Share News

Road Accident Prevention: బాదుడు కాదు... బాగుకే

ABN , Publish Date - Dec 31 , 2025 | 04:03 AM

రాష్ట్రంలో ఏటా జరిగే రోడ్డు ప్రమాదాల్లో వేలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఇందుకు కారణాలు అనేకం! రోడ్లు బాగాలేకపోవడం, అతివేగం, మద్యం సేవించి వాహనాలను నడపడం!!

 Road Accident Prevention: బాదుడు కాదు... బాగుకే

  • ‘రోడ్డు భద్రత సెస్‌’పై జగన్‌ పత్రిక వక్రీకరణలు.. ప్రజలపై పన్నుల మోత అంటూ గగ్గోలు

  • లైఫ్‌ట్యాక్స్‌పై ఒక్కసారి మాత్రమే 10ు సెస్‌

  • జీఎస్టీ సంస్కరణలతో భారీగా తగ్గిన భారం

  • ప్రమాదాల నివారణ చర్యలకు పదిశాతం సెస్‌

  • ఆదా పదివేలు అయితే.. సెస్సు రూ.1200

  • సెస్సు ద్వారా వచ్చే నిధులు ప్రత్యేక ఖాతాలో

  • బ్లాక్‌ స్పాట్స్‌ బాగు, స్పీడ్‌ గన్స్‌, బ్రీత్‌ అనలైజర్ల కొనుగోలుకు వినియోగం

  • రవాణా శాఖ ప్రతిపాదనకు క్యాబినెట్‌ ఆమోదం

(అమరావతి-ఆంధ్రజ్యోతి)

రాష్ట్రంలో ఏటా జరిగే రోడ్డు ప్రమాదాల్లో వేలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఇందుకు కారణాలు అనేకం! రోడ్లు బాగాలేకపోవడం, అతివేగం, మద్యం సేవించి వాహనాలను నడపడం!! బ్లాక్‌ స్పాట్లను మరమ్మత్తు చేయడం, అతివేగం నియంత్రణకు స్పీడ్‌ గన్స్‌ ఏర్పాటు ద్వారా నిఘా పెట్టడం, తాగి నడిపేవారిని గుర్తించేందుకు బ్రీత్‌ ఎనలైజర్ల కొనుగోలు వంటి చర్యల ద్వారా రహదారులపై రక్తపాతాన్ని తగ్గించాలని ప్రభుత్వం నిర్ణయించుకుంది. దీనికి అవసరమైన నిధుల కోసం రవాణేతర (వైట్‌ నంబర్‌ ప్లేట్‌) వాహనాల లైఫ్‌ ట్యాక్స్‌పై 10 శాతం ‘రోడ్డు భద్రత సెస్‌’ సేకరణకు తాజాగా నిర్ణయించింది. అయితే దీనిపై జగన్‌ మీడియా ప్రజలను గందరగోళం చేసేందుకు ఒక ‘రోత’ కఽథనాన్ని వండింది. వాహనాలపై ‘భారీగా 10 శాతం’ సెస్‌ విధించబోతున్నారంటూ గగ్గోలు పెట్టింది. వాస్తవానికి రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాల తగ్గింపే లక్ష్యంగా బ్లాక్‌ స్పాట్స్‌ మరమ్మతు, స్పీడ్‌ గన్స్‌, బ్రీత్‌ ఎనలైజర్స్‌ కొనుగోలు, సీసీ కెమెరాల ఏర్పాటు, ఇతరత్రా అవగాహన కార్యక్రమాల కోసం నిధుల సమీకరణకు రవాణా శాఖ ప్రభుత్వానికి ఓ ప్రతిపాదన చేసింది. రవాణేతర వాహనాల లైఫ్‌ ట్యాక్స్‌పై 10 శాతం సెస్‌ సేకరించి.. ఆ సొమ్మును రోడ్డు ప్రమాదాల కట్టడికి కేటాయిస్తే ప్రజల ప్రాణాలు కాపాడేందుకు దోహదపడుతుందని వివరించింది. దీనిపై సోమవారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో చర్చించిన కూటమి ప్రభుత్వం ఆమోదం తెలిపింది.


