ్యయంతో పనులు చేశారు. అయితే బిల్లులు రూపాయి కూడా విడుదల చేయలేదు. మొంథా తుఫాను ప్రభావంతో రోడ్లు మళ్లీ దెబ్బతిన్నాయి. నరసరావుపేట బైపాస్‌, సత్తెనపల్లి, గురజాల, పెదకూరపాడు, చిలకలూరిపేట, వినుకొండ నియోజకవర్గాల పరిధిలో రహదారులు పాడయ్యాయి. జిల్లాలో రూ.18.40 కోట్ల వ్యయంతో ఐదు రహదారులను అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కొండ్రముట్ల-బండమోడు-దుర్గి, నకరికల్లు-గురజాల రహదారి, మాచర్ల-వీపీ సౌత్‌, గుంటూరు-అమరావతి రహదారి అభివృద్ధి చేసేందుకు ప్రణాళికను సిద్ధం చేశారు. కాగా టెండర్లు దాఖలు చేసేందుకు కాంట్రాక్టర్లు ముందుకు రావడంలేదు. బకాయిలు విడుదల చేస్తేనే టెండర్లు దాఖలయ్యే పరిస్థితులు నెలకొన్నాయి.


గుంటూరు జిల్లా రోడ్లు అధ్వానం

గుంటూరు జిల్లాలో ప్రధాన రహదారులు అధ్వానంగా ఉన్నాయి. ప్రభుత్వం గతేడాది తాత్కాలిక మరమ్మతులు చేసింది. పూర్తి స్థాయిలో రోడ్లు వేయలేదు. జిల్లాలోని పలు ప్రధాన రహదారులు మళ్లీ దెబ్బతిన్నాయి. గుంటూరు-చీరాల రాష్ట్ర రహదారి, గుంటూరు-పర్చూరు, గుంటూరు-నందివెలుగు-తెనాలి, మంగళగిరి-తెనాలి, తాడికొండ-కంతేరు-ఎన్‌హెచ్‌-16 రహదారులు అత్యంత అధ్వానంగా ఉన్నాయి. ఈ రోడ్లపై ప్రయాణమంటే ప్రాణాలతో చెలగాటమే అన్నట్లుగా మారింది పరిస్థితి. విభజిత గుంటూరు జల్లాలో 227 కి.మీ. మేర రహదారులు దెబ్బతిన్నాయి. మొంథా తుఫాను కారణంగా జిల్లాలో 20 రోడ్లు దెబ్బతిన్నాయి. గుంటూరు నగరంలో అన్ని రహదారులు గుంతలమయమై అస్తవ్యస్తంగా ఉన్నాయి.


కోనసీమ జిల్లాలో...

డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాలో ఇటీవల కురిసిన భారీవర్షాలు, తుఫాన్‌ ప్రభావం వల్ల రహదారులన్నీ దారుణంగా దెబ్బతిన్నాయి. భారీ గుంతలు పడటం, రోడ్లు ఛిద్రం కావడంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. తుఫాను సమయంలో 31.7 కిలోమీటర్ల పంచాయతీరాజ్‌ రహదారులు ధ్వంసమయ్యాయి. ముఖ్యంగా 90 కిలోమీటర్ల తీరం వెంబడి ఉన్న మత్స్యకార గ్రామాల్లో రహదారుల పరిస్థితి దారుణంగా మారింది. అమలాపురం-ముక్కామల కెనాల్‌ రోడ్డు, రాజోలు అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో మలికిపురం గుడిమెళ్లంక వంతెన నుంచి చింతలపల్లి కళింగల వరకు ఉన్న ఆర్‌అండ్‌బీ రహదారి చాలా అధ్వానంగా ఉన్నాయి. ఈ ప్రాంతంలో చాలా రహదారుల పరిస్థితి ఇలాగే ఉంది. ముమ్మిడివరం-ముక్తేశ్వరం ఆర్‌అండ్‌బీ రోడ్డు బాగా దెబ్బతింది. 9.8 కిలోమీటర్లు గల ఈ రోడ్డును 8.7 కిలో మీటర్ల మేర ఆధునికీకరణకు రూ.2.15 కోట్లు మంజూరైంది.


