Share News

Rooster Theft: పందెం కోళ్లూ.. జర భద్రం!

ABN , Publish Date - Dec 10 , 2025 | 04:52 AM

సంక్రాంతి సమీపిస్తున్న తరుణంలో గ్రామాల్లో ఇప్పుడు పందెం కోళ్లు మాయమవుతుండడం పెంపకందారులను కలవరపెడుతోతంది.

Rooster Theft: పందెం కోళ్లూ.. జర భద్రం!

  • మాయమవుతున్న పుంజులు

  • అదను చూసి తస్కరిస్తున్న చోరులు

  • లబోదిబోమంటున్న పెంపకందారులు

(తాడేపల్లిగూడెం రూరల్‌-ఆంధ్రజ్యోతి)

సంక్రాంతి సమీపిస్తున్న తరుణంలో గ్రామాల్లో ఇప్పుడు పందెం కోళ్లు మాయమవుతుండడం పెంపకందారులను కలవరపెడుతోతంది. గోదావరి జిల్లాల్లో ఎక్కువగా పందేలకు పుంజులను సిద్ధం చేస్తుండగా.. కొన్ని గ్రామాల్లో ఒక కుటీర పరిశ్రమగా వీటిని పెంచుతుంటారు. ఇదే తరుణంలో చోరులు తమ చేతివాటం చూపిస్తున్నారు. ఎంతో ఖర్చుపెట్టి శ్రద్ధతో పెంచిన కోళ్లు తెల్లారేసరికి కనిపించకపోవడంతో పెంపకందారులు లబోదిబోమంటున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలం అప్పారావుపేటలో 2 రోజుల క్రితం 3 పందెం పుంజులను ఎత్తుకెళ్లిపోయారు. వాటి ధరలు ఒక్కొక్కటి రూ.10వేలకు పైగానే పలుకుతుండగా.. ఇలా జిల్లాలోని పలు గ్రామాల్లో పుంజుల చోరీలు జరిగినట్లు సమాచారం!

ఎంతో కష్టపడి పెంచుకుంటే..

పుంజులను ఏడాది పాటు పసిపిల్లల్లా ఎంతో జాగ్రత్తగా.. పెంచిన పెంపకందారులకు దొంగలు సవాల్‌ విసురుతున్నారు. పండగ సమీపిస్తున్న తరుణంలో పందేల కో సం పుంజులు కొంటామని కొంద రు వ్యక్తులు బ్యాచ్‌ల వారీగా పల్లె ల్లో గాలిస్తున్నారు. పెంపకందారుల వద్ద పుంజులను చూసి వాటి రంగు, పందేల హిస్టరీ, బ్రీడ్‌ తెలుసుకుని బేరమాడుతున్నారు. బేరం తెగకపోవడంతో మళ్లీ వస్తామంటూ వెళ్లిపోతున్నా రు. అయితే ఇలా బేరం ఆడిన పదిరోజులకు ఆ పుంజులపై నిఘా వేసి తస్కరిస్తున్నారు.


ఆన్‌లైన్‌లో పుంజులంటూ మోసం

మరోవైపు ఆన్‌లైన్‌లో కొందరు పుంజుల ఫోటోలు పెడుతున్నారు. దానికి తగ్గట్టే ఆకర్షణీమైన ధరలు పెడుతున్నారు. ధర నచ్చి పుంజులు కావాలని వాట్సాప్‌లో కొనుగోలుదారులు బేరమాడితే.. ముందు అడ్వాన్సు కొట్టమని మెస్సేజ్‌ చేస్తున్నారు. తీరా అడ్వాన్స్‌ కొట్టి పుంజుల కోసం వారు చెప్పిన చోటకు వెళ్లి చూస్తే ఆ ఫోన్‌ నంబరు స్విచ్చాఫ్‌ వస్తోంది. ఆరా తీస్తే అది ఫేక్‌ అని తెలిసి కంగుతింటున్నారు. తాడేపల్లిగూడెం పట్టణంలో ఓ యువకుడికి పుంజులు పెంచడం సరదా. ఆన్‌లైన్‌లో సెర్చ్‌ చేయగా ఓ యా ప్‌లో జాతి పుంజులు ఉన్నాయని చూసి పోస్ట్‌ చేశాడు. అడ్వాన్స్‌ కింద రూ.పది వేలు ఆన్‌లైన్‌లో పంపాడు. తరువాత ఆ నంబర్‌ పనిచేయ లేదు. ఏంటని ఆరా తీస్తే అది ఫేక్‌ అని తేలింది. ఇలా సంక్రాంతి పందేల మాటున పుంజుల మోసాలకు దిగుతున్నారు.

Updated Date - Dec 10 , 2025 | 04:54 AM