సంస్కరణలతో భారీగా తగ్గిన జీఎస్టీ

కేంద్ర ప్రభుత్వం ఇటీవలే వాహనాలపై జీఎస్‌టీని 28 నుంచి 18 శాతానికి తగ్గించినందున వాహనాల ధరలు భారీగా తగ్గాయి. ఉదాహరణకు ఒక ద్విచక్ర వాహనం రూ.లక్ష చెల్లించి కొనుగోలు చేస్తే.. గతంలో జీఎస్‌టీ రూపంలో రూ.28 వేలు చెల్లించాల్సి వచ్చేది. ఇప్పుడు జీఎస్టీ సంస్కరణల ఫలితంగా రూ.18 వేలు మాత్రమే చెల్లించాల్సి ఉంది. దీంతో కొనుగోలుదారుకు రూ.10 వేలు ఆదా అవుతుంది. రూ.10 లక్షల కారు కొనుగోలు చేస్తే చెల్లించాల్సిన రూ.2.80 లక్షల నుంచి రూ.1.80 లక్షలకు తగ్గింది. వెరసి... అన్ని రకాల వాహనాల ధరలు భారీగా తగ్గడం నిజం. జీఎస్టీ సంస్కరణల్లో భాగంగా వాహన కొనుగోలుపై తగ్గిన పన్ను ద్వారా లభించిన ఊరటకు, ఇప్పుడు ప్రభుత్వం విధించాలనుకుంటున్న సెస్‌ సొమ్ముకు ఏ మాత్రం సంబంధం కూడా లేదు. జీఎస్‌టీ తగ్గడం వల్ల లక్ష రూపాయల బైకు కొనే వారికి రూ.10 వేలు తగ్గితే.. తాజా సెస్‌ ద్వారా పడే భారం కేవలం రూ.1,200.. అదే విధంగా రూ.10 లక్షల కారు కొనుగోలు చేసే వారికి జీఎస్టీ సంస్కరణల ద్వారా రూ.లక్ష ఆదా అవుతోంది. ఇప్పుడు ప్రభుత్వం వేయాలనుకుంటున్న సెస్‌ ద్వారా సదరు వాహనదారుడిపై పడే భారం రూ.14 వేలు మాత్రమే. అది కూడా ఒక్కసారి మాత్రమే ఈ సెస్‌ వసూలు చేస్తారు. అయితే వాస్తవానికి పూర్తిగా విరుద్ధంగా జీఎస్టీ ద్వారా లభించిన ప్రతిఫలం మొత్తం చంద్రబాబు ప్రభుత్వం లాక్కొంటోంది అంటూ రోత పత్రిక వక్రీకరణలు చేసింది.


ప్రభుత్వ ఉద్దేశం ఇదీ..

ఇలా సెస్‌ రూపంలో రాష్ట్రంలో రవాణేతర వాహనాల నుంచి వచ్చే రూ.270 కోట్లను ప్రభుత్వం ఏర్పాటు చేయనున్న ‘ఆంధ్రప్రదేశ్‌ లాజిస్టిక్‌ ఇన్‌ఫ్రా కార్పొరేషన్‌ (ఏపీ లింక్‌)’ లోకి జమ చేస్తారు. జగన్‌ హయాంలోలాగా... ‘సెస్సు’ సొమ్ములు పక్కదారిపట్టే అవకాశమే లేదు. ఈ నిధులతో రోడ్లు భవనాల శాఖ ద్వారా బ్లాక్‌ స్పాట్లను మరమ్మత్తు చేస్తారు. అతివేగం వల్ల ప్రమాదాలు జరిగే ప్రాంతాల్లో స్పీడ్‌ గన్‌లు ఏర్పాటు చేసి వాహనాలపై నిఘా పెడతారు. మద్యం సేవించి వాహనం నడిపి ప్రమాదాలకు కారణమయ్యే డ్రైవర్లను చెక్‌ చేయడానికి బ్రీత్‌ ఎనలైజర్లు కొనుగోలు చేస్తారు.

Updated Date - Dec 31 , 2025 | 04:07 AM