Share News

హంద్రీలో రోడ్డు..!

ABN , Publish Date - Mar 11 , 2025 | 12:23 AM

ర్నూలు నగరం నడిబొడ్డున హంద్రీ నది ప్రవహిస్తుంది. నదీతీరం, బఫర్‌ జోన అక్రమించి పలు ప్రాంతాల్లో పక్కా నిర్మాణాలు చేపట్టారు.

   హంద్రీలో రోడ్డు..!
రాజ్‌విహార్‌ సర్కిల్‌ నుంచి రోడ్డు పేరుతో హంద్రీ నదిని పూడ్చేస్తున్న కార్పోరేషన అధికారులు

రాజ్‌విహార్‌ సర్కిల్‌ నుంచి జోహరాపురం బిడ్జి వరకు..

మట్టితో నదిని నింపేస్తున్న వైనం

అనుమతులు లేవంటున్న ఇరిగేషన అధికారులు

నగరపాలక సంస్థకు లేఖ రాసిన ఎఫ్‌ఆర్‌ఎల్‌ డివిజన ఇంజనీర్లు

కర్నూలు, మార్చి 10 (ఆంధ్రజ్యోతి): కర్నూలు నగరం నడిబొడ్డున హంద్రీ నది ప్రవహిస్తుంది. నదీతీరం, బఫర్‌ జోన అక్రమించి పలు ప్రాంతాల్లో పక్కా నిర్మాణాలు చేపట్టారు. ఆక్రమణలు తొలగించి నదిని సంరక్షించకపోగా.. రాజ్‌విహార్‌ సర్కిల్‌ నుంచి జోహరాపురం బ్రిడ్జి వరకు నది ఒడ్డును ఆనుకొని రహదారి నిర్మాణానికి నగరపాలక సంస్థ ఇంజనీర్లు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. ఈ రోడ్డు నిర్మాణం వల్ల పాత బస్తీ (ఓల్ట్‌ టౌన) ప్రజలకు ఉపయోగమే. అయితే.. జలవనరుల శాఖ నుంచి ఎలాంటి అనుమతులు లేకుండా.. నిధులు మంజూరు చేయకుండా తాత్కాలిక మట్టితో నదిని పూడ్చేయడం విమర్శలకు తావిస్తుంది. నదిపై కాజ్‌వే కమ్‌ బిడ్జి, ఇరువైపులు రోడ్డు నిర్మాణం చేస్తే పర్యాటక కేంద్రంగా మారే అవకాశం ఉంది. పక్కా ప్రణాళిక లేకుండా డంపింగ్‌ యార్డు చెత్తతో కూడిన మట్టితో హంద్రీని నింపేయడం సరైంది కాదని తుంగభద్ర, కేసీ, హంద్రీ నదుల పరిరక్షణ కమిటీ సభ్యులు ఆరోపిస్తున్నారు.

