Share News

CSE Growth: బీటెక్‌లో సీఎస్‌ఈ జోరు

ABN , Publish Date - Jul 14 , 2025 | 04:24 AM

రాష్ట్రంలో ఇంజనీరింగ్‌ విద్య స్వరూపం మారుతోంది.ఒకప్పుడు ఇంజనీరింగ్‌ అంటే కోర్‌ గ్రూపులకు ఎక్కువ ప్రాధాన్యత ఉండేది. కానీ గత కొన్నేళ్లుగా కంప్యూటర్‌ సైన్స్‌ ఇంజనీరింగ్‌ (సీఎస్‌ఈ) తప్ప మరో బ్రాంచ్‌ లేదన్నట్టుగా....

CSE Growth: బీటెక్‌లో సీఎస్‌ఈ జోరు

  • ఇతర ఇంజనీరింగ్‌ బ్రాంచ్‌లు బేజారు

  • కంప్యూటర్‌ సైన్స్‌ గ్రూపుల్లోనే 55శాతం సీట్లు

  • సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగాలపై మక్కువే కారణం

  • ఈసీఈకి కూడా పెరిగిన డిమాండ్‌

  • సివిల్‌,మెకానికల్‌,ఈఈఈ వంటి

  • కోర్‌ బ్రాంచ్‌ల్లో క్రమంగా తగ్గుతున్న సీట్లు

(అమరావతి-ఆంధ్రజ్యోతి)

రాష్ట్రంలో ఇంజనీరింగ్‌ విద్య స్వరూపం మారుతోంది.ఒకప్పుడు ఇంజనీరింగ్‌ అంటే కోర్‌ గ్రూపులకు ఎక్కువ ప్రాధాన్యత ఉండేది. కానీ గత కొన్నేళ్లుగా కంప్యూటర్‌ సైన్స్‌ ఇంజనీరింగ్‌ (సీఎస్‌ఈ) తప్ప మరో బ్రాంచ్‌ లేదన్నట్టుగా ఇంజనీరింగ్‌ విద్య మారిపోయింది.2025-26 విద్యా సంవత్సరంలోనూ ఇదే ట్రెండ్‌ కొనసాగుతోంది. కాలేజీ యాజమాన్యాలు సీఎస్‌ఈసీట్లను ఏటా పెంచుకుంటూ వెళ్తున్నాయి. విద్యార్థులు సీఎ్‌సఈ సీట్లే కావాలని కోరుకుంటున్నందున ప్రైవేటు కాలేజీలు అందుకు అనుగుణంగా ఆ బ్రాంచ్‌లలో సీట్లు పెంచుకుంటున్నాయి. ఫలితంగా కోర్‌ ఇంజనీరింగ్‌ బ్రాంచ్‌లలో సీట్లు తగ్గిపోతున్నాయి. ఆయా బ్రాంచ్‌ల్లో ఉన్నవే తక్కువ సీట్లు అయినా..అవి కూడా పూర్తిగా భర్తీ కావట్లేదు. అయితే ఏఐసీటీఈ నిబంధనల ప్రకారం ప్రతి కాలేజీలో మూడు కోర్‌ బ్రాంచ్‌లు తప్పనిసరిగా ఉండాలి.అందువల్ల కాలేజీలు కోర్‌ బ్రాంచ్‌ల్లో సీట్లను కనీస సంఖ్యకు కుదించుకుంటున్నాయి. మరోవైపు సీఎస్ఈ బ్రాంచ్‌లను పెంచుకుంటున్నాయి.2025-26 విద్యా సంవత్సరంలో రాష్ర్టానికి ఏఐసీటీఈ మంజూరు చేసిన సీట్లలో 55.24 శాతం సీట్లు ఒక్క సీఎ్‌సఈలోనే ఉన్నాయి.సివిల్‌, మెకానికల్‌, ఈఈఈ,ఈసీఈ, ఇతర బ్రాంచ్‌ల్లో అన్నిట్లో కలిపినా 45 శాతం సీట్లు మాత్రమే ఉన్నాయి. ఈ సంవత్సరం ప్రైవేటు కాలేజీలు, యూనివర్సిటీలకు ఏఐసీటీఈ 1,85,734 సీట్లు మంజూరు చేసింది. అందులో 1,02,614 సీట్లు ఒక్క కంప్యూటర్‌ సైన్స్‌లోనే ఉన్నాయి.


అనుబంధ బ్రాంచ్‌లే అయినా..వేర్వేరుగా!

సీఎస్ఈలోనూ అనేక బ్రాంచ్‌లు వచ్చాయి.సీఎస్ఈ కోర్‌ బ్రాంచ్‌ ఒకటి అయితే... సీఎస్ఈ- డేటాసైన్స్‌, క్లౌడ్‌ కంప్యూటింగ్‌, సైబర్‌ సెక్యూరిటీ, ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌, ఏఐ-మెషీన్‌ లెర్నింగ్‌, ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌లతో పాటు బ్లాక్‌చైన్‌, ఇతరత్రా కొత్త బ్రాంచ్‌లు సీఎస్ఈ అందుబాటులోకి వస్తున్నాయి. అయితే ఇవన్నీ సీఎస్ఈ అనుబంధ బ్రాంచ్‌లే అయినా ఏఐసీటీఈ మాత్రం వాటిని వేర్వేరుగా పరిగణిస్తుంది. అందువల్ల బ్రాంచ్‌లను వేరుగా చూపిస్తూ కాలేజీలు సీట్లు పెంచుకుంటున్నాయి. ఈ సంవత్సరం కొత్తగా క్వాంటం కంప్యూటింగ్‌ బ్రాంచ్‌ కూడా వచ్చింది. ఇవి కాకుండా ప్రైవేటు, డీమ్డ్‌ యూనివర్సిటీల్లోనూ భారీగా సీట్లు అందుబాటులో ఉన్నాయి. రాష్ట్రంలోని నాలుగు డీమ్డ్‌ యూనివర్సిటీల్లో దాదాపు 10 వేల సీట్లు అందుబాటులో ఉన్నాయి.వాటిలో ఐదు వేలకు పైగా సీఎస్ఈ సీట్లు ఉన్నాయి.11 ప్రైవేటు యూనివర్సిటీల్లో 11,500 సీట్లు ఉండగా..వాటిల్లోనూ సగానికి పైగా సీఎస్ఈ సీట్లు ఉంటాయి.


సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగమే కావాలి

సివిల్‌,మెకానికల్‌,ఈఈఈ,ఈసీఈ కోర్సులు చదివితే నిర్మాణ రంగం, ఉత్పత్తి రంగంలో ఉద్యోగావకాశాలు ఉంటాయి. సీఎస్ఈ,ఐటీ బ్రాంచ్‌లు చదివిన వారికి క్యాంపస్‌ ఇంటర్వ్యూల్లోనే మంచి ప్యాకేజీలతో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగాలు వస్తున్నాయి. దీంతో 80 శాతం మంది విద్యార్థులు సీఎస్‌ఈకే మొగ్గు చూపుతున్నారు.సీఎస్ఈ సీటు రాకపోతే డిగ్రీలో బ్యాచిలర్‌ ఆఫ్‌ కంప్యూటర్‌ అప్లికేషన్స్‌ (బీసీఏ)లో చేరేందుకు ఆసక్తి చూపుతున్నారు. పేరున్న కాలేజీల్లో చదివిన వారికే క్యాంపస్‌ ఉద్యోగాలు లభిస్తున్నాయి.

Updated Date - Jul 14 , 2025 | 04:24 AM