Share News

AP Govt: పంచాయతీ ఎన్నికలకు ‘రోడ్‌’మ్యాప్‌

ABN , Publish Date - Dec 14 , 2025 | 04:05 AM

స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న వేళ కూటమి ప్రభుత్వం గ్రామాలకు అభివృద్ధి ‘బాటలు’ వేస్తోంది. గత ప్రభుత్వంలో తీవ్ర నిర్లక్ష్యానికి గురైన పంచాయతీలకు నూతన వైభవం తీసుకొచ్చేలా...

AP Govt: పంచాయతీ ఎన్నికలకు ‘రోడ్‌’మ్యాప్‌

  • మారనున్న గ్రామీణ ముఖచిత్రం

  • రహదారులు.. పట్టణ స్థాయి వసతులు

  • 5 వేల కోట్ల నిధులతో రోడ్ల నిర్మాణం

  • సాస్కీ పథకం ద్వారా రూ.2,120 కోట్లు

  • ఉపాధి హామీ నిధులు రూ.2 వేల కోట్లు

  • 15వ ఆర్థిక సంఘం నుంచి 900 కోట్లు

  • మార్చికి రోడ్ల నిర్మాణం పూర్తికి కసరత్తు

  • చంద్రబాబు, పవన్‌ ప్రత్యేక దృష్టి

  • ఇప్పటికే 4 వేల కోట్లతో రహదారులు

  • పల్లెల్లోనూ పట్టణ సదుపాయాల కల్పన

  • మున్సిపాలిటీల తరహాలో ఆన్‌లైన్‌ సేవలు

  • అందుబాటులోకి స్వర్ణ పంచాయతీ పోర్టల్‌

  • పంచాయతీల రీ గ్రూపింగ్‌పైనా కసరత్తు

2024-25లో ఉపాధి హామీ నిధులు దాదాపు రూ.2 వేల కోట్లతో రోడ్లు నిర్మించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనూ రూ.2 వేల కోట్లతో నిర్మాణం చేపడుతున్నారు. ఇవిగాక దాదాపు మరో రూ.5 వేల కోట్ల కేంద్ర నిధులతో గ్రామీణ రహదారులు నిర్మించనున్నారు. పంచాయతీ ఎన్నికలకు ముందే, వచ్చే మార్చి నాటికి చాలావరకు నిర్మాణం పూర్తి చేసి గ్రామీణ ముఖచిత్రం మార్చేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది.

వైసీపీ హయాంలో పూర్తిగా ధ్వంసమైన గ్రామీణ రహదారులకు మహర్దశ వస్తోంది. కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే పల్లె పండుగ పేరుతో గుంతల రహదారుల మరమ్మతులపై దృష్టి సారించింది. తాజాగా గ్రామీణ ప్రాంతాల్లో పూర్తిస్థాయిలో రహదారుల నిర్మాణం చేపట్టేందుకు కసరత్తు చేస్తోంది. పంచాయతీల్లో మెరుగైన మౌలిక సదుపాయాల కల్పనే లక్ష్యంగా డిప్యూటీ సీఎం, పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి పవన్‌ కల్యాణ్‌ పనిచేస్తున్నారు. పంచాయతీల్లో పట్టణ స్థాయి సదుపాయాలు కల్పించేందుకు ఇప్పటికే పలు విప్లవాత్మక నిర్ణయాలు తీసుకున్నారు. ఇందులో భాగంగా ఇటీవల స్వర్ణ పంచాయతీ పోర్టల్‌ను ప్రారంభించారు. కార్పొరేషన్లు, మున్సిపాలిటీలకే పరిమితమైన ఆన్‌లైన్‌ వ్యవస్థను గ్రామీణ ప్రాంతాలకూ తీసుకొచ్చారు.

(అమరావతి-ఆంధ్రజ్యోతి)

స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న వేళ కూటమి ప్రభుత్వం గ్రామాలకు అభివృద్ధి ‘బాటలు’ వేస్తోంది. గత ప్రభుత్వంలో తీవ్ర నిర్లక్ష్యానికి గురైన పంచాయతీలకు నూతన వైభవం తీసుకొచ్చేలా ముందుకు సాగుతోంది. స్థానిక ఎన్నికలకు ముందస్తు వ్యూహాలను సిద్ధం చేసుకుంటోంది. ప్రస్తుత పంచాయతీల గడువు వచ్చే ఏడాది ఏప్రిల్‌ 2తో ముగియనుంది.