తాడేపల్లిగూడేనికి హైటెక్‌ బస్సులు బంద్‌

పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం పట్టణంలోకి ప్రైవేటు, ఆర్టీసీ హైటెక్‌ బస్సులు రావడం లేదు. రోడ్డు దెబ్బతినడంతో పట్టణానికి రాకుండా జాతీయ రహదారిపై వెళ్లిపోతున్నాయి. బాదంపూడి నుంచి తాడేపల్లిగూడెం రోడ్డు అధ్వానంగా తయారైంది. కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత ఈ రోడ్డుకు మరమ్మతులు చేయించినా ఇటీవల కురిసిన వర్షాలకు తిరిగి గోతులు పడ్డాయి. ఇటీవలే బాదంపూడి నుంచి తాడేపల్లిగూడెం కొత్త ప్లై ఓవర్‌ బ్రిడ్జి వరకు రోడ్డు నిర్మించేందుకు రూ.4.9 కోట్లు మంజూరు చేశారు. తాడేపల్లిగూడెం అనుసంధాన రోడ్ల ఏర్పాటుకు నిధులు మంజూరు చేశారు.


మరమ్మతులు మధ్యలోనే వదిలేశారు

పార్వతీపురం మన్యం జిల్లాలో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత కొన్ని రహదారుల మరమ్మతులు చేపట్టింది. అయితే ఆర్‌అండ్‌బీ శాఖ ఈ మరమ్మతులు పూర్తిగా చేయలేదు. జిల్లాలో ముఖ్యమైన పార్వతీపురం నుంచి రాయగడ వెళ్లే అంతర్రాష్ట్ర రహదారి పూర్తిగా గుంతలమయమైంది. కొంతభాగం మరమ్మతులు చేపట్టి వదిలేశారు. మరమ్మతులు చేసిన చోట కూడా ఇటీవలి భారీ వర్షాలకు గుంతలు పడ్డాయి. ఇది అంతర్రాష్ట్ర రహదారి కావడంతో నిత్యం వందలాది భారీ వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. రాత్రి సమయాల్లో రాకపోకలకు ఇబ్బందులు తప్పడం లేదు.


శ్రీకాకుళం జిల్లాలో...

శ్రీకాకుళం జిల్లాలో రోడ్లు అధ్వానంగా ఉన్నాయి. గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు తట్టెడు మట్టి కూడా వేయలేదు. శ్రీకాకుళం నుంచి ఆమదాలవలస రోడ్డును పూర్తి చేయకపోవడంతో పదుల సంఖ్యలో ప్రమాదాలు జరిగి ఎంతోమంది మరణించారు. కూటమి అధికారంలోకి వచ్చాక చర్యలు తీసుకుంది. రూ.58 కోట్లతో రోడ్డు పనులు ఎనభైశాతం పూర్తయ్యాయి. అయితే శ్రీకాకుళం నగరంలో బలగ, ఆదివారంపేట, కొత్తరోడ్డు జంక్షన్‌ వద్ద రోడ్డు రాళ్లుతేలి గోతులమయంగా మారింది. కల్వర్టులు ప్రమాదకరంగా మారాయి. వీటిని సరిచేసి రోడ్డును పూర్తిచేయాలని రెండు పట్టణాల ప్రజలు కోరుతున్నారు.


అధ్వానంగా బీఎన్‌ రోడ్డు

ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో ఇటు మైదాన ప్రాంతాలకు, అటు ఏజెన్సీకి ప్రధానమైన భీమునిపట్నం-నర్సీపట్నం (బీఎన్‌) రోడ్డు అత్యంత దారుణంగా ఉంది. బీఎన్‌ రోడ్డు అభివృద్ధికి న్యూడెవల్‌పమెంట్‌ బ్యాంకు (ఏడీబీ) నిధులు రూ.110 కోట్లతో చేపట్టిన పనులు గత ప్రభుత్వ నిర్వాకంతో ఐదేళ్ల క్రితం అర్ధాంతరంగా నిలిచిపోయాయి. కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాదిన్నర కావచ్చినా రోడ్డు అభివృద్ధి పనులకు అతీగతీ లేకుండా పోయింది. చివరకు కోర్టు నోటీసులు ఇచ్చినా పనులు చేయించలేకపోతున్నారు. వర్షం పడితే వాననీటితో చెరువులను తలపించే ఈ రహదారిలో వాహనాలు బోల్తాపడి ప్రమాదాలు జరుగుతున్నాయి.

Updated Date - Nov 22 , 2025 | 04:45 AM