రోడ్ల అభివృద్ధికి కార్పొరేషన్: మంత్రి జనార్దనరెడ్డి
ABN , Publish Date - Sep 24 , 2025 | 05:38 AM
రాష్ట్రంలోని రహదారుల అభివృద్ధికి త్వరలోనే ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని రోడ్లు, భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దనరెడ్డి చెప్పారు.
అమరావతి, సెప్టెంబరు 23(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని రహదారుల అభివృద్ధికి త్వరలోనే ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని రోడ్లు, భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దనరెడ్డి చెప్పారు. గతంలో టీడీపీ హయాంలో వేసిన రోడ్లు తప్ప.. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన వైసీపీ ఒక్క ఆర్‌అండ్‌బీ రోడ్డునూ అభివృద్ధి చేయలేదని, రోడ్లు, వంతెనల నిర్వహణను పట్టించుకోలేదని చెప్పారు. రాష్ట్రంలోని రోడ్లు, వంతెనల దుస్థితిపై మంగళవారం శాసనసభలో ఎమ్మెల్యేలు పత్సమట్ల ధర్మరాజు, బొలిశెట్టి శ్రీనివాస్, బోడే ప్రసాద్, బండారు సత్యానందరావు, రామాంజనేయులు, కామినేని శ్రీనివాస్ అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిస్తూ రాష్ట్రంలోని రహదారులు, వంతెనలు అధ్వాన్నస్థితికి చేరుకున్న మాట వాస్తవమేనని చెప్పారు. ‘కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రూ.1080 కోట్లతో రోడ్లపై పడిన పెద్ద పెద్ద గుంతలను పూడ్చాం. వర్షాకాలం పూర్తయ్యాక మిగిలిన రోడ్లను అభివృద్ధి చేస్తాం. రాష్ట్రంలోని 352 వంతెనల పునర్నిర్మాణానికి రూ.1430 కోట్లు అవసరం. 16వ ఆర్థిక సంఘం నిధులతో వాటిని పునర్నిర్మిస్తాం. త్వరలో ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసి రాష్ట్రంలోని రహదారులను అభివృద్ధి చేస్తాం’ అని మంత్రి చెప్పారు.