వెనువెంటనే ఎన్నికల నిర్వహణ చేపట్టనున్నారు. ఎన్నికల కంటే ముందుగా పంచాయతీల అభివృద్ధిపై ప్రభుత్వం దృష్టి సారించింది. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనపై దృష్టి సారించారు. గ్రామాల్లో పూర్తిస్థాయిలో రహదారుల నిర్మాణానికి అవసరమైన నిధుల సమీకరణ ఇప్పటికే పూర్తి చేశారు. స్పెషల్‌ అసిస్టెన్స్‌ టు స్టేట్స్‌ ఫర్‌ కేపిటల్‌ ఇన్వెస్ట్‌మెంట్‌(సాస్కీ) కింద ఇటీవల కేంద్రం రూ.2,120 కోట్లను మంజూరు చేసింది. ఈ నిధులను గ్రామీణ ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణానికి వెచ్చించనున్నారు. 15వ ఆర్థిక సంఘం నిధులు మరో రూ.900 కోట్లు, ఉపాధి హామీ పథకం కింద మరో రూ.2 వేలకోట్లు వరకు నిధులు కేంద్రం నుంచి రానున్నాయి. ఈ మొత్తం నిధులతో గ్రామీణ ప్రాంతాల ముఖచిత్రాన్ని మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఈ నిధుల ద్వారా వచ్చే ఏడాది మార్చి నాటికి గ్రామీణ ప్రాంతాల్లో అధికశాతం రహదారుల నిర్మాణాన్ని పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో ఉపాధి హామీ నిధులు రూ.2 వేలకోట్లు వెచ్చించి 4 వేల కిలోమీటర్ల మేర రహదారులను నిర్మించారు. 2025-26 ఆర్థిక సంవత్సరంలో మరో రూ.2 వేలకోట్లతో రోడ్ల నిర్మాణం జరుగుతోంది. పల్లె పండుగ పనులకు సంబంధించిన బకాయిలు విడుదలలో జాప్యం జరిగింది. ఆ పనులు చేపట్టిన వారిలో అసంతృప్తిని చల్లార్చేందుకు ఇప్పటికే చాలా వరకు బకాయిలు విడుదల చేశారు. మరో రూ.200 కోట్ల బకాయిలను త్వరలో విడుదల చేయడానికి సిద్ధమవుతున్నారు.


విప్లవాత్మక సంస్కరణలు

డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ పంచాయతీల్లో విప్లవాత్మక సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. గతంలో పంచాయతీల్లో అంతా మాన్యువల్‌ వ్యవస్థ నడిచేది. దీనివల్ల అవినీతికి ఆస్కారం ఏర్పడటంతో పాటు ప్రజలకూ తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యేవి. ఇటీవల స్వర్ణ పంచాయతీ పోర్టల్‌ అందుబాటులోకి తీసుకురావడంతో వీటికి చెక్‌ పడనుంది. ఈ పోర్టల్‌ ద్వారా.. ఇప్పటి వరకు కార్పొరేషన్లు, మున్సిపాలిటీలకే పరిమితమైన ఆన్‌లైన్‌ వ్యవస్థను గ్రామీణ ప్రాంతాల్లోనూ అందుబాటులోకి తీసుకొచ్చినట్లయింది. ఇంటి పన్నులు, ఖాళీ స్థలాల పన్నులు, లేఔట్‌ డెవల్‌పమెంట్‌ చార్జీలు వంటి వాటిని ఆన్‌లైన్‌ ద్వారా చెల్లించే వెసులుబాటు ఈ పోర్టల్‌ ద్వారా కలుగుతుంది. గతంలో ఒకే కార్యదర్శి మూడు, నాలుగు పంచాయతీల బాధ్యతలను నిర్వర్తించేవారు. దీంతో పంచాయతీల్లో పాలన గాడి తప్పింది. పంచాయతీల పాలనను మరింత మెరుగుపర్చేందుకు వాటిని రీగ్రూపింగ్‌ చేయడంపై పవన్‌ కల్యాణ్‌ దృష్టి పెట్టారు. అందులో భాగంగా పంచాయతీలను నాలుగు గ్రేడ్లుగా విభజించి ప్రతి పంచాయతీకి ప్రత్యేక కార్యదర్శి స్థాయి అధికారిని నియమించాలని నిర్ణయించారు. డివిజన్‌ స్థాయిలోనూ పంచాయతీరాజ్‌ వ్యవస్థను మెరుగుపర్చేందుకు డివిజన్‌ డెవల్‌పమెంట్‌ ఆఫీసులను(డీడీవో) ప్రారంభించారు. ఒకేసారి 10 వేలమంది పంచాయతీరాజ్‌ సిబ్బందికి పదోన్నతులు కల్పించడం ద్వారా మరింత మెరుగ్గా పనిచేసేలా వారిలో ఉత్సాహం నింపారు. డీడీవోలను మినీ కలెక్టరేట్లుగా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో పవన్‌ కల్యాణ్‌ ఉన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 13,390 గ్రామ పంచాయతీల్లో ఒకేసారి గ్రామసభలు నిర్వహించడం ద్వారా ప్రపంచ రికార్డును నెలకొల్పారు. మొత్తమ్మీద వైసీపీ హయాంలో గాడి తప్పిన పంచాయతీ పాలనను గాడిన పెట్టి పంచాయతీ ఎన్నికల్లో గెలుపునకు మార్గం సుగమం చేసుకునే దిశగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోంది.

Updated Date - Dec 14 , 2025 | 04:06 AM