Share News

Information Denial: దేవదాయ శాఖలో ఆర్టీఐ రచ్చ

ABN , Publish Date - Oct 08 , 2025 | 05:20 AM

దేవదాయ శాఖ అధికారులు ఆర్టీఐతో ఆటలాడుతున్నారు. ఈ శాఖకు సంబంధించిన సమాచారం కోరిన వారిని ముప్పుతిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగిస్తున్నారు.

Information Denial: దేవదాయ శాఖలో ఆర్టీఐ రచ్చ

  • అడిగిన సమాచారం ఇవ్వని కమిషనరేట్‌ అధికారులు

  • కమిషనర్‌ ఆగ్రహించినా అధికారుల్లో కనిపించని మార్పు

(అమరావతి-ఆంధ్రజ్యోతి)

దేవదాయ శాఖ అధికారులు ఆర్టీఐతో ఆటలాడుతున్నారు. ఈ శాఖకు సంబంధించిన సమాచారం కోరిన వారిని ముప్పుతిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగిస్తున్నారు. చివరికి ఆర్టీఐ కమిషనర్‌ ఆదేశాలను కూడా బేఖాతరు చేస్తూ, దరఖాస్తుదారులకు చుక్కలు చూపిస్తున్నారు. కమిషనరేట్‌లో ఆర్టీఐ దరఖాస్తుదారులకు చిన్న సమాచారం ఇవ్వడానికి కూడా అధికారులు ఆసక్తి చూపడం లేదు. దీంతో ప్రతి కేసు విషయంలోనూ ఆర్టీఐ కమిషనర్‌ (రెండో అప్పిలేట్‌ అథారిటీ) వద్దకి వెళ్లాల్సి వస్తోంది. దేవదాయ శాఖ ప్రధాన కార్యాలయంలో సీనియర్‌ అసిస్టెంట్లకు సంబంధించిన కేడర్‌ స్ర్టెంత్‌, రోస్టర్‌ రిజిస్టర్‌, నోట్‌ఫైల్‌ కావాలని ఒక దరఖాస్తుదారుడు 3 నెలల క్రితం ఆర్టీఐ ద్వారా సమాచారం కోరారు. శాఖ పబ్లిక్‌ ఇన్ఫర్మేషన్‌ అధికారి (పీఐవో) తాను కోరిన సమాచారం ఇవ్వకపోవడంతో ఆర్టీఐ కమిషనర్‌ను సంప్రదించారు. దరఖాస్తుదారు అడిగిన వివరాలు వెంటనే ఇవ్వాలని ఆయన అధికారులను ఆదేశించారు. ఆ తర్వాత కూడా సాకులు చెప్పి తప్పించుకున్నారు. చివరికి కమిషనర్‌ గట్టిగా ప్రశ్నించడంతో వెంటనే సమాచారం ఇస్తామని అధికారులు ప్రమాణ పూర్వక అఫిడవిడ్‌ దాఖలు చేశారు. అప్పుడు కూడా తప్పుడు సమాచారం అందించడంతో విషయాన్ని దరఖాస్తుదారు మరోసారి కమిషనర్‌ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో దేవదాయ శాఖ అధికారుల నిర్లక్ష్యంపై ఆయ న తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. నోట్‌ఫైల్‌తో పాటు మిగిలిన సమాచారం మొత్తం ఇవ్వాలని మరోసారి ఆదేశించారు. అయినా అధికారులు మాత్ర ం కమిషనర్‌కే పాఠాలు చెబుతూ నోట్‌ఫైల్‌ ఆర్టీఐ కిందకు రాదని, కాబట్టి దాన్ని ఇవ్వాల్సిన అవసరం లేదని సమాధానం ఇచ్చారు. మరోవైపు కేడర్‌ స్ట్రెంత్‌ రిజిస్టర్‌కు బదులు పోస్టుల కేటాయింపు పత్రాలు ఇచ్చారు. తప్పుడు సమాచారం ఇచ్చి చేతులు దులుపుకోవడంపై కమిషనర్‌ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. దేవదాయ శాఖ కమిషనరేట్‌లో కింద స్థాయి నుంచే అధికారుల్లో నిర్లక్ష్య ధోరణి కనిపిస్తోంది. చిన్న సమాచారానికి కూడా రెండో అప్పిలేట్‌ అథారిటీ వద్దకు వస్తుండటంతో ఆర్టీఐ కమిషనర్లు చివాట్లు పెడుతున్నా అధికారుల తీరులో మార్పు రావడం లేదు.


ఫైళ్లను తొక్కిపెట్టేందుకేనా?

దేవదాయ శాఖ కమిషనరేట్‌లో ఎవరి దారి వారిదే అన్నట్లుగా తయారైంది. చివరికి రాజ్యాంగ బద్ధమైన ఆర్టీఐ కమిషనర్ల ఆదేశాలు కూడా అమలు కావడం లేదు. ఎస్టాబ్లిష్‌మెంట్‌తో పాటు కొన్ని విభాగాల సిబ్బందిని ఎన్నిసార్లు అడిగినా సమాచారం ఇవ్వడం లేదని విచారణ సమయంలో దేవదాయ శాఖ పబ్లిక్‌ ఇన్ఫర్మేషన్‌ అధికారి చెప్పడంతో కమిషనర్లు విస్తుపోవాల్సి వస్తోంది. అసలు దరఖాస్తుదారు కోరిన సమాచారం కమిషనరేట్‌లో ఉందా? లేకపోతే ఉద్దేశపూర్వకంగానే ఇవ్వడం లేదా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దేవదాయ శాఖలో రోస్టర్‌ పాటించకుండా పదోన్నతులు కల్పిస్తుంటారు. డిప్యూటీ కమిషనర్‌ పోస్టులను ఇష్టారాజ్యంగా భర్తీ చేశారు. ఇలా అన్ని కేడర్లలో పదోన్నతులపై పలు ఫిర్యాదులున్నాయి. అక్రమ పదోన్నతుల బాగోతాన్ని ఆర్టీఐ దరఖాస్తులు వెలుగులోకి వస్తే అనేక సమస్యలు వస్తాయనే ఉద్దేశంతో కొన్ని విభాగాల అధికారులు ఫైళ్లు బయటకు రానివ్వకుండా చూస్తున్నారు. ఈ క్రమంలో ఆర్టీఐ కమిషనర్ల వద్ద కూడా సమాచారాన్ని గోప్యంగా ఉంచుతున్నారు. ఈ వ్యవహారంపై కమిషనర్‌ దృష్టిసారించి ఆర్టీఐ వ్యవస్థకు గౌరవం దక్కేలా చేయాలన్న డిమాండ్లు వినిపిస్తున్నాయి.

Updated Date - Oct 08 , 2025 | 05:20 AM