Banana Prices: అరటిపైనా అబద్ధాలు
ABN , Publish Date - Dec 05 , 2025 | 04:19 AM
పులివెందుల.. మాజీ సీఎం జగన్ సొంతగడ్డ. ఆయన పులివెందుల ఎమ్మెల్యే కూడా. అదే పులివెందుల మార్కెట్‌లో ప్రస్తుతం నాణ్యత గల అరటి టన్ను రూ.5-6 వేల మధ్య ధర పలుకుతోంది.
కిలో అర్ధ రూపాయంటూ జగన్ ప్రచారం
పులివెందుల మార్కెట్‌లో నాణ్యమైన అరటి టన్ను రూ.5-6 వేలు
(అమరావతి-ఆంధ్రజ్యోతి)
పులివెందుల.. మాజీ సీఎం జగన్ సొంతగడ్డ. ఆయన పులివెందుల ఎమ్మెల్యే కూడా. అదే పులివెందుల మార్కెట్‌లో ప్రస్తుతం నాణ్యత గల అరటి టన్ను రూ.5-6 వేల మధ్య ధర పలుకుతోంది. బయటి వ్యాపారులు ఈ మేరకు కొనుగోలు చేస్తున్నారని రైతులే చెబుతున్నారు. ఇతర రాష్ట్రాలకు ఎగుమతి ఆర్డర్లు పెద్దగా లేకపోవడంతో... లోకల్‌గా కూడా టన్ను రూ.2-3 వేలుకు కొనుగోలు చేస్తున్నారు. కానీ కిలో అర్ధ రూపాయి కూడా పలకట్లేదని జగన్ అన్నారు. దీంతో రైతులతో పాటు వ్యాపారులూ ముక్కన వేలేసుకుంటున్నారు. వాస్తవానికి రాయలసీమలో బాగా పండిస్తున్న చుక్క అరటికి నెల రోజులుగా డిమాండ్ లేకుండా పోయింది. ఢిల్లీ, కోల్‌కతా, ముంబై మార్కెట్లకు ఎగుమతులు మందగించాయి. గెలలు దించాక రెండు వారాలు కూడా నిల్వ ఉండని అరటికి మొదటి నుంచీ డిమాండ్ తక్కువే. పంట ఎక్కువగా ఉంటే ధర తగ్గడం సహజం. ఈ ఏడాది ఉత్తరప్రదేశ్, మహారాష్ట్రలో అరటి ఉత్పత్తి గణనీయంగా పెరగడంతో తక్కువ ధరకు వస్తున్నాయి. ఢిల్లీ, ముంబై, హరియాణా వంటి పెద్ద మార్కెట్లకు అరటి గెలలు ఇబ్బడిముబ్బడిగా చేరుతున్నాయి. దీంతో అక్కడి వ్యాపారులు దూరప్రాంతంలో ఉన్న రాయలసీమ నుంచి అరటి కొనుగోలుకు ఆసక్తి చూపడం లేదు. కొవిడ్ సమయంలో అరటికి డిమాండ్ ఉండడంతో కిసాన్ రైళ్లలో ఉత్తరాది రాష్ట్రాలకు సీమ రైతులు ఎగుమతి చేశారు. తర్వాతి కాలంలో కూడా అడపాదడపా రైళ్లలో ఎగుమతులు సాగుతూనే ఉన్నాయి.
గతేడాది కూడా టన్ను రూ.25-27 వేలు పలికింది. కానీ ప్రస్తుత సీజన్‌లో ఉత్తరాది రాష్ట్రాల్లో అరటి ఉత్పత్తి బాగా పెరగడంతో.. రాయలసీమ అరటికి డిమాండ్ తగ్గింది. మరోవైపు సీమలో అరటి సాగు ఏటేటా పెరుగుతూనే ఉంది. ఎగుమతి ఆర్డర్లు లేకపోవడంతో ప్రభుత్వం స్పందించి ఉద్యానశాఖ అధికారులు, రైతు ప్రతినిధుల బృందాన్ని ఢిల్లీ, హరియాణా మార్కెట్లకు పంపించింది. పెద్ద వ్యాపారులతో చర్చించింది. అయితే యూపీ, మహారాష్ట్ర నుంచి తక్కువ ధరకే అరటి లభిస్తున్నందున డిసెంబరు మొదటి వారం తర్వాత సీమకు వస్తామని అక్కడి వ్యాపారులు చెప్పారు. దీనిపై ఉద్యానశాఖ అధికారులు ఇతర రాష్ట్రాల వ్యాపారులతో చర్చలు కొనసాగిస్తున్నారు. రాష్ట్రంలో కడప, అనంతపురం, కర్నూలుతో పాటు ఉభయగోదావరి, విజయనగరం జిల్లాల్లో అరటి ప్రధానంగా సాగవుతోంది. 1.30 లక్షల హెక్టార్లలో 87.10 లక్షల టన్నుల దిగుబడి వస్తోంది. సీమ క్లస్టర్‌లో గ్రాండ్ నైన్ రకమే 45 వేల హెక్టార్లలో, 100ు మైక్రో ఇరిగేషన్, ఫర్టిగేషన్‌తో కలిపి సాగులో ఉంది.
ధర పెరుగుతోంది: ఉద్యాన డైరెక్టర్
ప్రభుత్వ చర్యల ఫలితంగా ఉత్తరాది రాష్ట్రాల అగ్రిగ్రేటర్లు ఏపీ నుంచి అరటిని సేకరించడం ప్రారంభించడంతో కడప, అనంతపురం జిల్లాల నుంచి తాజాగా 700 టన్నుల అరటి ఉత్తరాది మార్కెట్లకు ఎగుమతి అయినట్లు ఉద్యాన శాఖ డైరెక్టర్ శ్రీనివాసులు తెలిపారు. రాయలసీమలో గత వారంలో టన్ను రూ.2 వేలున్న ధర ప్రస్తుతం రూ.4 వేలతో రెట్టింపు అయిందని చెప్పారు.