జిల్లాలో పశ్చిమ ప్రాంతంలో పుట్టి తుంగభద్రలో కలిసే ఏకైక నది హంద్రీ. పత్తికొండ మండలం పందికోన కొండల్లో ఒక పాయగా, చిన్నహుల్తి ఎగువన మరో పాయ (వంక)గా ప్రవాహం మొదలై.. దేవనకొండ మండలం అలారుదిన్నె సమీపంలో రెండు పాయలు కలసి హంద్రీ నదిగా ప్రవహిస్తున్నది. దేవనకొండ, ఆస్పరి, గోనెగండ్ల, కోడుమూరు, కల్లూరు మండలాల్లో ప్రవహిస్తూ.. కర్నూలు నగర శివారులో జోహరాపురం బిడ్జి దిగువన తుంగభద్రలో కలుస్తుంది. నగరం మధ్యలో 5,40 కి.మీలు నది ప్రవహిస్తుంది. వివిధ ప్రాంతాలలో 200 నుంచి 300 మీటర్ల వెడల్పు ఉండాలి. గరిష్ఠ వరద ప్రవాహ అంచుల (మ్యాగ్జిమమ్‌ ఫ్లడ్‌ లెవల్‌-ఎంఎఫ్‌ఎల్‌) నుంచి 50 మీటర్ల(150 అడుగులు) వరకు నది గడ్డ వెడల్పు (బఫర్‌ జోన) ఉంటుందని జలవనరుల శాఖ ఎఫ్‌ఆర్‌ఎల్‌ డివిజన ఇంజనీర్లు తెలిపారు. కోడుమూరు మండలంలో మొదలయ్యే వక్కేరు వాగు కల్లూరు వద్ద హంద్రీలో కలుస్తుంది. నదిలో కలుస్తుంది. నగరం పరిధిలో ఈ వాగు గడ్డ వెడల్పు (బఫర్‌ జోన) 30-50 అడుగుల వరకు ఉంటుందని ఇంజనీర్లు తెలిపారు. నగర జనాభా, విస్తీర్ణం పెరగడంతో పాటు భూమి విలువ చుక్కలు తాకడంతో హంద్రీ నది పలు ప్రాంతాల్లో అక్రమణకు గురైంది. రియల్‌ ఎస్టేటర్లు సైతం నది బఫర్‌ జోనను అక్రమించి నిర్మాణాలు చేపడుతున్నారు. నది సంరక్షణకు ఆర్‌ఎస్‌ఆర్‌, ఎఫ్‌ఎంబీ.. వంటి రెవిన్యూ రికార్డుల ఆధారంగా సర్వే చేసి వాటి సహజ స్వరూపం, బఫర్‌ జోన విస్తీర్ణం గుర్తించి సరిహద్దు పిల్లర్లు ఏర్పాటు జలవనరులు శాఖ ఇంజనీర్లు రూ.45 లక్షలతో ఇప్పటికే ప్రభుత్వానికి ప్రతిపాదన పంపారు. సర్వేలు చేయలేదు, సరిహద్దులు గుర్తించ లేదు.

రోడ్డు పేరిట నదిని పూడ్చేస్తున్న వైనం:

రాజ్‌విహార్‌ సర్కిల్‌ దగ్గర అంబేడ్కర్‌ భవన వెనకాల నుంచి ఉస్మానియా కాలేజీ, ఓల్డ్‌టౌన - బుధవారపేట బిడ్జి మీదుగా జోహరాపురం వరకు దాదాపు 1.25 కిలో మీటర్లు హంద్రీ నది వెంబడి రోడ్డు నిర్మించాలనే డిమాండ్‌ చాలా కాలంగా ఉంది. ఈ రోడ్డు నిర్మాణం చేస్తే వడ్డేగేరి, ఓల్డ్‌టౌన, జమ్మిచెట్టు ఏరియా, జోహరాపురం ప్రాంతాలకు వెళ్లడానికి, అక్కడి నుంచి ప్రజలు రాజ్‌విహార్‌ సర్కిల్‌కు చేరుకొని అక్కడి నుంచి వివిధ ప్రాంతాలకు వెళ్లేందుకు అనుకూలంగా ఉంటుంది. ఆయా కాలనీ వాసులకు ట్రాఫిక్‌ సమస్య తీరుతుందని అంటున్నారు. ఈ రోడ్డు నిర్మాణంపై పాలకులకు చిత్తశుద్ధి ఉంటే.. నది వెంబడి ఎన్ని మీటర్లు వెడల్పు, ఎన్ని కిలోమీటర్లు రహదారి నిర్మిస్తున్నారో సర్వే చేయాలి. నది మట్టం నుంచి భూమట్టం వరకు ఎంత ఎత్తులో నిర్మించాలో ఇంజనీరింగ్‌ నిబంధనలు ప్రకారం డిటైల్డ్‌ ప్రాజెక్టు రిపోర్ట్‌ (డీపీఆర్‌) తయారు చేయాలి. అవసరమైన నిధులు ప్రభుత్వం ఇస్తుందా..? నగరపాలక సంస్థ సాధారణ నిధులు నుంచి ఖర్చు చేస్తున్నారా..? కేటాయింపులు చేయాలి. అదే క్రమంలో జలవనరలు శాఖ అనుమతులు తీసుకొని పక్కా ప్రణాళికతో రోడ్డు నిర్మాణం చేయాలని పలువురు కోరుతున్నారు. ఇందుకు విరుద్ధంగా జోహరాపురం డంపింగ్‌ యార్డులోని చెత్త, మట్టి, నగరంలో పాతభవనాలు కూల్చేసిన మట్టితో నదిని నింపేయడం విమర్శలకు తావిస్తుంది. ఇలా మట్టితో నింపేసి.. దానిపైనే రహదారి నిర్మిస్తే.. భవిష్యత్తులో భారీ వరదలోస్తే రోడ్డు కుంగిపోయి, ఆ సమయంలో రోడ్డుపై సాగిపోయే వాహనదారుల ప్రాణాలకే ప్రమాదం పొంచిఉందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే.. హంద్రీలో రోడ్డు నిర్మాణంపై జలవనరుల శాఖ నుంచి ఎలాంటి అనుమతులు లేవని ఆ శాఖ ఇంజనీర్లు పేర్కొంటున్నారు.

ఫ ఇలా చేస్తే..:

నగరం మధ్యలోంచి ప్రవహిస్తున్న హంద్రీ నది తుంగభద్ర నదిలో కలిసే ప్రాంతంలో చెక్‌ డ్యాం లేదా కాజ్‌వే కమ్‌ బిడ్జి నిర్మాణం చేయాలి. నది ఇరువైపుల ఆక్రమణలు తొలగించాలి. జోహరాపురం నుంచి ఆనంద్‌ థియేటర్‌ వరకు (కేసీ కెనాల్‌) హంద్రీ ఇరువైపుల రోడ్డు నిర్మాణం చేయాలి. నదిని ప్రక్షాళనం చేసి అనునిత్యం నీటి నిల్వ ఉండేలా చేస్తే.. హైదరాబాద్‌లోని ఉసేనసాగర్‌ ట్యాంక్‌ బండ్‌ తరహాలో పర్యాటకంగా అభివృద్ధి చేసే అకాశం ఉంది. అదే జరిగితే నగరం మధ్యలో జలపాతంలా హంద్రీ అందాలు నగరవాసులను కనువిందు చేస్తాయి. అదే క్రమంలో పలువురికి ఉపాధి కూడా లభిస్తుంది. తాత్కాలిక మట్టితో హంద్రీని అడ్డదిడ్డంగా పూడ్చేయడం కాకుండా పక్కా ప్రణాళికతో పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలని పలువురు డిమాండ్‌ చేస్తున్నారు.

రోడ్డు నిర్మాణం చేపడుతున్నాం - రాజశేఖర్‌, ఎస్‌ఈ, కార్పొరేషన, కర్నూలు:

హంద్రీ నది ఒడ్డున రాజ్‌విహార్‌ నుంచి జోహరాపురం వరకు రోడ్డు నిర్మాణం చేయాలనే ప్రతిపాదనం ఉంది. స్వచ్ఛాంధ్రలో భాగంగా జోహరాపురం డంపింగ్‌ యార్డు అభివృద్ధి చేస్తున్నారు. ఆ మట్టితో రోడ్డు నిర్మాణం చేపట్టాం. నగరపాలక సంస్థ ఆమోదం తరువాత పక్కా రోడ్డు నిర్మాణం చేపడతాం. అదే క్రమంలో హంద్రీపై చెక్‌ డ్యాం నిర్మించి.. ఇరువైపుల రోడ్డు నిర్మించడం ద్వారా పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు తయారు చేస్తున్నాం.

Updated Date - Mar 11 , 2025 | 12:23 AM